- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాగ్రత్త.. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, విషం!
హైదరాబాద్ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ కల్తీ దందాను కొనసాగిస్తున్న ముఠాపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విరుచుకుపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ కల్తీ దందాను కొనసాగిస్తున్న ముఠాపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విరుచుకుపడ్డారు. నగర శివారులోని కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాన్ని మంగళవారం అధికారులు ఛేదించారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ టీం కాటేదాన్‌లోని సదరు తయారీ యూనిట్‌పై మెరుపు దాడులు నిర్వహించింది. అక్కడ నాసిరకం అల్లం, వెల్లుల్లితో పాటు ప్రమాదకరమైన రసాయనాలు, రంగులు కలిపి పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కల్తీ పదార్థాలను ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లలో నింపి మార్కెట్‌లోకి సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది.
రూ. 22 లక్షల సామాగ్రి స్వాధీనం..
ఈ దాడుల్లో సుమారు రూ. 22 లక్షల విలువైన కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ముడి పదార్థాలు, తయారీకి ఉపయోగించే యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పారిశుద్ధ్యం లేని వాతావరణంలో, కుళ్ళిపోయిన పదార్థాలను వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తీరును చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ఈ కల్తీ దందాకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న హాసన్ రూపానీని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు గత కొంతకాలంగా ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడిని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించి, కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. "కల్తీ పదార్థాలను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నగరవ్యాప్తంగా ఇలాంటి తయారీ కేంద్రాలపై నిఘా కొనసాగుతుంది" అని టాస్క్ ఫోర్స్ అధికారులు హెచ్చరించారు.






