నాలాల్లో వ‌ర‌ద నీరు సాఫీగా వెళ్లాలి.. హైడ్రా కమిషనర్ రంగనాథ్

by Kema Shiva Kumar |

వ‌ర్షాకాలం ముందుగానే ప్రారంభమైంది.

నాలాల్లో వ‌ర‌ద నీరు సాఫీగా వెళ్లాలి.. హైడ్రా కమిషనర్ రంగనాథ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వ‌ర్షాకాలం ముందుగానే ప్రారంభమైంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వ‌ర‌ద ముంచెత్తుతోంది. నాలాల నుంచి వ‌ర‌ద నీరు సాఫీగా సాగ‌డం లేదు. తేలిక పాటి వ‌ర్షాల‌కే ప‌రిస్థితి ఇలా ఉంటే.. కుండ పోత వ‌ర్షాలకు నానా అవస్థలు ప‌డాల్సి ఉంటుంది. ఈ స‌మ‌స్య నుంచి గ‌ట్టెక్కడానికి ఏం చేద్దామనిఅని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇరిగేష‌న్‌, జీహెచ్ ఎంసీ, మున్సిప‌ల్ శాఖ‌ల‌లో నాలాల విభాగానికి చెందిన ఇంజినీరింగ్ అధికారుల‌తో హైడ్రా కార్యాల‌యంలో శ‌నివారం చ‌ర్చించారు. వ‌ర్షాకాలంలో లోత‌ట్టు ప్రాంతాలు, ర‌హ‌దారులు మునిగిపోకుండా చ‌ర్యలు తీసుకోవాల‌ని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విష‌యాన్ని క‌మిష‌న‌ర్ గుర్తు చేశారు. ఈ క్రమంలో అంద‌రూ అప్రమ‌త్తంగా ఉండి స‌మ‌స్య ప‌రిష్కరానికి చ‌ర్యలు తీసుకోవాల‌ని సూచించారు.

స‌మ‌స్య ఉంటే చెప్పండి..

నాలాల స‌మ‌స్య త‌లెత్తకుండా ప‌టిష్టమైన చ‌ర్యలు తీసుకోవాల‌ని.. ఎక్కడైనా స‌మ‌స్య ఉంటే వెంట‌నే త‌మ దృష్టికి తీసుకురావాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సూచించారు. నాలాల ఆక్రమ‌ణ‌లో నివాసాలుంటే ప‌రిష్కార మార్గాలు చూద్దాం.. ఇత‌ర క‌ట్టడాలుంటే తొల‌గించాల్సిన‌ అవ‌స‌రం ఉంద‌న్నారు. క్షేత్ర స్థాయిలో మీకేమైనా ఇబ్బందులుంటే నేరుగా స‌మాచారం ఇస్తే తాము చ‌ర్యలు తీసుకుంటామ‌న్నారు. ప్రాంతాల‌వారీ నాలాల స‌మ‌స్యల‌ను గుర్తించాలి.. మీరంతా స్పష్టమైన అవ‌గాహ‌న‌తో ఉంటే.. స‌మ‌స్య ప‌రిష్కారానికి త‌గిన చ‌ర్యలు తీసుకుంటామ‌న్నారు. చెరువుల పున‌రుద్ధర‌ణ‌తో పాటు.. నాలాల ప‌రిర‌క్షణకు ప్రభుత్వం చాలా ప్రాధాన్యత‌నిస్తోంద‌ని.. ఆ క్రమంలోనే క‌బ్జాల నివార‌ణ‌పై హైడ్రా దృష్టి పెట్టింద‌న హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ చెప్పారు. నాలాలు కుంచించుకుపోవ‌డం.. మ‌ధ్యలో ఆటంకాలు ఏర్పడినా, ఆక్రమ‌ణ‌ల‌కు పాల్పడినా ఆ వివ‌రాలివ్వాల‌ని కోరారు. ఇందుకు సంబంధించిన నివేదిక రూపొందించాల‌ని సూచించారు.

చెత్త పేరుకుపోకుండా..

క‌ల్వర్టుల వ‌ద్ద చెత్త పేరుకుపోతోంది. ఆ చెత్తను తొల‌గించ‌డంలో నిర్లక్ష్యమే వ‌ర‌ద ముప్పున‌కు ప్రధాన కార‌ణంగా ఉంద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ పేర్కొన్నారు. మ‌ల‌క్‌పేట వ‌ద్ద మ్యాన్ హోళ్ల నుంచి వ‌ర‌ద పోటెత్తడానికి ఇదే కార‌ణ‌మ‌న్నారు. చెత్త తొల‌గించే ప‌నులు సాఫీగా సాగుతున్నాయా లేదా అనేది ప‌ర్యవేక్షించాల‌ని సూచించారు. నాలాల్లో చెత్త, నిర్మాణ వ్యర్థాలు వేసిన వారిపైన‌ క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాలన్నారు. స‌మాచారం ఇస్తే వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామని అన్నారు. హైడ్రా పోలీసు స్టేష‌న్‌లో వారిపై కేసులు పెట్టి విచారిస్తామ‌న్నారు. ఈ ఏడాది న‌గ‌రానికి వ‌ర‌ద ముప్పు లేకుండా అంద‌రూ స‌మ‌న్వయంతో క‌లిసి ప‌ని చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగనాథ్ సూచించారు.

Next Story