చర్చలతోనే శాశ్వత పరిష్కారం.. ప్రజాస్వామ్య ఉద్యమాలే శరణ్యం

by Naga Rani Yarlagadda |

సమస్యల పరిష్కారానికి హింస మార్గం కాదని, కేవలం శాంతియుత చర్చలు, ప్రజాస్వామ్య ఉద్యమాల ద్వారానే ప్రజల హక్కులను సాధించుకోగలమని మాజీ మావోయిస్టు నేతలు, పీస్ డైలాగ్ కమిటీ స్పష్టం చేశాయి.

చర్చలతోనే శాశ్వత పరిష్కారం.. ప్రజాస్వామ్య ఉద్యమాలే శరణ్యం
X
  • జస్టిస్ చంద్రకుమార్‌తో మాజీ మావోయిస్టు అగ్రనేతల కీలక భేటీ

దిశ, తెలంగాణ బ్యూరో: సమస్యల పరిష్కారానికి హింస మార్గం కాదని, కేవలం శాంతియుత చర్చలు, ప్రజాస్వామ్య ఉద్యమాల ద్వారానే ప్రజల హక్కులను సాధించుకోగలమని మాజీ మావోయిస్టు నేతలు, పీస్ డైలాగ్ కమిటీ స్పష్టం చేశాయి. శుక్రవారం హైదరాబాద్‌లోని జస్టిస్ చంద్రకుమార్ కార్యాలయంలో ఆయన నేతృత్వంలోని శాంతి చర్చల కమిటీ సభ్యులు, మాజీ మావోయిస్టు అగ్రనేతల మధ్య కీలకమైన, మర్యాదపూర్వక సమావేశం జరిగింది. ఈ భేటీలో మాజీ మావోయిస్టు నేతలు దేవుజీ, మల్లా రాజిరెడ్డి, సుజాతక్క, జేఎన్ఎం సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. దేశంలోని ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులు, రాజ్యాంగ రక్షణ, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. భవిష్యత్తులో ప్రజల గొంతుకను బలంగా వినిపించేందుకు ప్రజాస్వామ్య ఉద్యమాల పరిధిని మరింత విస్తృతం చేయాలని ఈ సందర్భంగా తీర్మానించారు.

శాంతియుత వాతావరణం కోసం కమిటీ నిరంతరం కృషి..

గత ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ మరణకాండకు వ్యతిరేకంగా, ఇరువైపులా ఎలాంటి ప్రాణనష్టం జరగకూడదన్న సదుద్దేశంతో జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో ఈ పీస్ డైలాగ్ కమిటీ ఆవిర్భవించింది. ఆనాటి నుంచి వామపక్ష లెఫ్ట్, ఎం.ఎల్. పార్టీలు, వివిధ ప్రజాస్వామ్య శక్తులను కలుపుకుని కాల్పుల విరమణ, శాంతియుత వాతావరణం కోసం ఈ కమిటీ నిరంతరం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ మావోయిస్టు అగ్రనేతలతో సమావేశమైన పీడీసీ.. పలు కీలక వర్తమాన అంశాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణకు రూపకల్పన చేసింది.

నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

ఆదివాసీల, నీట్ లీకేజీపై ఆగ్రహం దేశంలో అభివృద్ధి పేరిట అడవుల నుంచి ఆదివాసీలను బలవంతంగా గెంటివేస్తూ, వారిని విస్థాపనకు గురిచేయడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. జల్ జంగిల్ జమీన్ పై ఆదివాసీలకే పూర్తి హక్కులు ఉన్నాయని, వారి ఉనికిని, సంస్కృతిని కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది, లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజురోజుకూ పెరిగిపోతున్న నిరుద్యోగంపై యువతలో ఉన్న ఆవేదనను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి, వారి వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

సెక్యులరిజం విలువలతో అన్ని వర్గాల ప్రజల మధ్య సామరస్యం పెంపొందించాలి

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటమే ప్రథమ కర్తవ్యం భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి ఒక్కరిపైనా ఉందని నేతలు పునరుద్ఘాటించారు. దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీసే కుహనా శక్తులకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయాలని, లౌకికవాద సెక్యులరిజం విలువలను కాపాడుకుంటూ అన్ని వర్గాల ప్రజల మధ్య సామరస్యం పెంపొందించేలా కార్యక్రమాలు రూపొందించాలని చర్చించారు. దేశ ఆర్థిక స్వావలంబనను దెబ్బతీస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. స్వదేశీ వనరులు, ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా మాత్రమే దేశం నిజమైన ప్రగతిని సాధిస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో పీడీసీ అధ్యక్షులు జస్టిస్ చంద్రకుమార్, మాజీ మావోయిస్టు నేతలతో పాటు.. సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులు కందిమళ్ళ ప్రతాప్ రెడ్డి, ప్రొఫెసర్ అన్వర్, సీనియర్ జర్నలిస్ట్ రహమాన్, న్యాయవాది వెంకన్న, ఖాన్, ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్ రావు, సోమా రామమూర్తి, జై సింగ్ రాథోడ్, అజయ్ బాల్నె, పీడీసీ కో ఆర్డినేటర్ బండి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Next Story