TJTF: తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భావం.. కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొత్తగా “తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్‌ (TJTF)” ఆవిర్భవించింది.

TJTF: తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భావం.. కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ జాగృతి (Telangana Jagruti) ఆధ్వర్యంలో కొత్తగా “తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్‌ (TJTF)” ఆవిర్భవించింది. శనివారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha), పలువురు ఉపాధ్యాయుల చేతుల మీదుగా ఫెడరేషన్‌ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతిని బలోపేతం చేయడంలో టీచర్లు కీలక పాత్ర పోషించారని ఆమె గుర్తుకు చేశారు. ఉద్యమ సమయంలో కోటి బతుకమ్మ జాతర కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారు కూడా టీచర్లే అని అన్నారు. జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆలోచనను వీరభద్రరావు 12 ఏళ్ల క్రితమే సూచించారని, ఇప్పుడు దానిని కార్యరూపం దిద్దే సమయం వచ్చిందని తెలిపారు. తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ అనేది లైక్ మైండెడ్ పీపుల్ తో కలిసి పనిచేస్తుందన్నారు. తెలంగాణలో నా ఫేవరెట్ టీచర్ ప్రొఫెసర్ జయశంకర్ అని, ఆయన తెలంగాణ భావజాల వ్యాప్తిలో అందరికీ గురువుగా నిలిచారని అన్నారు.

టీచర్లకు PRC వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను చెల్లించాలని కోరారు. టీచర్లకు హెల్త్ కార్డులు ఇవ్వకపోవడం దారుణం అని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ రెండేళ్లుగా ఇవ్వకపోవడం పట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీబీవీ టీచర్లకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వలేదని, దీపావళి లోపు చెల్లించాల‌ని సీఎంని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, కేజీబీవీ టీచర్ల జీతాలు ఇతరుల మాదిరిగా పెంచాలని సూచించారు. అలాగే గురుకుల టీచర్లకు హాస్టల్ డ్యూటీలు వేయవద్దని, కేర్‌టేకర్లు, వార్డెన్లను నియమించాలని సూచించారు. పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేసి, న్యూ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఒలింపిక్స్ పతకాల గురించి మాట్లాడుతున్నారు కానీ స్కూళ్లలో పీఈటీ టీచర్లు లేరని, పీఈటీలు లేకుండా పతకాలు ఎలా సాధ్యమవుతాయి? అని ప్రశ్నించారు. జాగృతి ఎలా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తుందో, టీజేటీఎఫ్ కూడా పాత సంఘాలను కలుపుకొని టీచర్ల హక్కుల కోసం పని చేస్తుందని తెలిపారు.

కాగా, తన కుమారుడిని బీసీ బంద్ కార్యక్రమానికి తీసుకువచ్చిన విషయంపై మాట్లాడుతూ.. “సామాజిక బాధ్యత ఇంటి నుంచే నేర్పాలనే ఉద్దేశంతోనే తీసుకువచ్చాను” అని చెప్పారు.

Next Story