అట‌వీ చ‌ట్టాలు, అభ‌యార‌ణ్య చ‌ట్టాల‌ను అభివృద్దితో జోడించాలి : మంత్రి సీతక్క

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో అట‌వీ చ‌ట్టాలు, అభ‌యార‌ణ్య చ‌ట్టాల‌ను అభివృద్దితో జోడించాల్సిన అవసరం ఉందని పంచాయతీరాజ్​శాఖ మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల కృషి, కేంద్ర ప్రభుత్వాల చేయుత కార‌ణంగా మైదాన ప్రాంతాల్లోని ఎస్టీలు అభివృద్ది చెందుతున్నారని ఆమె తెలిపారు.

అట‌వీ చ‌ట్టాలు, అభ‌యార‌ణ్య చ‌ట్టాల‌ను అభివృద్దితో జోడించాలి : మంత్రి సీతక్క
X
  • మైదాన ప్రాంతాల్లోని ఎస్టీలు అభివృద్ది చెందుతున్నారు
  • ఇందులో కేంద్ర, రాష్ట్రాల చేయూత ఎంతో ఉంది
  • ఏజెన్సీ ఏరియాల్లోని ఆదివాసీల అభివృద్ది ప‌ట్ల మాకు చిత్త శుద్ధి ఉంది
  • పంచాయతీరాజ్​శాఖ మంత్రి సీతక్క

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అట‌వీ చ‌ట్టాలు, అభ‌యార‌ణ్య చ‌ట్టాల‌ను అభివృద్దితో జోడించాల్సిన అవసరం ఉందని పంచాయతీరాజ్​శాఖ మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల కృషి, కేంద్ర ప్రభుత్వాల చేయుత కార‌ణంగా మైదాన ప్రాంతాల్లోని ఎస్టీలు అభివృద్ది చెందుతున్నారని ఆమె తెలిపారు. ఇదే సమయంలో ఏజెన్సీ ఏరియాల్లోని ఆదివాసీలు, ప్రిమిటివ్ ట్రైబ్స్ అభివృద్ధికి అటంకాలు ఎదుర‌వుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో 63 వేల 843 గ్రామాలు, 5 కోట్ల మంది ఎస్టీల కోసం ఏటా కోటి 58 లక్షల 30 వేలు ఖ‌ర్చు చేసేందుకు కేంద్రం ముందుకు రావడాన్ని తమ ప్రభుత్వం స్వాగతిస్తోందన్నారు. శుక్రవారం హైదరాబాద్​లో జరిగిన ఒక కార్యక్రమంలో సీతక్క మాట్లాడుతూ ఆదివాసీల పోరాట యోధుడు బిర్సా ముండా స్ఫూర్తితో మహాత్మ గాంధీ జయంతి రోజున ప్రారంభించుకున్న “ ధర్తీ ఆబ జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ ” స్కీం కింద గిరిజన ప్రాంతాల్లో అభివృద్ది కోసం, విద్య వైద్యం, జీవ‌నోపాధి, మౌళిక వ‌స‌తుల కల్పన కోసం 17 వివిధ శాఖలను సమన్వయం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇది అభినందనీయమన్నారు. అయితే ఈ మ‌ధ్య తెలంగాణ ప్రభుత్వం గిరిజ‌నులు, ఆదివాసీ ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల అభివృద్ధి కోసం రాష్ట్రంలో ప‌లు శాఖ‌ల‌తో స‌మీక్షలు నిర్వహించామన్నారు. ఎస్టీల జనాభా అధికంగా ఉన్న ఆదిలాబాద్, ఖ‌మ్మం, వ‌రంగల్, నాగర్ కర్నూల్ జిల్లాల ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపామన్నారు. నా అనుభ‌వాలు, వారి అభిప్రాయాల సారంశం కూడా ఒక్కటేనంటూ గిరిజనులు, ఆదివాసీల అభివృద్ది ప‌ట్ల మాకు చిత్తశుద్ధి ఉన్నా అట‌వి చ‌ట్టాలు, అభ‌యార‌ణ్య చ‌ట్టాలే ప్రధాన అడ్డంకిగా మారాయని, ఈ క్రమంలో అట‌వీ చ‌ట్టాలు, అభ‌యార‌ణ్య చ‌ట్టాల‌ను అభివృద్దితో జోడించాలని కోరుతున్నామన్నారు. కాగా, అటవీ శాఖ అధికారుల‌తో చర్చలు జ‌రుపుతున్నా గానీ అక్కడ అభివృద్ధి ముందుకు సాగ‌డం లేదని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.

1980కి ముందున్న గ్రామాల్లో అభివృద్దికి అడ్డు చెప్పవద్దని అటవీ చ‌ట్టాలు చెబుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ చర్యలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్న భ‌యంతో ఫారెస్టు అధికారులు అక్కడ అభివృద్ధి ప‌నుల జోలికే వెల్లడం లేదన్నారు. ఈ కారణంగా అక్కడ అభివృద్ధి ముందుకు సాగ‌డం లేదన్నారు. అభివృద్ది వ‌ర్సెస్ అట‌వీ చ‌ట్టాలు అన్నట్లుగా పరిస్థితి మారిందన్నారు. దానికి తన ములుగు నియోజ‌క‌వర్గమే సరైన ఉదాహరణ అని అన్నారు. ములుగులో 77 శాతం అడవి ఉందని, అందుకే ములుగును ట్రైబల్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణగా పిలుస్తారన్నారు. అక్కడ కూడా అభివృద్ధికి అటవీశాఖ అభ్యంతరాలు పెడుతోందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు కోరినట్లుగా క‌నీసం మంచి నీళ్లు, రోడ్లు వేయ‌లేక‌పోతున్నామన్నారు. గుడిసెల్లో ఉన్న పాఠ‌శాల‌కు పక్కా భ‌వ‌నాలు నిర్మిద్దామ‌నుకున్నా అట‌వీ అనుమ‌తులు రావ‌డం లేదని సీతక్క అన్నారు. చివరికి అంగ‌న్ వాడీ కేంద్రాలు, ఆసుప‌త్రులు నిర్మిద్దామ‌న్నా అటవీ అనుమ‌తులు రావడం లేదని ఆమె గుర్తు చేశారు. దీంతో అటవీ ప్రాంతాలలో తక్షణ వైద్య సహాయం కోసం తాత్కాలిక కంటైనర్ల ను తాడ్వాయి మండలం పోచాపుర్ లోను, వాజేడు మండలంలోని ఏడ్చర్లపల్లిలోను నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. స‌ర్వోద‌య అన్నా, అంత్యోద‌య అన్నా.. అభివృద్దిలో చిట్ట చివ‌ర ఉన్న వ్యక్తికీ సంక్షేమ ఫ‌లాలు చేరాలని మంత్రి సీతక్క అన్నారు. ఎఫ్ అంటే ఫారెస్టే కాదు.. ఎఫ్ అంటే ఆదివాసీల ఫ్యూచ‌ర్ కూడా అని గుర్తుంచుకోవాలని సీతక్క స్పష్టం చేశారు. ఈ రెండింటినీ సమన్వయం చేసి ఆదివాసీలను అభివృద్ధి పథంలో నిలపాల్సిన అవసరం ఉందని సీతక్క అన్నారు.

Next Story