- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Forest Department: కార్చిచ్చుపై ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఫోకస్.. ప్రమాదాల కట్టడికి ప్రణాళికలు
వేసవిలో అటవీ ప్రాంతాల్లో జరిగే అగ్ని ప్రమాదాలపై అటవీ శాఖ అప్రమత్తమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: వేసవిలో అటవీ ప్రాంతాల్లో జరిగే అగ్ని ప్రమాదాలపై అటవీ శాఖ అప్రమత్తమైంది. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఆ శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే.. అటవీ సంపద బూడిదవుతుంది. వేలాది వృక్షాలు ఆహుతి అవుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో వంట చేయడం, సిగరెట్, బీడీ, చుట్ట లాంటివి తాగి పడేయడంతో మంటలు చెలరేగుతున్నాయి. మానవ తప్పిదాల వల్లే జరిగే ఈ ప్రమాదాలతో వృక్ష సంపద, వన్య ప్రాణులకు హాని కలుగుతోంది. ఇవే అంశాలను అటవీ శాఖ గుర్తించింది. ఈ వేసవిలో అగ్ని ప్రమాదాలను కట్టడి చేయడానికి తెలంగాణ అటవీ అధికారులు పయనం అవుతున్నారు. అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న గ్రామాలకు ..వెళ్తున్న వారు.. అక్కడ అటవీ, వన్యప్రాణి సంరక్షణ చర్యల్లో నిమగ్నమయ్యారు.
అడవికి నిప్పు - మనుగడకు ముప్పు
అటవీ సంరక్షణ కోసం గ్రామాబాట పట్టిన అధికారులు ప్రజలను చైతన్యపర్చనున్నారు. అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. అడవికి నిప్పు.. మనవాళి మనుగడకు ముప్పు..అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నారు. అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు సహకరించాలని గిరిపుత్రులను కోరుతున్నారు. అటవీ పరిసరాల్లో ప్రమాదాలు జరగకుండా చూడాలని సలహా ఇస్తున్నారు. ఒకవేళ ఊహించని ప్రమాదం ఎదురైతే.. వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అటవీ అధికారులు కోరుతూ.. చైతన్య సదస్సుల్లో ప్రజలందర్నీ భాగస్వామ్యం చేస్తున్నారు.
ఫారెస్టు ముందస్తు చర్యలు..
వేసవిలో మంటలు చెలరేగకుండా ఉండేందుకు అటవీ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. అటవీ ప్రాంతాలలో ఫైర్‌లైన్లు ఏర్పాటు చేస్తోంది. వృక్షాలు కాలిపోకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఫారెస్ట్ అధికారులు బృందాలుగా విడిపోయి.. నిరంతరం అడవుల్లో గస్తీ కాస్తున్నారు. అగ్ని ప్రమాదాలకు దారితీసిన పరిస్థితులపై అధికారులు ఇప్పటికే ఫోకస్పెంచారు.
తెలంగాణది ఏడో స్థానం
కార్చిచ్చులతో తెలంగాణ అడవులు సతమతమవుతున్నాయి. 2017లో అటవీ ప్రాంతాల్లో 12,927 అగ్ని ప్రమాదాలు సంభవించగా.. 2024 నాటికి వాటిసంఖ్య 13,497కి చేరుకున్నాయి. అత్యధిక అగ్ని ప్రమాదాలు సంభవించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచిందని గతంలోనే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇచ్చింది. దేశంలోని అటవీ అగ్ని ప్రమాదాలు సంబంధించిన టాప్ 10 జిల్లాల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయని నివేదించింది.
అప్రమత్తత అవసరం
గత కొన్నాళ్లుగా అమ్రాబాద్, కవ్వాల్, తాడ్వాయి, ఇల్లందు తదితర అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనలతో వన్య ప్రాణులతోపాటు విలువైన అటవీ సంపద ఆహుతైంది. దీనిని దృష్టిలో పెట్టుకొని..అటవీ శివారు ప్రాంతాల ప్రజలతోపాటు..అటవీ శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి సురేఖ సూచించారు. మానవ నిర్లక్ష్యం వల్లే అటవీ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నందున..వాటి నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు.






