- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పచ్చని అడవిపై కబ్జా కోరలు: రంగురాళ్లబోడులో చెట్లు నరికి.. భూమి చదును!
అడవులు కేవలం చెట్ల సమూహం మాత్రమే కావు అవి జీవ వైవిధ్యానికి నిలయాలు.

రోజురోజుకూ అటవీ సంపద హరించుకోవడం మానవాళికి పెనుప్రమాదంగా పర్యావరణ వేత్తలు నెత్తినోరూ కొట్టుకుంటుంటే.. ఆక్రమణ దారులు మాత్రం యథేచ్ఛగా తమ పని కానిచ్చేస్తున్నారు. అటవీ సంపదకు కేరాఫ్ అయిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చెట్ల నరికివేతతో పాటు.. భూ కబ్జాలు మితిమీరుతున్నాయి. తాజాగా కారేపల్లి మండలం రేలకాయలపల్లి పంచాయతీ పరిధిలోని రంగురాళ్లబోడు గ్రామ సమీపంలోని తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ గుట్టను తెలుస్తుండటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఉన్నతాధికారులు స్పందించి అటవీ సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
దిశ, కారేపల్లి: అడవులు కేవలం చెట్ల సమూహం మాత్రమే కావు అవి జీవ వైవిధ్యానికి నిలయాలు. ప్రకృతి సమతౌల్యానికి మూలాధారం, భూమిపై జీవజాలానికి శ్వాసనిచ్చే ప్రాణవాయువు. అలాంటి అరణ్య సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి,ముఖ్యంగా అటవీ శాఖ అధికారులకు ఉంటుంది. కానీ ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన వారే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కారేపల్లి మండల పరిధిలో వెలుగుచూస్తున్న 9ఎకరాల గుట్ట కబ్జాకోరుల చేతుల్లో చిక్కుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రంగురాళ్లబోడు హస్తగతం..
కారేపల్లి మండల పరిధిలోని గేటు రేలకాయలపల్లి పంచాయతీ పరిధిలోని రంగురాళ్ల బోడు గ్రామ సమీపంలో సుమారు 9ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ గుట్టను ఓకే కుటుంబానికి చెందిన వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ నెలలో ఈ వ్యవహారానికి పాల్పడ్డారు. సంబంధిత శాఖ గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ క్రమంలో అటవీ భూమి ఆక్రమణకు అడ్డుకునే ప్రయత్నంలో చీమలపాడు సెక్షన్ ఆఫీసర్‌పై కూడా ఆక్రమణకు పాల్పడ్డ వారు దాడికి పాల్పడడంతో ఫారెస్ట్ అధికారులు కేసులు కూడా నమోదు చేశారు. అంతటితో ఆగకుండా సెక్షన్ ఆఫీసర్ మారిన అనంతరం సదరు వ్యక్తులు మళ్లీ కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్షన్ అధికారి, బీట్ ఆఫీసర్‌ను అక్రమార్కులు తమ చెప్పుచేతుల్లో పెట్టుకుని అడవిలో ఉన్న పచ్చని చెట్లను నరికి కబ్జాకు పాల్పడుతున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒకప్పుడు పచ్చని చెట్లతో కళకళలాడిన ఈ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా నిర్జీవంగా మారింది. పెద్దపెద్ద చెట్లను నరికివేసి, భూమిని చదును చేయడంతో స్థానికులు ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. 9ఎకరాల్లో ఈ తంతు కొద్దిరోజులుగా జరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం విశేషం. భారీ యంత్రాలను ఉపయోగించి చెట్లను తొలగించడంతో పాటు వాటిని అక్కడి నుంచి తరలించి, భూమిని చదును చేయడం కొన్ని వారాల పాటు నిరంతరంగా సాగుతుంది. అయినా అటవీశాఖ అధికారులు ఎవరూ పట్టించుకోక పోవడం గమనార్హం.
అటవీ అధికారుల ఉదాసీనత..
అటవీ భూముల పరిరక్షణ విషయంలో కట్టుదిట్టమైన చట్టాలు ఉన్నప్పటికీ, వాటి అమలు విషయంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థానికంగా 9ఎకరాల్లో చెట్లు నరికి, అక్కడి నుంచి తరలించడమే కాకుండా.. భూమిని చదును చేస్తున్నా స్థానిక అటవీ శాఖ అధికారులు ఎందుకు మిన్నకున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నారు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం మాత్రమే కాకుండా సహకారం కూడా అందుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్ని ఎకరాల్లో భూమిని చదును చేస్తున్నా బీట్ ఆఫిసర్‌కు తెలియకుండా జరగదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అటవీ సంపదను కాపాడాల్సిన వారే అక్రమార్కుల సహకరించి అండగా నిలుస్తున్నారని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే అటవీ భూమిని ఆక్రమిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఉన్నతాధికారుల దృష్టికి..
అటవీ సంపదను కొల్లగొట్టి భూమిని చదును చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక అటవీ శాఖ అధికారులు అక్రమార్కులకే సపోర్టు చేస్తున్నారన్న అనుమానంతో స్థానిక పెద్దలు కొందరు జిల్లా అటవీశాఖ అధికారి, కలెక్టర్‌ను కలిసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు కబ్జాకోరుల భరతం పట్టి, అటవీ భూములను కాపాడాలని కోరుతున్నారు.
కబ్జా చేస్తే చర్యలు తప్పవు: కిషోర్ కుమార్, సెక్షన్ ఆఫీసర్
అటవీ సంపదను కబ్జా చేసినా, చెట్లు నరికి విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని సెక్షన్ ఆఫీసర్ కిషోర్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం రంగురాళ్లబోడు సమీపంలో ఉన్న 9ఎకరాల భూమి అటవీశాఖ ఆధీనంలో ఉందని, ఒకవేళ ఎవరైనా కబ్జాకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో ఇలాంటి ఆక్రమణలకు పాల్పడినవారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. విచారణ చేసి నిజానిజాలు తెలుస్తామని పేర్కొన్నారు.






