Forest Department: రాష్ట్రంలో రోడ్ల విస్తరణ.. ఎట్టకేలకు అటవీ శాఖ అనుమతి.. కానీ ఒక కండిషన్..!

by Ramesh Naini |

అటవీశాఖ పరిధిలో చేపట్టనున్న రహదారుల పునరుద్దరణ, విస్తరణ పనులు చేపట్టేందుకు ఎట్టకేలకు ఆటవీ శాఖ అనుమతులు మంజూరు చేసింది.

Forest Department: రాష్ట్రంలో రోడ్ల విస్తరణ.. ఎట్టకేలకు అటవీ శాఖ అనుమతి.. కానీ ఒక కండిషన్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: (Forest Department) అటవీశాఖ పరిధిలో చేపట్టనున్న రహదారుల పునరుద్దరణ, విస్తరణ పనులు చేపట్టేందుకు ఎట్టకేలకు ఆటవీ శాఖ అనుమతులు మంజూరు చేసింది. అనుమతులు లేకపోవడంతో రహదారుల నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ పనులు చేపట్టేందుకు (R&B department) ఆర్ అండ్ బీ శాఖ, ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు అటవీశాఖ అనుమతి కోసం రెండేళ్ల కిందటే అర్జీలు పెట్టారు. ఈ పనులకు అనుమతుల మంజూరులో జాప్యం జరగడంతో గత కొంత కాలంగా పనులు నిలిచిపోయాయి. తాజాగా అటవీశాఖ జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలలో చేపట్టే రహదారుల పునరుద్దరణ, విస్తరణ పనులకు అనుమతులు ఇస్తూ జీవోలు జారీ చేసింది.

నిజామాబాద్ - జగదల్‌పూర్‌ వెళ్లే ఎన్.హెచ్-63 రహదారిలో ఏడు చోట్లలో బ్లాక్ స్పాట్లను పునరుద్దరిచేందుకు హెన్.హెచ్.ఏ.ఐ నిధులు మంజూరు చేసింది. కాని పనులు చేపట్టాల్సిన ప్రాంతం అంతా మంచిర్యాల జిల్లా చెన్నూరు డివిజన్ అటవీ ప్రాంతం పరిధిలో ఉంది. గుర్తించిన 7 చోట్లలో బ్లాక్ స్పాట్‌లను నాలుగు లేన్లకు విస్తరిస్తూ, శాశ్వతంగా మరమ్మతులు చేసేందుకు దాదాపు 3.75 ఎకరాల అటవీ భూమి కోల్పోవాల్సి వస్తుంది. బ్లాక్ స్పాట్ల శాశ్వత పునరుద్దరణ పనులు చేపట్టేందుకు కావలసిన అనుమతులను అటవీశాఖ జారీ చేసింది.

షరత్తులో కూడిన అనుమతులు

రహదారి నిర్మాణం పనులు చేపడుతున్న ఏజన్సీకి కొన్ని షరత్తులు పెట్టి అటవీ శాఖ అనుమతులు జారీ చేసింది. ఈ షరత్తులను అంగీకరిస్తేనే పనులు చేసేందుకు అనుమతులు మంజూరు చేస్తామని జీవోలో పేర్కొంది. మంచిర్యాల డివిజన్ అటవీ పరిధిలో 7-10 ఏళ్ల పాటు రహదారికి ఇరువైపులా చెట్లు పెంచాలని సూచించింది. ఈ చెట్ల నిర్వహణ బాధ్యత కూడా పనులు చేపట్టిన ఏజన్సీదే అంటూ పేర్కొంది. రహదారికి ఇరువైపులా కనీసం 2-3 వరుసలు పొడవైన చెట్లను పెంచాలని సూచించింది. రహదారి వెంట ఉండే సహజ వాగులు, నదులు, కాలువలు, కల్వర్టులు, కుంటలకు ఎలాంటి భంగం కల్పించరాదని, పనుల నేపథ్యంలో వాటిని ధ్వంసం చేయరాదని హెచ్చరించింది. సహజ నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించకుండా చూడాల్సిన బాధ్యత ఏజన్సీదే అంటూ పేర్కొంది. అడవి జంతువుల సంచారానికి కూడా ఆటంకం కలిగించకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

సింగిల్ లేన్ల నుంచి డబుల్ లేన్ విస్తరణలో 10.5 ఎకరాల అటవీ భూమి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి డివిజన్లో 7 కిలోమీటర్ల మేర విస్తరించనున్న రహదారి నిర్మాణంలో 10.5 ఎకరాలకుపై అటవీ భూమి కోల్పోతుంది. ఖమ్మంపల్లి- భూపాలపల్లి మధ్యలో ఉన్న ఆర్ అండ్ మీ సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుకు విస్తరించనున్న నేపథ్యంలో ఈ అటవీ భూమి ముంపునకు గురవుతుంది. ఈ భూమికి రూ.3.98 కోట్ల పరిహారంతో పాటు ఈ భూమికి బదులుగా మరో చోట ప్రభుత్వ భూమిని తీసుకుంటూ, వివిధ పరిమితులు పెట్టి అటవీశాఖ అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖకు బదిలీ చేసిన భూమిలో చెట్లు పెంచడం, అటవీ జంతువులు, వన్యమృగాల సంరక్షణకు చర్యలు తీసుకోవాలంటూ సూచించింది. పరిహారం కింద పొందిన రూ.3.98 కోట్లు అటవీ అభివృద్ధికి, అటవీ జంతువుల రక్షణకు ఖర్చు చేయాలంటూ ఆదేశించింది. ఖాళీ స్థలం ఉన్న చోట అటవీ పునరుత్పత్తికి చర్యలు తీసుకోవాలని సూచించింది.

వంద ఎకరాల ప్రభుత్వ భూమి బదలాయింపు

MRL-13-చామన్‌పల్లి నుంచి చెన్నూర్ డివిజన్‌లోని కుశ్నపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి 7.5 ఎకరాలకు పైగా అటవీ భూమి ముంపునకు గురవుతుంది. ఈ భూమికి బదులుగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ అటవీ డివిజన్, కరమెరి మండలంలోని ఇందాని గ్రామం పరిధిలో దాదాపు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు బదిలీ చేశారు. దీంతో పాటు రూ.42.15 లక్షల పరిహారం కోరింది. బదిలీ చేసిన 100 ఎకరాల భూమిలో రూ.12.31 లక్షల వ్యయంతో చెట్లు పెంచాలి. హద్దులు ఏర్పాటు చేయాలి. అగ్నిమాపక నిర్వహన చర్యలు చేపట్టాలని, కేటాయించిన భూమి చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేయాలని కండిషన్ పెట్టింది. మరో రూ.39.84 లక్షలతో వన్యప్రాణుల ఆవాసాలను మెరుగుపరచడం, జంతు రక్షణ కేంద్రాలను స్థాపించడం, తదితర కార్యక్రమాలకు ఈ నిధులు ఉపయోగించాలని సూచించింది

Next Story