- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొగమంచు ఎఫెక్ట్.. వరుసగా రోడ్డు ప్రమాదాలు
పొగమంచు ప్రాణాలు తీస్తుంది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు కనిపించి.. కనిపించకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తద్వారా ఎంతో మంది చనిపోతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పొగమంచు ప్రాణాలు తీస్తుంది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు కనిపించి.. కనిపించకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తద్వారా ఎంతో మంది చనిపోతున్నారు. కావున సుదూర ప్రయాణాలు చేసే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ, పోలీసు అధికారులు సూచిస్తున్నారు. రానున్న 15 రోజులు అత్యంత జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. దట్టంగా కమ్మే పొగమంచు కారణంగా వరుస ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రయాణాల వేళ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏటా 30 వేలకు పైగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని, వీటిలో పొగమంచు కారణంగా జరుగుతున్న ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ప్రయాణాలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి.
పొగమంచు కారణంగా ప్రమాదాలు
డిసెంబర్ 14న మెదక్ జిల్లాలో నేషనల్ హైవే-161పై పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గడంతో బైక్.. ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వారంతా సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయడానికి సొంతూరుకు వెళ్తుండగా జరిగింది. ఈనెల 10న ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం తరోడ వద్ద పొగమంచు కారణంగా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. 7న హైదరాబాద్ - లాలాపేట రహదారిపై కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. వారంతా కీసర నుంచి తార్నాకకు వెళ్తున్నారు. అలాగే ఏపీలోనూ ఈనెల 12న అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డుపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది పర్యాటకులు మరణించగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొగమంచు కారణంగా డ్రైవర్‌కు రోడ్డు కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
2024 డిసెంబర్‌లో ప్రమాదాలు
* డిసెంబర్ 7న యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్‌పూర్ సమీపంలో కారు నియంత్రణ కోల్పోయి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు యువకులు మరణించారు.
*డిసెంబర్ 23న నానక్‌రామ్‌గూడ వద్ద తెల్లవారుజామున కారు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో సీబీఐటీ కాలేజీ విద్యార్థిని సహా ఇద్దరు యువకులు మృతిచెందారు.
*డిసెంబర్ 24న మలక్‌పేటలో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు ముగించుకుని వస్తుండగా జరిగిన బైక్ ప్రమాదంలో ఓ యువకుడు మరణించాడు.
*డిసెంబర్ 30న తెల్లాపూర్ వద్ద అతి వేగంగా వెళ్తున్న బైక్.. టిప్పర్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు చనిపోయారు.
హైదరాబాద్ పరిధిలో..
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2024లో మొత్తం 2,745 ప్రమాదాలు జరిగాయి. మొత్తం 227 మంది చనిపోయారు. సగటున నెలకు 200కు పైగా ప్రమాదాలు జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2024లో 3,829 రోడ్డు ప్రమాదాల్లో 842 మంది మరణించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ఏడాది 178 ప్రమాదాలు జరిగాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన 3,207 రోడ్డు ప్రమాదాల్లో 653 మంది చనిపోయారు.
వాతావరణ శాఖ హెచ్చరికలు
డిసెంబర్ 16-22 తేదీల మధ్య తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చలి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దట్టమైన పొగమంచు కారణంగా రాత్రి వేళ కనిపించే దూరం చాలా తక్కువగా ఉండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. లో బీమ్ లైట్లు వాడాలి.. పొగమంచు ఉన్నప్పుడు హై-బీమ్ లైట్లు వాడొద్దు. విజిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు సాధారణం కంటే తక్కువ వేగంతో వెళ్లాలి. ముందు వెళ్తున్న వాహనానికి సాధ్యమైనంత ఎక్కువ దూరం పాటించాలి. రాత్రి ప్రయాణాలు వద్దు. వీలైనంత వరకు అర్ధరాత్రి లేదంటే తెల్లవారుజామున సుదూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పోలీసు శాఖ సూచిస్తున్నది.






