- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫుట్‌పాత్ కాదు.. షాపింగ్ స్ట్రీట్..!
నగర రోడ్లపై ఫుట్ పాత్ లు కనిపించడం లేదు. కొందరు బడా వ్యాపారులు యథేచ్ఛగా ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు.

దిశ, హస్తినాపురం : నగర రోడ్లపై ఫుట్ పాత్ లు కనిపించడం లేదు. కొందరు బడా వ్యాపారులు యథేచ్ఛగా ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. ఇవి అధికారులకు కనిపించడం లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో నాగార్జునసాగర్ హైవే, సాగర్ రింగ్ రోడ్డు నుంచి ఓంకార్ నగర్, సంతోషిమాత కమాన్, హస్తినాపురం, శిరిడి సాయి నగర్, క్రిస్టియన్ కాలనీ, కాటమ్ పార్వతమ్మ కమాన్ నుంచి బీఎన్ రెడ్డి వరకు రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ ఉండేది.
నాలుదైదు సంవత్సరాల క్రితం నేషనల్ హైవే అథారిటీ వారు రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్‌లు నిర్మించారు. పాదాచారులు రోడ్డుపై నడవకుండా ఫుట్ పాత్ పైనే నడిచేందుకు, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు గ్రిల్స్ ఏర్పాటు చేశారు. కాలక్రమేణా జీహెచ్ఎంసీ అధికారులు ఫుట్ పాత్‌ల నిర్వహణ సరిగా చేయలేకపోవడంతో అవి కాస్త బండలు ఊడిపోయి, గోతులు, గోతులుగా మారిపోయాయి. ఈ ఫుట్ పాతుల పైనే జీహెచ్ఎంసీ అధికారులు మొక్కలు నాటడం అవి పెరిగి పెద్దవయ్యాయి. దీంతో వీటిని వ్యాపారులు ఆసరాగా చేసుకున్నారు.
ఫుట్ పాత్‌లపై బోర్డులు, హోర్డింగులు..
అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకొని రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఎలక్ట్రానిక్ షోరూములు, హోటల్స్, హాస్పిటల్స్, టీ కొట్టులు, వైన్ షాప్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పండ్ల వ్యాపారులు ఫుట్ పాత్ ను కబ్జా చేసి వారి అవసరాల నిమిత్తం , వారి వ్యాపారాలు, పెంచుకోవడానికి వారి వ్యాపారాల పేరుతో కలిగిన పెద్దపెద్ద లైటింగ్స్ తో కూడిన బోర్డులు (హోర్డింగులను) ఫుట్ పాత్ పైనే పర్మినెంట్‌గా నిర్మించారు. దీనికితోడు కార్లు, బైకులు, తోపుడు బండ్లు, అంబులెన్సులు నిలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బీఎన్ రెడ్డి నగర్ నుంచి సాగర్ రింగ్ రోడ్డు వరకు విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది.
సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకైతే ఇంకా విపరీతమైన ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతున్నది. ఆయా బస్తీల ప్రజలు మెయిన్ రోడ్డుపైకి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఫుట్ పాత్‌పై నడవడానికి వీలు లేకపోవడంతో పాదాచారులు రోడ్లపైనే నడుస్తుండడంతో వారికి ఎన్నో ప్రమాదాలు జరిగి గాయాల పాలైన సందర్భాలు కోకొల్లాలు. మరి ఇదంతా జరుగుతున్న విషయం అధికారులకు తెలిసినా ఇటు జీహెచ్ఎంసీ వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ ఫుట్ పాత్ అక్రమలపై, జిహెచ్ఎంసి అధికారులు, పోలీసులు, వెంటనే చర్యలు తీసుకోవాలని, పాదాచారులు, ఆయా బస్తీల, ప్రజలు కోరుతున్నారు.






