Harish Rao: 26 మెడికల్ కాలేజీల భవితవ్యం ప్రశ్నార్థకం.. హరీశ్ రావు ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |   (  Updated:2025-06-16 12:48:44  IST  )

చేతులు కాలినాక ఆకులు పట్టిన చందంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు.. అని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు.

Harish Rao: 26 మెడికల్ కాలేజీల భవితవ్యం ప్రశ్నార్థకం.. హరీశ్ రావు ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: చేతులు కాలినాక ఆకులు పట్టిన చందంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు.. అని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల (medical colleges) భవితవ్యం సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రశ్నార్థకంగా మారడం అత్యంత శోచనీయమని ఆందోళన చెందారు. 26 మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు, వసతులు నిబంధనలకు అనుగుణంగా లేవని, ఈనెల 18న హెల్త్ సెక్రటరీ, డీఎంఈ ఎన్ఎంసీ (National Medical Commission) ముందు ప్రత్యక్షంగా హాజరుకావాలని తాఖీదులు ఇవ్వడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. ఇంత ముఖ్యమైన విషయంపై ఆలస్యంగా మేల్కొన్న సీఎం ఈ రోజు కమిటీ వేయడం హాస్యాస్పదమన్నారు.

పరిపాలన గాలికి వదిలేసి ప్రతీకార రాజకీయాలు చేస్తున్న రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గారూ.. 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుతున్న వందల మంది విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరు భరోసా? అని ప్రశ్నించారు. మీ పరిపాలన వైఫల్యం మెడికల్ విద్యార్థులకు శాపంగా మారుతోందని పేర్కొన్నారు. ఎన్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన లేఖను మీకు పంపిస్తున్నాను.. ఇప్పటికైనా కళ్ళు తెరిచి 26 మెడికల్ కాలేజీల భవితవ్యాన్ని కాపాడాలని సూచించారు. తక్షణమే మెడికల్ కళాశాలలకు కావాల్సిన నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంతో శ్రమించి డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకునే విద్యార్థులు జీవితాలను నిలబెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.

Next Story