- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ పార్టీకి అందుకే రాజీనామా చేస్తున్నా : జీవన్ రెడ్డి
నేడు కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఇందుకు గల కారణాలను ఆయన వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా ఉన్న సీనియర్ నాయకులు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు పార్టీకి రాజీనామా చేసి.. ఆ లేఖను ఏఐసీసీ, పీసీసీకి పంపనున్నారు. ఈ రాజీనామాతో జీవన్ రెడ్డికి కాంగ్రెస్ తో ఉన్న నాలుగు దశాబ్దాల రాజకీయ బంధానికి తెరపడనుంది. గత 20 నెలలుగా తాను తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యానని, ఆత్మగౌరవం లేని చోట కొనసాగలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు.
రాహుల్ నిర్ణయానికి వ్యతిరేకంగా..
జీవన్ రెడ్డి తన రాజీనామాకు సంబంధించి ప్రధానంగా పార్టీలో జరుగుతున్న ఫిరాయింపుల అంశాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకోవడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుంటే, తెలంగాణలో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో తన ప్రత్యర్థిగా ఉన్న ఎం.ఎస్. సంజయ్ కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవడాన్ని జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. తనతో కనీసం సంప్రదించకుండా తీసుకున్న ఈ నిర్ణయం తనను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ భవిష్యత్తుపై కార్యకర్తలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని జీవన్ రెడ్డి వెల్లడించారు. "నేను పదవుల కోసం ఆశపడే వ్యక్తిని కాదు. కార్యకర్తల గౌరవం కాపాడటమే నా ప్రాధాన్యత. రేపటి నుంచి గ్రామాల్లో పర్యటించి, వారి అభిప్రాయాల మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను" అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత రాజీనామా చేయడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆయనను బుజ్జగించేందుకు పార్టీ అగ్రనాయకత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయన మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తోంది.






