ఇండోనేషియాలోని ఆకస్మిక వరదల బీభత్సం,, 17 మంది మృతి

by Malleboina Mahesh |

కుండపోతగా కురిసిన వర్షాల కారణంగా ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం భయంకరమైన ప్రకృతి విపత్తును ఎదుర్కొంటోంది. భారీ రుతుపవన వర్షాల కారణంగా ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లో ఆకస్మిక వరదలు వచ్చాయి.

ఇండోనేషియాలోని ఆకస్మిక వరదల బీభత్సం,, 17 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కుండపోతగా కురిసిన వర్షాల కారణంగా ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం భయంకరమైన ప్రకృతి విపత్తును ఎదుర్కొంటోంది. భారీ రుతుపవన వర్షాల కారణంగా ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లో ఆకస్మిక వరదలు వచ్చాయి. అలాగే పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడటంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. కొండ ప్రాంతాల నుంచి బురద, శిథిలాలు గ్రామాల గుండా ప్రవహించాయి. దీంతో పలుచోట్ల తీవ్ర విధ్వంసం జరిగింది. ఈ విపత్తు కారణంగా ఇప్పటివరకు అధికారులు 17 మంది మరణించినట్లు ధృవీకరించగా.. మరో ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఈ ప్రకృతి విపత్తు సుమత్రాలోని సుమారు ఆరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. సెంట్రల్ తపనులి, సిబోల్గా, సౌత్ తపనులి జిల్లాలో అత్యధిక ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించింది. దాదాపు 2,000 ఇళ్లు, భవనాలు నీట మునిగాయి. వరద ఉధృతికి కనీసం రెండు ప్రధాన వంతెనలు కొట్టుకుపోవడంతో పాటు, ప్రధాన రహదారులన్నీ బురద, శిథిలాలతో మూసుకుపోయాయి. దీంతో రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. ఈ విపత్తు కారణంగా 2,800 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచి తాత్కాలిక శిబిరాలకు తరలివెళ్లారు. కాగా జన సాంద్రత తక్కువగా ఉండటంతో ప్రాణ నష్టం తగ్గింది. ఇలాంటి వరదలు ఇండియాలో వచ్చి ఉంటే వందల సంఖ్యలు ప్రజలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు

ఇదిలా ఉంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో వాతావరణం అనుకూలించక పోవడం, బురద కారణంగా రోడ్లు మూసుకుపోవడం వంటి సవాళ్ల మధ్య జాతీయ విపత్తు ఉపశమన సంస్థ (BNPB) సహాయక చర్యలను కొనసాగిస్తోంది. సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నందున, మరిన్ని కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరుతున్నారు. పశ్చిమ సుమత్రా ప్రావిన్స్ కూడా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అత్యవసర ప్రతిస్పందనను ప్రకటించింది.

Next Story