- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2050 నాటికి హిందువు ప్రధాని కావడం అసాధ్యం.. సీబీఐ మాజీ డైరెక్టర్ హాట్ కామెంట్స్
హిందువుల జనాభా గణనీయంగా తగ్గుతుందని సీబీఐ మాజీ డైరెక్టర్ మన్నెం నాగేశ్వర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో రోజు రోజుకు మతమార్పిడులు పెరిగిపోతున్నాయని, హిందువుల జనాభా గణనీయంగా తగ్గుతుందని సీబీఐ మాజీ డైరెక్టర్ మన్నెం నాగేశ్వర్ రావు (Mannem Nageshwar Rao) ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 2050 నాటికి హిందువు ప్రధాని కావడం అసాధ్యమని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుంచి 30 వరకు సవరించాలని, వీటిని మార్చితేనే హిందువులకు దేశంలో భవిష్యత్తు ఉంటుందన్నారు. విద్యలో హిందువులకు ప్రత్యేక చట్టాలు లేకపోయినా కనీసం చట్టాల్లో సమాన అవకాశాలు ఉండాలన్నారు. విద్య విషయంలో క్రిస్టియన్, ముస్లీంలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని కానీ హిందువులకు కనీసం చట్టాలు కూడా లేవని ఆవేదన చెందారు. దీని ద్వారా హిందువులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తెలంగాణతో పాటుగా ఏపీలో చైతన్యం తీసుకొస్తామన్నారు. శనివారం ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో హిందువులకు సమాన హక్కుల నిరాకరణ, రాజ్యాంగ వివక్ష అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీబీఐ మాజీ డైరెక్టర్ మన్నెం నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. దేశంలో 1951 నాటికి 2011 జనాభా లెక్కలకు హిందువుల జనాభా అధికారికంగా 6.62 శాతం తగ్గిందని, వాస్తవంగా ఇది ఇంత కంటే ఎక్కువగా తగ్గిందని, ప్రస్తుతం దేశంలో 65 శాతానికి కొంచెం అటు ఇటుగా మాత్రమే ఉందన్నారు.
పెద్ద ఎత్తున క్రిస్టియన్లుగా మారుతున్న పంజాబీలు
పంజాబీలు కూడా పెద్ద ఎత్తున క్రిస్టియన్లుగా మారుతున్నారని, అక్కడి వారు ఎక్కువగా కెనడాకు వెళ్తుంటారని, క్రిస్టియన్లుగా మారి అక్కడికి వెళ్తున్నారని అన్నారు. హిందువుల్లో జనన రేటు 1.9 శాతం మాత్రమే ఉందని, ఇప్పుడున్న హిందువుల జనాభాను అదే స్థాయిలో కాపాడుకోవాలంటే కనీసం 2.1 శాతం జనన రేటు ఉండాలన్నారు. దేశంలోని అనేక జిల్లాల్లో హిందువులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. 2100 నాటికి దేశం క్రిస్టో ఇస్లామిక్ దేశంగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులు కూడా మత మార్పిడిలను ప్రోత్సహిస్తున్నాయని, క్రిష్టియన్లకు, ముస్లీంలకు ప్రత్యేక నిధులను కేటాయిస్తున్న ప్రభుత్వాలు హిందువులకు ప్రత్యేక నిధులు కేటాయించడం లేదన్నారు. దేశం వ్యాప్తంగా దాదాపుగా మూడు లక్షల వరకు దేవాలయాలు ఉన్నాయని, ఇవన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని కానీ ఒక్క మసీదు, చర్చి కూడా ప్రభుత్వం ఆధీనంలో లేదన్నారు. ఇదేనా అన్ని మతాలు సమానం అనేది అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు దేవాలయాలను ప్రభుత్వ ఆధీనంలో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మతాలకు అతీతంగా పేదవారికి ప్రభుత్వాలు సాయం అందించాలన్నారు. అంతే కానీ మతమే ప్రాతిపదిక కావొద్దన్నారు. మతోన్మాదాన్ని ప్రోత్సహించడం వల్లే దేశ విభజన జరిగిందన్నారు. హిందువులకు ప్రాథమిక హక్కులు లేవని, కేవలం పౌర హక్కులు మాత్రమే ఉన్నాయని నాగేశ్వర్ రావు తెలిపారు. హిందువుల కోసం రాజ్యాంగంలోని 25 నుంచి 30 వరకు ఆర్టికల్స్‌ను సవరించాలన్నారు. మతం వేరు రాజకీయం వేరన్నారు.
