గోదావరి బేసిన్‌లో మిగులు జలాలే లేవు.. స్పష్టం చేసిన శ్రీరామ్ వేదిరె

by Gantepaka Srikanth |

గోదావరి బేసిన్‌లో మిగులు జలాలు అనేటివి లేవని.. అసలు మన దేశంలో వరద నీరు అనే కాన్సెప్టే లేదని కేంద్ర జల్‌శక్తి మాజీ సలహాదారు శ్రీరామ్ వేదిరె స్పష్టం చేశారు.

గోదావరి బేసిన్‌లో మిగులు జలాలే లేవు.. స్పష్టం చేసిన శ్రీరామ్ వేదిరె
X

దిశ, తెలంగాణ బ్యూరో: గోదావరి బేసిన్‌లో మిగులు జలాలు అనేటివి లేవని.. అసలు మన దేశంలో వరద నీరు అనే కాన్సెప్టే లేదని కేంద్ర జల్‌శక్తి మాజీ సలహాదారు శ్రీరామ్ వేదిరె స్పష్టం చేశారు. మంగళవారం మంగళవారం తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ‘గోదావరి నీటి వనరులు-వాస్తవాలు, గణాంకాలు-తెలుగు రాష్ట్రాలకు ముందుకు సాగే దారి’ అనే అంశంపై ఓ హోటల్‌లో ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోదావరి బేసిన్‌లో 75 శాతం ప్రాతిపదికన నీటి కేటాయింపులు జరుగుతాయని వెల్లడించారు. దానిప్రకారం గోదావరి బేసిన్‌లో చుక్క నీరు కూడా అదనపు నీరు అందుబాటులో లేదని.. ఇదే విషయాన్ని స్వయంగా సీడబ్ల్యూసీ నివేదికలు చెబుతున్నాయని అన్నారు. సముద్రంలోకి వెళ్తున్న ప్రవాహాలన్నీ ఇతర రాష్ట్రాలకు కేటాయించి.. వినియోగించుకోని వాటాలేనని వెల్లడించారు.

సముద్రంలో కలుస్తున్నది 1,138 టీఎంసీలే..

గోదావరి నీరు 3,000 టీఎంసీలు ఏటా సముద్రం పాలవుతున్నాయని ప్రచారం చేస్తున్నారని.. సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం వృథాగా పోతున్న నీరు 1,138 టీఎంసీలు మాత్రమే అని.. వీటిని ఏ రాష్ట్రం కూడా వినియోగించుకునే ధర్మబద్ధత లేదని శ్రీరామ్ వేదిరె స్పష్టం చేశారు. అయితే.. అవి కూడా ఇతర రాష్ట్రాలకు కేటాయించగా.. అక్కడ వాడుకునే పరిస్థితులు లేక కిందకు వస్తున్నాయని చెప్పారు. గోదావరి జలవివాదాల ట్రిబ్యునల్ గానీ, కేంద్ర జల సంఘం గానీ ఇప్పటి వరకు వరద నీరు అనే పదాన్ని ఎక్కడా నిర్వచించలేదన్నారు. పోలవరం వద్ద ఏటా సముద్రంలోకి వెళ్తున్న సుమారు 3 వేల టీఎంసీల నీటిని చూపి, అది మిగులు జలాలు అనే భ్రమ కల్పిస్తున్నారని.. అది వాస్తవం కాదని చెప్పారు. దీనిని అదనపు నీటిగా పరిగణించి ప్రాజెక్టులు కట్టడం చట్టవిరుద్ధమని శ్రీరామ్ వేదిరె చెప్పారు.

బనకచర్లకు అన్నివైపులా అభ్యంతరాలు

ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి-బనకచర్ల (జీ-బీ) లింక్ ప్రాజెక్టు ఊహాజనిత వరద నీటిపై ఆధారపడి ఉందని, దానికి చట్టబద్ధత గానీ, శాస్త్రీయత గానీ లేదని శ్రీరామ్ వేదిరె విమర్శించారు. ఇలాంటి వివాదాస్పద ప్రాజెక్టులతో కాలం వృథా చేయకుండా, ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని భరోసా నీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కరువు ప్రాంతాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-కావేరి (జీ-సీ) నదుల అనుసంధాన ప్రాజెక్టును అమలు చేయడమే తెలుగు రాష్ట్రాలకు ఉత్తమ మార్గమని ఆయన సూచించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన జీ-బీ లింక్ ప్రాజెక్టుపై సీడబ్ల్యూసీ, గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ), పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ), పర్యావరణ నిపుణుల కమిటీ (ఈఏసీ) తీవ్రమైన సాంకేతిక, చట్టపరమైన అభ్యంతరాలు వ్యక్తం చేశాయని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుకు శాస్త్రీయత లేదని, జీడబ్ల్యూడీటీ అవార్డును ఉల్లంఘిస్తుందని, ఎగువ రాష్ట్రాలైన తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల హక్కులకు భంగం కలిగిస్తుందని ఆ సంస్థలన్నీ స్పష్టం చేశాయని తెలిపారు. దీనివల్ల తెలంగాణలోని శ్రీరాంసాగర్, సీతారామ వంటి చట్టబద్ధ ప్రాజెక్టులకు భవిష్యత్తులో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు.

గోదావరి-కావేరి లింక్ ఏకైక పరిష్కారం..

ప్రస్తుత పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలకూ ప్రయోజనం చేకూర్చేది కేంద్రం ప్రతిపాదించిన గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టు మాత్రమేనని శ్రీరామ్ వేదిరె అన్నారు. జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం ఛత్తీస్‌గఢ్‌కు కేటాయించినప్పటికీ వారు వాడకుండా వృథాగా మిగిలిపోతున్న 147 టీఎంసీల భరోసా నీటిని ఇంద్రావతి సబ్-బేసిన్ నుంచి మళ్లించుకోవచ్చని తెలిపారు. దీనివల్ల తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కేటాయించిన నీటిలో ఒక్క చుక్క కూడా తగ్గదని.. పైగా ఈ ప్రాజెక్టు మార్గంలో తెలంగాణ, రాయలసీమలోని కరువు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే తాత్కాలిక అంగీకారం తెలిపాయని, అనవసర వివాదాలు పక్కనపెట్టి ఈ ప్రాజెక్టుపై దృష్టి సారిస్తే ఉభయ రాష్ట్రాలకూ మేలు జరుగుతుందని సూచించారు.

తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల లభ్యత

తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాలనుకున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టకు సంబంధించి సీడబ్ల్యూసీ 1971-72 నుంచి 2011-12 వరకు 41 సంవత్సరాల డేటాను అధ్యయనం చేసినట్లు శ్రీరామ్ వేదిరె తెలిపారు. పెన్‌గంగా, వార్ధా, ప్రాణహిత ఉపబేసిన్ల నుంచి లభించే పది రోజుల వారీ ప్రవాహాలను సైతం విశ్లేషించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం 75 శాతం విశ్వసనీయతతో 165 టీఎంసీలు, సగటు ప్రవాహంగా 462 టీఎంసీల నీరు ఉందని నిర్ధారించినట్లు తెలిపారు. సీడబ్ల్యూసీ ఈ ప్రాజెక్టును 165 టీఎంసీల (75 శాతం విశ్వసనీయత ఆధారంగా) కేటాయింపుతో ఆమోదించిందని వెల్లడించారు. అలాగే.. గోదావరి నుంచి ఇప్పటికే తెలంగాణకు భరోసా నీరు 968 టీఎంసీలు, ఏపీకి 531.9 టీఎంసీలు సీడబ్ల్యూసీ ఖరారు చేసినట్లు చెప్పారు.

Next Story