కీలక ఖనిజాల ఉత్పత్తి రంగంలో తొలి అడుగు : సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్

by Muthe.Rajitha |

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కీలక ఖనిజాల రంగంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో భువనేశ్వర్ లో గురువారం ప్రముఖ పరిశోధన సంస్థ సి ఎస్ ఐ ఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) అనుబంధ సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీతో ఒక ఎంఓయూ కుదుర్చుకుంది.

కీలక ఖనిజాల ఉత్పత్తి రంగంలో తొలి అడుగు : సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కీలక ఖనిజాల రంగంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో భువనేశ్వర్ లో గురువారం ప్రముఖ పరిశోధన సంస్థ సి ఎస్ ఐ ఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) అనుబంధ సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీతో ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. ముఖ్యంగా సింగరేణి కీలక ఖనిజాల రంగంలోకి ప్రవేశించడానికి ఇది తొలిమెట్టుగా భావిస్తున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో నీతి ఆయోగ్ సభ్యులు, డి ఆర్ డి ఓ మాజీ డైరెక్టర్ జనరల్, పద్మ భూషణ్ వీకే సారస్వత్ సమక్షంలో జరిగిన ఈ ఎంఓయూ సమావేశంలో సింగరేణి

సీఎండీ ఎన్.బలరామ్, సి ఎస్ ఐ ఆర్ - ఐఎంఎంటి డైరెక్టర్ డాక్టర్ రామానుజ్ నారాయణ్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు కీలక ఖనిజాల రంగంలోకి కూడా అడుగు పెట్టాలని నిర్ణయించిందని, ఈ నేపథ్యంలో ఈ ఒప్పందం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుందని అన్నారు. సింగరేణి గనులు, ఆయా ప్రాంతాల్లో ఉన్న వివిధ రకాల కీలక ఖనిజాల అన్వేషణ, వాటి ఉత్పత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ఇరు రాష్ట్రాల మధ్య సహకారం కోసం ఉమ్మడి భాగస్వామ్య పద్ధతిలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సీఎండీ బలరాం తెలిపారు. సింగరేణి సంస్థ తాను చేపట్టదలచిన కీలక ఖనిజాల ఉత్పత్తికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ, భువనేశ్వర్ వారు పూర్తిస్థాయి సాంకేతిక సహకారాన్ని అందించనున్నారని వెల్లడించారు. ఖనిజ ఉత్పత్తి సమయంలో పూర్తి పర్యావరణహిత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ఈ ఒప్పందంలో పొందుపర్చామన్నారు. .

సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో కొన్నింటిలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి విద్యుత్ ఉత్పత్తి సందర్భంగా విడుదల అయ్యే ఫ్లై యాష్ లో కూడా వీటిని కనుగొనడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు సమీపంలోని దుర్గం గుట్ట బ్లాకులో సగటున 266.21 పీపీఎం స్థాయిలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్ ఇండియా వారు శాంపిల్స్ ద్వారా నిర్ధారించారని తెలిపారు. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ తన వద్ద లభ్యమవుతున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నుండి కీలక ఖనిజాల ఉత్పత్తికి సంసిద్ధమైందని సీఎండీ బాలరాం తెలిపారు.

సింగరేణి ప్రాంతంలో 14 రకాల ఖనిజాల ఉనికి కనుగొన్నట్లు తెలియజేస్తు వీటిలో లాంథనం, సీరియమ్, ప్రసియోడీమియం వంటి 6 రకాల లైట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, అలాగే ఇట్రియం, స్కాండియం, డిస్ఫ్రోజియం వంటి 8 రకాల హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉనికిని కనుగొన్నామని, వీటిపై ఇంకా సంపూర్ణ పరిశీలన ను ఐఎంఎంటి సంస్థ ద్వారా నిర్వహింపజేస్తున్నామన్నారు. అంతేకాక ఆస్ట్రేలియాతో కూడా కీలక ఖనిజాల ఉత్పత్తికి సంబంధించి అవగాహనకు వచ్చామన్నారు. దీనిలో కూడా ఐఎంఎంటి సేవలు వినియోగించే అవకాశం ఉందని సీఎండీ బలరాం అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశీయంగా కీలక ఖనిజాల ఉత్పత్తి రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో సింగరేణి సంస్థ కూడా తన వంతుగా కొన్ని బ్లాకులను చేపట్టడానికి సర్వసన్నద్ధమై ఉందని సీఎండీ తెలియజేశారు. ఈ సందర్భంగా సి ఎస్ ఐ ఆర్ - ఐఎంఎంటి డైరెక్టర్ రామానుజ్ నారాయణ్ మాట్లాడుతూ సింగరేణితో కుదిరిన ఈ ఒప్పందం ఒక గొప్ప లక్ష్య సాధనకు శ్రీకారం అని పేర్కొన్నారు.

Next Story