ప్రతిపాదనల్లోనే ‘ఫారెస్ట్ స్టేషన్లు’..! కాగితాలకే పరిమితమైన ‘సర్కిళ్లు’

by Kema Shiva Kumar |

పోలీస్ స్టేషన్ల మాదిరిగా అటవీ శాఖ పరిధిలో ఫారెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న అంశం అనేక సంవత్సరాలుగా ప్రతిపాదనలకే పరిమితమైంది.

ప్రతిపాదనల్లోనే ‘ఫారెస్ట్ స్టేషన్లు’..! కాగితాలకే పరిమితమైన ‘సర్కిళ్లు’
X

దిశ, తెలంగాణ బ్యూరో: పోలీస్ స్టేషన్ల మాదిరిగా అటవీ శాఖ పరిధిలో ఫారెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న అంశం అనేక సంవత్సరాలుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. సర్కిళ్లు, ప్రధాన కార్యాలయాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయినా చర్యలు కరువయ్యాయి. గత, ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఈ అంశం అటకెక్కింది. దశాబ్దాల క్రితం నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో అటవీశాఖ అధికారుల వద్ద సైతం ఆయుధాలు ఉండేవి. నక్సల్స్ ప్రభావం తగ్గిపోవడంతో ఆయుధాలను రికవరీ చేసుకొని పోలీస్ శాఖకు అప్పగించారు. వివిధ సందర్భాల్లో అటవీశాఖ సిబ్బందిపై దాడులు జరగడంతో మళ్లీ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కు ఆయుధాలు ఇవ్వాలన్న అంశం తెరపైకి వచ్చింది. 2022 నవంబరు 22న కొత్తగూడెం జిల్లా ఎర్రబోడు అటవీ ప్రాంతంలో ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు దారుణ హత్యకు గురయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 300 ఫారెస్ట్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని, అటవీ అధికారులకు ఆయుధాలు (గన్స్) ఇవ్వాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అటవీ శాఖ ప్రతిపాదనలు పంపింది. తొలి దశలో 30 స్టేషన్లు, ఒక్కో చోట 18 మంది సిబ్బందిని నియమించాలని సూచించింది. దీనిపై అప్పటి ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా.. ఈ అంశంపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అటవీశాఖ సిబ్బందిపై దాడులు జరిగినప్పుడు ఆయుధాలు ఇవ్వాలని కోరడం.. తరువాత మరుగున పడిపోవడం పరిపాటిగా మారింది.

సర్కిళ్ల ఏర్పాటుకు ఉత్తర్వుల జారీ అయినా..

అటవీశాఖలో సర్కిళ్లు, వాటికి సంబంధించిన ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేస్తూ 2022లో అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. భూపాలపల్లిలో కాళేశ్వరం సర్కిల్, నిర్మల్ లో బాసర సర్కిల్, సిద్దిపేటలో రాజన్న సర్కిల్, వరంగల్ లో భద్రాద్రి సర్కిల్, నల్లగొండలో యాదాద్రి సర్కిల్, హైదరాబాద్ లో చార్మినార్ సర్కిల్, మహబూబ్ నగర్ లో జోగులాంబ సర్కిల్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక సర్కిళ్లను ఏర్పాటు చేస్తామని ఉత్తర్వులు ఇచ్చినా.. ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు.

సిబ్బందిపై తరచూ దాడులు

వివిధ సందర్భాల్లో అటవీశాఖ సిబ్బందిపై తరచూ దాడులు జరుగుతున్నాయి. పోడు భూముల వ్యవహారంలోనూ ఆటవీ అధికారులు, గిరిజనులకు వివాదాలు నెలకొంటున్నాయి. మంచిర్యాల జిల్లా కోయపోశగూడెంలో అటవీ భూమిలో సాగును అడ్డుకున్న అధికారులపై కొందరు తిరగబడడంతో ఉద్రిక్తత నెలకొన్నది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి సమీపంలో, ఆళ్లపల్లి మండలం ఆళ్లపల్లి, చింతకూడ, రాయిపాడు, ముత్తాపురం, జర్లగూడెం గ్రామాల పరిధిలోని పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన సిబ్బందితో గిరిజనులు ఘర్షణకు దిగారు. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రాసిగుట్ట తండాలో పోడు భూముల సర్వేకు వెళ్లిన అధికారులు, తండావాసుల మధ్య వివాదం నెలకొన్నది. వన్యప్రాణులను కాపాడే క్రమంలోనూ వేటగాళ్ల నుంచి ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనే సంఘటలను చోటు చేసుకుంటున్నాయి. ఏదైనా సంఘటన జరిగినప్పుడే హడావుడి చేస్తున్న ఉన్నతాధికారులు.. తర్వాత పట్టించుకోవడం లేదని అటవీశాఖ సిబ్బంది వాపోతున్నారు.

Next Story