CM పదవికి రేవంత్ రాజీనామా చేయాలి: మాజీ మంత్రి డిమాండ్

by Gantepaka Srikanth |

బనకచర్లపై పచ్చి అబద్ధాలు మాట్లాడిన రేవంత్‌రెడ్డికి సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదని.. గోదావరి నదిని ఏపీకి తాకట్టు పెట్టిన ఆయన తన పదవికి వెంటనే రాజీనామా

CM పదవికి రేవంత్ రాజీనామా చేయాలి: మాజీ మంత్రి డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బనకచర్లపై పచ్చి అబద్ధాలు మాట్లాడిన రేవంత్‌రెడ్డికి సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదని.. గోదావరి నదిని ఏపీకి తాకట్టు పెట్టిన ఆయన తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణవాదులు భయపడుతున్నది నిజం అవుతున్నదని.. ఒక్కో హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి ధారాదత్తం చేస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్ ఏ నీళ్ల కోసమైతే పోరాడారో ఆ నీళ్లను రేవంత్‌రెడ్డి ఏపీకి కట్టబెడుతున్నారని అన్నారు. మన నదులు మనకు కాకుండా చేసే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ముందు ఢిల్లీ వెళ్లనున్న రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన ఒక్క ఫోన్ కాల్ రాగానే భయపడి హుటాహుటిన వెళ్లారని అన్నారు. హోటల్లో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారని పేర్కొన్నారు.

గోదావరి-బనకచర్లపై రెండు రాష్ట్రాల్లో వేర్వేరు వార్తలు రావడం గమనార్హమని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై బూతులు మాట్లాడడం కాదని సూచించారు. ప్రజలు అధికారం ఇచ్చింది చీకటి ఒప్పందాలు చేసుకోవడానికా అని నిలదీశారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు డిమాండ్ చేయకుండా ఈ మీటింగ్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. రేవంత్ తన పదవి కోసం కోట్లాది ప్రజల హక్కులను బలిపెడతారా నిలదీశారు. సీఎం చేసిన ద్రోహానికి తెలంగాణవాదుల రక్తం మరిగిపోతున్నదని అన్నారు. చంద్రబాబు సహాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రేవంత్ చదువుతున్నారని.. గురువులు మోడీ, చంద్రబాబు చెప్పినట్టు నడుచుకుంటున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీకి మూటలు పంపినా తమకు అభ్యంతరం లేదని.. నీళ్ల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Next Story