ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌కు తూట్లు.. ‘హై-ఇన్‌కం’ కార్యాలయాలే అధికారుల టార్గెట్

by Kema Shiva Kumar |

డీజీ, జిల్లా రిజిస్ట్రార్ పోస్టుల్లో ఇన్‌చార్జిల పాలన, నిబంధనలకు విరుద్ధంగా సబ్ రిజిస్ట్రార్ల డిప్యూటేషన్లు, నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌కు తూట్లు.. ‘హై-ఇన్‌కం’ కార్యాలయాలే అధికారుల టార్గెట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒకే భూమిని.. అటు సాగు భూమిగా తహశీల్దార్.. ఇటు ఇంటి స్థలాలుగా సబ్ రిజిస్ట్రార్ చేసేస్తున్నారు. మరోవైపు ఆ భూములపై రిజిస్ట్రేషన్ నిషేదాజ్ఞలు కొనసాగుతుండగానే దందా సాగిపోతున్నది. అటు భూ భారతి పోర్టల్ సాగిస్తున్న దందా.. ఇటు రియల్ ఎస్టేట్ రంగం విరాజిల్లుతుండడంతో కొందరు సబ్ రిజిస్ట్రార్లు కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. అందుకే ఖరీదైన ఏరియాలో పని చేయాలని తహతహలాడుతున్నారు. దాంతో ఎలాగైనా ఆదాయం వచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేయాలని ప్రయత్నిస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయ మార్గంగా డిప్యూటేషన్ల పరంపరను కొనసాగిస్తున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో కొత్త రకమైన బదిలీల ప్రక్రియ సాగుతోంది. గతంలో ఓ అధికారి ముడుపులు తీసుకొని పోస్టింగులు ఇచ్చారని ఆరోపణలు వినిపించాయి. దాంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీరియస్ అయ్యారు. అవినీతికి పాల్పడితే సీరియస్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు. ఈ క్రమంలోనే జోన్-6 పరిధిలోని కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఇతర ప్రాంతాల సబ్ రిజిస్ట్రార్లను డిప్యూటేషన్లపై రప్పించారు. వారంతా నీతిమంతంగా పని చేస్తారని ఆశించారు. కానీ మంత్రి సదుద్దేశంతో నిర్ణయాలు తీసుకున్నా అధికారులపై అవినీతి ఆరోపణలు మాత్రం ఆగడం లేదు.

వారిలోనూ ఇద్దరు సస్పెండ్..

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలోనూ ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు సస్పెన్షన్‌కు గురి కావడం గమనార్హం. ఇక్కడి వారు అవినీతికి పాల్పడుతున్నారన్న ఫిర్యాదులతో లూప్ లైన్ పోస్టింగ్ ఇచ్చారు. కానీ దూర ప్రాంతాల నుంచి ఆదాయ మార్గాలు బాగా ఉండే కార్యాలయానికి రావడంతో వారికీ ఆశలు పుట్టాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారూ ఉన్నారు. అలాగే లంచం అడిగారంటూ హైకోర్టు దాకా చేరిన ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో పెంచిన ధరలతో ఆదాయ మార్గాలను వెతికే ప్రక్రియ ఎలా సజావుగా సాగుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అంతటా ఇన్‌చార్జిలే..

రాష్ట్ర వ్యాప్తంగా ఆరు డిప్యూటీ జనరల్ రిజిస్ట్రార్లకు గాను రెండింట్లోనే ఉన్నారు. అంతటా ఇన్‌చార్జిల పాలనే నడుస్తోంది. రంగారెడ్డి డీజీ కూడా త్వరలోనే ప్రమోషన్ పొందితే ఐదు ఖాళీలు ఏర్పడుతాయంటున్నారు. మేడ్చల్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్ డిప్యూటీ జనరల్ రిజిస్ట్రార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐతే గ్రూప్-1 నుంచి ఓ ఐదుగురు రానున్నారని తెలిసింది. అంటే 9 పోస్టులు కచ్చితంగా ఖాళీగా ఉంటాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ సీనియర్ అసిస్టెంట్లతో నడిపిస్తున్నారు. ఉదాహరణకు మూసాపేట కార్యాలయం సీనియర్ అసిస్టెంట్‌తోనే నడుస్తోంది. కుత్బుల్లాపూర్, సరూర్ నగర్, గండిపేట, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఉప్పల్, పటాన్‌చెరు సబ్ రిజిస్ట్రార్లు డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పని చేస్తున్నారని తెలిసింది. ఇక్కడి వారిని కాదని, దూర ప్రాంతాల నుంచి డిప్యూటేషన్ ఇవ్వడం వల్ల ఏదైనా మార్పు కనిపించిందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో మాదిరిగానే ఫిర్యాదులు వస్తున్నాయంటున్నారు. ఆదాయ మార్గాలు ఉన్న ప్రాంతాల్లో డిప్యూటేషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఆర్డర్స్, నిబంధనలకు విరుద్ధంగా షార్ట్ కట్ బదిలీలను చేపట్టినట్లు కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లోనేమో అదనపు బాధ్యతలు లేదా ఇన్‌చార్జి అంటూ సీనియర్ అసిస్టెంట్లకు చాన్స్ ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

పోస్టుల భర్తీతోనే పెరగనున్న పర్యవేక్షణ

జోన్-6 పరిధిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సబ్ రిజిస్ట్రార్లు పని చేయడం ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌కి విరుద్ధమని ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వస్తే తక్షణం ఎంక్వయిరీ చేయాలని, నిజమని తేలితే సస్పెండ్ చేయాలంటున్నారు. అంతే తప్ప మరో ప్రాంతం నుంచి హైదరాబాద్ పరిసర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డిప్యూటేషన్ల ప్రక్రియను కొనసాగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. డిప్యూటేషన్లపై పని చేస్తోన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ఎలాంటి ఆరోపణలు రావడం లేదా? ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ఫిర్యాదులు సహజమేనని, ఐతే ఉన్నతాధికారులు విచారించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఖాళీగా ఉన్న డీజీ, జిల్లా రిజిస్ట్రార్ పోస్టులను భర్తీ చేయడం ద్వారానే పర్యవేక్షణ పెరుగుతుందంటున్నారు. ఇన్నేసి ఇన్‌చార్జిల పాలనలో ఉండడం వల్ల ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపైనా అధికారుల ఫోకస్ లేదంటున్నారు.

Next Story