CM రేవంత్ మానసిక స్థితి దెబ్బతినట్లుంది: మాజీ మంత్రి

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి మానసిక స్థితి దెబ్బతిన్నట్లుందని, సందర్భం లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జగదీష్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM రేవంత్ మానసిక స్థితి దెబ్బతినట్లుంది: మాజీ మంత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి మానసిక స్థితి దెబ్బతిన్నట్లుందని, సందర్భం లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జగదీష్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటలను చూసి సిగ్గు సిగ్గుపడేలా ఉందని, నిఘా పెట్టడానికి కేసీఆర్ కమాండ్ కంట్రోల్ నిర్మిస్తే రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్‌లో కూర్చుని మా పార్టీ నేతలపై నిఘా పెడుతున్నారని మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రగతి భవన్‌లో బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు ఉంటే చూపించాలని, బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, కమాండ్ కంట్రోల్, సెక్రటేరియట్ పైన కమిషన్ వేయాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అజెండా పైనే జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేయబోతున్నారని, దేశంలో ఎవరూ తిట్టని విధంగా వైఎస్ఆర్‌ను, సోనియాగాంధీని తిట్టింది కూడా రేవంత్ రెడ్డి అన్న సంగతి మరిచిపోవద్దన్నారు.

ప్రయివేటు కాలేజీ యాజమాన్యాలను ఎన్ని రోజులు భయపెడతావో చూస్తామని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత సీఎం పదవికి ఉపద్రవం వస్తుందని ఎద్దేవా చేశారు. ఆవేశంలో ఎక్కువ తప్పులు చేస్తున్నారని, మూర్ఖపు మాటలు మానుకోవాలని సూచించారు. ఏం చేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందన్నారు. ఆయన చేసే తప్పులకు చరిత్ర క్షమించదని నోటి దూలతో బిహార్ నుంచి వెల్లగొట్టే పరిస్థితి వచ్చిందన్నారు. అక్కడి ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డిని వద్దని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పిలిపించుకునట్లు పేర్కొన్నారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి పదవుల్లో ఉన్నారని ఈ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్, మోడీ శిష్యులేనన్నారు. తెలంగాణ అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి భాధ్యత రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీసుకోవాలని సూచించారు. మాగంటి గోపీనాథ్ తల్లితో ఎవరు మాట్లాడిస్తున్నారో ప్రజలందరికీ అర్ధమైతుందన్నారు. ముఖ్యమంత్రి డ్రగ్స్ మత్తులో మాట్లాడుతున్నట్టు ఉందని ఆయన సీఎం పదవి వచ్చాక నేరాలు పెరిగినట్లు తెలిపారు. వారి భాషతో తెలంగాణ పరువు పోతోంది. ఇప్పటికైనా తన భాష మార్చుకుంటే ఆయనకే మంచిదన్నారు.

Next Story