విమోచన దినోత్సవం పిల్లల పాఠ్యాంశాల్లో చేర్చాలి.. మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

తెలంగాణ విమోచన అనేది మన చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉండి కూడా మరుగున పడడం సమంజసం కాదని మాజీ గవర్నర్​ విద్యాసాగర్​రావు పేర్కొన్నారు.

విమోచన దినోత్సవం పిల్లల పాఠ్యాంశాల్లో చేర్చాలి.. మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ విమోచన అనేది మన చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉండి కూడా మరుగున పడడం సమంజసం కాదని మాజీ గవర్నర్​ విద్యాసాగర్​రావు (Former Governor Vidyasagar) పేర్కొన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు రాంచందర్​రావు, శ్రీవర్ధన్​తో కలిసి భాస్కర యోగి రచించిన సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విమోచనమే అనే పుస్తక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా బీజేపీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో ఈ ఉద్యమాన్ని నడిపించారు. విమోచన దినం ప్రాముఖ్యతను పిల్లల పాఠ్యాంశాల్లో ఈ చరిత్రను చేర్చాలి అని అన్నారు. కోమరం భీం, షోయబుల్లా ఖాన్ వంటి అనేకమంది మహనీయుల విగ్రహాలు హైదరాబాద్ నగరంలో ప్రతిష్టించాలనే డిమాండ్‌తో ఉద్యమం కొనసాగిందన్నారు. పార్టీలకు అతీతంగా నిజాం వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమం గొప్పగా సాగిందని అనేకమంది త్యాగాలు చేశారని గుర్తు చేశారు.

గత తరం ఇచ్చిన గొప్ప సంపదను మనం ముందుకు తీసుకుపోవాలని సూచించారు. విమోచనంపై కొంతమంది కుహనా లౌకిక వాదుల వాదనలు మనం అంగీకరించాల్సిన అవసరం లేదని, ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో హైదరాబాద్ సంస్థానానికి విమోచనం జరిగిందన్నారు. పోలీస్ యాక్షన్ ను సులభతరం చేయడానికి, గ్రామీణ స్త్రీ-పురుషులు, నిరక్షరాసులు కూడా నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. భాస్కర్ యోగి ఇప్పటికే ఎన్నో పుస్తకాలు రచించారని, అదేవిధంగా భారతీయ సంస్కృతి పరంపర గురించి అనేక సందర్భాల్లో చెప్పారు. 17 సెప్టెంబర్ అధికారికంగా తెలంగాణ, కర్ణాటక, మరాఠా భూభాగాల్లో ఘనంగా జరుపుకునే ప్రతిజ్ఞను మనం స్వీకరించుకున్నామన్నారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవాలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. విమోచనం అంటే కేవలం జెండా వందనం, మిలటరీ పరేడ్, సెల్యూట్ చేయడం మాత్రమే కాదని ఇది తెలంగాణ విమోచన, స్ఫూర్తి ప్రతీక అన్నారు.

Next Story