Prashanth Reddy: మళ్లీ అదే రీతిలో ఆంధ్రాకు నీళ్ల తరలింపు

by Gantepaka Srikanth |

ప్రజా భవన్‌లో నిర్వహించిన పీపీటీతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ అజ్ఞానం మరోసారి బయట పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Prashanth Reddy: మళ్లీ అదే రీతిలో ఆంధ్రాకు నీళ్ల తరలింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా భవన్‌లో నిర్వహించిన పీపీటీతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ అజ్ఞానం మరోసారి బయట పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేవంత్ ప్రభుత్వ అజ్ఞానాలను, అబద్ధాలను చూసి యావత్ తెలంగాణ సమాజం అసహ్యించుకుంటున్నదని ఆరోపించారు. కుక్క తోక వంకర అన్నట్లు చెప్పిందే పదేపదే చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. 50 ఏండ్ల పాలనలో తెలంగాణ నీటి పారుదల రంగాన్ని, సాగు రంగాన్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. పదవుల కోసం నాటి మంత్రులు పెదవులు మూసుకొని ఆంధ్రాకు దాసోహం అయ్యారని పేర్కొన్నారు. మళ్లీ అదే రీతిలో ఆంధ్రాకు నీళ్ల తరలింపులో తోడ్పాటు అందిస్తున్నదని తెలిపారు. అప్పుడు, ఇప్పుడూ ఎప్పుడూ కాంగ్రెస్‌ది ద్రోహ చరిత్రనే అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు మూలన పడిందని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు చేపట్టేందుకు మహారాష్ట్ర ఒప్పుకోకున్నా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాలువలు తవ్వి, మొబిలైజేషన్ అడ్వాన్సులను కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది నిజం కాదా? అని నిలదీశారు. కేంద్రంలో, మహారాష్ట్ర, ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చొన్నారని ప్రశ్నించారు. ఏ కమీషన్లు దండుకునేందుకు రూ.17వేల కోట్ల నుంచి రూ.40వేల కోట్లకు ప్రాణహిత అంచనాలు పెంచారని నిలదీశారు. మేడిగడ్డను పడావు పెట్టి నీళ్లను కిందకు వదిలి రేవంత్ చోద్యం చూస్తున్నారని పేర్కొన్నారు. మేడిగడ్డను రిపేర్ చేయాలని ఎన్డీఎస్ఏ చెప్పినా, ఎల్అండ్‌టీ రిపేర్ చేయడానికి సిద్ధపడినా ఎందుకు మరమ్మతులు చేయడం లేదని ప్రశ్నించారు. సెక్షన్ 3 సాధించింది కేసీఆర్ అని.. ట్రిబ్యునల్ ముందు 573 టీఎంసీలకు అఫిడవిట్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటాను ఆంధ్రాకు అప్పజెప్పిన కాంగ్రెస్ నాయకులను కొరడా దెబ్బలు కొట్టాలని పేర్కొన్నారు.

Next Story