- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘శాశ్వతంగా చెరిపేస్తాం’.. CM రేవంత్‌కు ప్రశాంత్ రెడ్డి హెచ్చరిక
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తే చెరిగిపోయేవి కావని మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తే చెరిగిపోయేవి కావని మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచం గర్వించదగ్గ నిర్మాణాలు చేపట్టడం కేసీఆర్‌కే సాధ్యమని, ఆయన ఆనవాళ్లను చెరిపేస్తా అని చెప్పిన వాళ్లు, ఇప్పుడు వాటినే ప్రపంచానికి చూపించుకునే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదాద్రి దేవాలయం కేసీఆర్ హయాంలో నిర్మించిన తెలంగాణకు తలమాణికాలని, అవి గొప్ప నిర్మాణాలని, మట్టి రాతలు కాదని పేర్కొన్నారు. రాష్ట్రం ఉన్నంత కాలం శాశ్వతంగా నిలిచిపోయే కేసీఆర్ ఆనవాళ్లు అని తెలిపారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన పోటీదారులతో తెలంగాణ గొప్ప తనం ప్రపంచానికి తెలిసేలా చేయడానికి కేసీఆర్ కట్టించిన ఆ నిర్మాణాలే ఈ ప్రభుత్వానికి దిక్కయ్యాయని పేర్కొన్నారు.
తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అని, వాటిని చెరిపేయాలనుకోవడం రేవంత్‌రెడ్డి మూర్ఖత్వమే అవుతుందని ఎద్దేవా చేశారు. పదేండ్లలో రాష్ట్రం అన్నిరంగాల్లో దేశంలో అగ్రగామిగా నిలిస్తే.. రేవంత్‌రెడ్డి ఆవగాహన లేని పరిపాలనతో అన్ని రంగాల్లోనూ రోజురోజుకూ దిగజారుతున్నదని పేర్కొన్నారు. ధాన్యం కొనేవారు లేక, అకాల వర్షాలకు తడిచిన ధాన్యం అమ్ముకోలేక బాధతో కల్లాల మీద రైతులు ప్రాణాలు వదులుతున్నారని, జీతాలు సరిగ్గా రాక చిన్న ఉద్యోగులు నిత్యం నిరసనలు తెలియజేస్తున్నారని, రాష్ట్రంలో విచ్చలవిడిగా క్రైమ్ రేట్ పెరిగిపోతున్నదని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా అంతా బాగున్నట్టు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణలో మునిగి తేలుతున్నారని ఆరోపించారు. అప్పు పుట్టటం లేదని అంటూనే అందాల పోటీల పేరుతో వందల కోట్ల దుబారా ఖర్చు ఎందుకు చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. ప్రజలే రేవంత్‌రెడ్డి రాజకీయ ఆనవాళ్లు తెలంగాణ నుండి శాశ్వతంగా చెరిపేస్తారని హెచ్చరించారు.






