ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎక్కడా చూడలేదు.. సర్కార్‌పై మాజీ మంత్రి గంగుల ఫైర్

by Gantepaka Srikanth |

కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల దందాను దారి మళ్లించడానికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు పంపించారని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.

ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎక్కడా చూడలేదు.. సర్కార్‌పై మాజీ మంత్రి గంగుల ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల దందాను దారి మళ్లించడానికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు పంపించారని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డకు రిపేర్ చేయనందుకు రేవంత్‌రెడ్డి మీద కమిషన్ వేయాలన్నారు. కేసీఆర్ తెలంగాణ సమాజం కోసం కాళేశ్వరం కట్టారని, గుల్జార్ హౌజ్ ప్రమాద ఘటన వైఫల్యాన్ని డైవర్ట్ చేయడానికే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు నోటీసులతో ప్రజలు బాధపడుతున్నారని.. ఇది యావత్ తెలంగాణ సమాజానికి ఇచ్చిన నోటీసు అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద పంటలు పండించుకున్న రైతులకు ఇచ్చిన నోటీసులని, రేవంత్‌రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు. మేడిగడ్డ 85 పియర్స్‌లో మూడు కుంగిపోతే ప్రాజెక్టు మొత్తం విఫలమైనట్టేనా అని ప్రశ్నించారు.

మార్చి 13, 2024లో ఘోష్ కమిషన్ వేసి వంద రోజుల్లో రిపోర్ట్ ఇవ్వడానికి గడువు పెట్టారని.. చాలా గడువుల పెంపు తర్వాత మే 31లోగా రిపోర్టు ఇస్తామని ఘోష్ చెప్పారని.. విచారణ పూర్తయ్యిందని స్వయంగా చెప్పారని తెలిపారు. కానీ.. రేవంత్‌రెడ్డి ఒత్తిడి మేరకే ఘోష్ తన వైఖరి మార్చుకుని కేసీఆర్, హరీశ్‌రావులకు నోటీస్ ఇచ్చారని ఆరోపించారు. వారికి నోటీసులు చేరక ముందే మీడియాకు లీకు లిచ్చారన్నారు. రాష్ట్రంలో సమైక్య పాలన నాటి రోజులు తేవాలనేదే రేవంత్ కుట్ర అని ఆరోపించారు. ఈ నోటీసులకు బెదరం అదరం అని వెల్లడించారు. మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గ్రామాలలోకి వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. హామీల వైఫల్యం నుంచి దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌కు నోటీసులు అని పేర్కొన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ కూలిపోతే విచారణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం జరిగితే కమిషన్ లేదని, సుంకిశాల కూలిపోతే కమిషన్ లేదని, వట్టెం పంప్ హౌజ్ మునిగితే కమిషన్ లేదని విమర్శించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచున ఉందన్నారు. అందాల పోటీలతో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు డి.సుధీర్‌రెడ్డి, కేపీ వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు.

Next Story