దేవాదాయ భూములు ప్రభుత్వాలు వాడుకునే ప్రయత్నం
ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేవాలయాలకు దాతలు భూములు ఇస్తుంటారని, వాటిని కూడా ప్రభుత్వాలు తమ భూములుగా భావిస్తూ దారదత్తం చేస్తున్నాయని అన్నారు. ఏపీ లో దాదాపుగా 15 వేల ఎకరాలకు దేవాదాయ భూములు ఉన్నాయని, తమిళనాడులో 25 వేల ఎకరాల భూమి, వీటిని సంక్షేమ, ప్రభుత్వం కార్యక్రమాలకు వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వీటి వాడుకోని నష్టపరిహారం ఇవ్వడం లేదన్నారు. టీటీడీలో కూడా భక్తితో అనేక మంది వాహనాలు, డబ్బులు, నగలు ఇస్తుంటారని, ఆ తర్వాత టీటీడీ అధికారులు వాటిని ఇతరులకు కట్టబెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంతానాన్ని సైతం కాదని దాతలు ముందుకు వచ్చి వారి ఆస్తులు, భూములను దానం చేస్తుంటారని అన్నారు. చదువుకునే విద్యార్థుల్లో హిందూ ధర్మం గురించి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దేవాదాయ భూములు తీసుకుంటూ ప్రభుత్వమే రాజ్యాంగేతర శక్తిగా మారుతుందన్నారు. కోర్టు తీర్పులు కూడా వివాదాస్పద మవుతున్నాయి, వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. తమ విధానం అందరికీ సమాన అవకాశాలు ఉండాలనేదేనని, అది ప్రస్తుతం హిందువులకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అంబేద్కర్ హిందూ మతం విడిచి వెళ్ళ లేదు
ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ కరణం అరవింద్ రావు మాట్లాడుతూ.. అనేక మందికి హిందువుల కొన్ని అపోహలు ఉన్నాయని అన్నారు. వేదాలు అంటే మత గ్రంథాలు కాదనే విషయాన్ని గుర్తించాలన్నారు. మతం అంటే విశ్వాసనమని ఆయన అన్నారు. విదేశాల్లో తమ ప్రాచీన చరిత్ర గురించి చెప్పుకుంటారని, ఇక్కడ వేదాలు గురించి ఎక్కడా చెప్పరన్నారు. అంబేద్కర్ గురించి పూర్తిగా తెలిసిన, ఆయన గురించి చదివితే చాలా వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. ఆయనపై మతం మారాలని అనేక రకాల ఒత్తిళ్లు వచ్చాయని అయితే ఆయన ఏనాడు హిందూ మతం విడిచి వెళ్ళ లేదన్నారు. రాజ్యాంగాన్ని అందరూ హిందువులే రాశారని, అయితే వారందరు రాజకీయ హిందువులని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితులను ఆనాడు వారు ఉహించలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. కమ్యునల్ వైలెన్స్ చట్టాన్ని తీసుకరావాలని గత ప్రభుత్వాలు ప్రయత్నాలు చేశాయని, ఈ చట్టంలో హిందువులకు ఘోరమైన నిబంధనలు పెట్టారని, హిందువులను ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయన్నారు. మైనార్టీల మీద దాడులు జరిగితే హిందువులు బాధ్యులని పొందుపర్చారని, అయితే ఆ చట్టం రాలేదన్నారు. హిందువుల గురించి వారికి జరుగుతున్నఅన్యాయం గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలన్నారు.






