T Congress: మంత్రి 'రాజన్న' పేరుతో జెండాలు.. స్థానిక ఎన్నికల వేళ కాంగ్రెస్ లో బిగ్ ట్విస్ట్ తప్పదా?

by Prasad Jukanti |   (  Updated:2025-10-01 12:53:22  IST  )

ధికార కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు మరోసారి చర్చనీయాశంగా మారింది.

T Congress: మంత్రి రాజన్న పేరుతో జెండాలు.. స్థానిక ఎన్నికల వేళ కాంగ్రెస్ లో బిగ్ ట్విస్ట్ తప్పదా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: అధికార కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే (Munugode MLA) కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) తీరు చర్చనీయాశంగా మారింది. మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న ఆయన ఇటీవల బహిరంగంగానే హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా సొంత పార్టీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్లు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇటీవలే ఆయన భారీ కాన్వాయ్ తో విజయవాడ వెళ్లడం కోమటిరెడ్డి పార్టీ మారబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తాజాగా మనుగోడు నియోజకవర్గం చండూరులో 'మంత్రి రాజన్న' అంటూ జెండాలు వెలిశాయి. రాజగోపాల్ రెడ్డి ఆర్మీ పేరుతో ఈ జెండాలను ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు. రాజగోపాల్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఆయన చెప్పింది ఆచరించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న అభిమానులు చెప్పడం నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెంచుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికల వేళ..

మంత్రి పదవి ఇస్తామంటేనే తాను కాంగ్రెస్ లోకి వచ్చానని తనకంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చి తనను దూరం పెడుతున్నారని ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పారని ఇకపై తాను ఎంత దూరమైనా వెళ్తానని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. మనసు చంపుకుని బతకడం తన వల్ల కాదని తన నియోజకవర్గ ప్రజల కోసం మరోసారి పదవీ త్యాగానికైనా రెడీ అంటూ ఆయన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. అయితే మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడపాదడపా సొంత పార్టీకి స్ట్రోక్స్ ఇస్తూనే ఉన్న తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో మంత్రి రాజన్న అంటూ జెండాలు ప్రత్యక్షం కావడం చర్చనీయాశంగా మారింది. తనకు మంత్రి పదవి దక్కని నేపథ్యంలో ఏదైనా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోబోతున్నారా? అనే చర్చ నియోజకవర్గంలో వినిపిస్తోంది. అసలే లోకల్ బాడీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా బీఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఇటువంటి తరుణంలో ఈ జెండాల వెనుక రాజగోపాల్ రెడ్డి ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? లేక అభిమానంతో ఆయన మద్దతుదారులు ఏర్పాటు చేశారా అనేది ఉత్కంఠ రేపుతోంది.

Next Story