అమీర్‌పేట‌లో అగ్నిప్రమాదం.. 50 మందికి పైగా సేఫ్.. హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అందులో చిక్కుకున్న‌ 50 మందికి పైగా ఉన్నవారిని హైడ్రా శుక్ర‌వారం కాపాడింది.

అమీర్‌పేట‌లో అగ్నిప్రమాదం.. 50 మందికి పైగా సేఫ్.. హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ ఎక్స్టింగ్విష‌ర్ ద్వారా మంట‌ల‌ను క్ష‌ణాల్లో నియంత్రించి అందులో చిక్కుకున్న‌ 50 మందికి పైగా ఉన్నవారిని హైడ్రా శుక్ర‌వారం కాపాడింది. అమీర్‌పేట‌లోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లోని నీల‌గిరి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో విద్యుత్ కేబుళ్లున్న ప్యాన‌ల్ బోర్డులో ఒక్క‌సారిగా మంట‌లు వ్యాపించాయి. ఈ స‌మాచారం హైడ్రా కంట్రోల్ రూమ్‌కు స‌రిగ్గా ఉద‌యం 11:01 గంట‌ల‌కు అందిందని అధికారులు తెలిపారు. క్ష‌ణాల్లో ఫీల్డ్‌మీద ఉన్న‌హైడ్రా డీఆర్ఎఫ్ బృందాల‌కు హైడ్రా కంట్రోల్ రూం సిబ్బంది చేర్చారు. ఆ చేరువ‌లో ఉన్న హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది స‌రిగ్గా 11:04 నిమిషాల‌కు అక్క‌డ‌కుచేరుకుని ఫైర్ ఎక్స్టింగ్విష‌ర్ల ద్వ‌ారా మంట‌ల‌ను నియంత్రించినట్లు తెలిపారు. ఒక ప‌క్క మంట‌ల‌ను అదుపులోకి తెస్తూనే హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. ఇంత‌లో మ‌రో రెండు బృందాలు అక్క‌డ‌కు చేరుకున్నాయి. వీరితో పాటు.. ఫైర్‌, పోలీసు విభాగాలు కూడా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యాయి. మెట్ల మార్గం వ‌ద్దే క‌రెంటు కేబుళ్లు త‌గ‌ల‌ప‌డ‌డం.. పొగ‌లు క‌మ్మేయ‌డంతో రెండో అంత‌స్తులో చిక్కుకున్న వారిని హైడ్రా డీఆర్ఎఫ్ వ‌ద్ద సిద్ధంగా ఉన్న రోప్ ల్యాడార్ల ద్వారా కింద‌కు దించారు. ఇలా మంట‌ల‌నార్ప‌డం.. వెంట‌నే స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభమ‌వ్వ‌డంతో ఎవ‌రికీ ఎలాంటి ప్రాణ‌హాని క‌ల‌గ‌లేదు. మంట‌ల‌నార్ప‌డం ఏమాత్రం ఆల‌స్యం అయినా..పెను ప్ర‌మాదం సంభ‌వించేది.

ఊపిరి పీల్చుకున్న అధికారులు..

అమీర్‌పేట అంటేనే ఐటీ రంగంతో పాటు.. ప‌లు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల‌కు శిక్ష‌ణ ఇచ్చే అడ్డా.. ఇక్క‌డ ఉన్న మైత్రేయివ‌నం, ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో వంద‌లాది శిక్ష‌ణ కేంద్రాలున్నాయి. ప్ర‌తి అంత‌స్తులో ప‌దుల సంఖ్య‌లో కోచింగ్ సెంట‌ర్లున్నాయి. ఇక్క‌డ మంట‌లంటుకుంటే ఆ ప్ర‌మాదాన్ని ఊహించ‌లేం.. వేలాది మంది ఇక్క‌డ శిక్ష‌ణ పొందుతుంటారు. అమీర్‌పేట‌లో అగ్ని ప్ర‌మాదం అని తెలియ‌డంతోనే న‌గ‌ర‌మంతా అప్ర‌మ‌త్త‌మైంది. హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది క్ష‌ణాల్లో స్పందించిన తీరుతో పాటు.. మంట‌ల‌ను ఆప‌డం, పై అంతుస్తుల్లో చిక్కుకున్న వారిని సుర‌క్షితంగా రోప్ ల్యాడార్ల సాయంతో కింద‌కు దించ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. సంఘ‌ట‌నా స్థ‌లాన్ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. అక్క‌డ అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాల‌ను క్షేత్ర స్థాయిలో చూశారు. హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ వ‌ర్ల పాప‌య్య‌ కూడా ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. హైడ్రా ఏడీఎప్‌వో మోహ‌న‌రావు.. ఘ‌ట‌నకు గ‌ల కార‌ణాల‌ను, స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను అధికారుల‌కు వివ‌రించారు.

పెను ప్ర‌మాదం త‌ప్పింది..

అగ్ని ప్ర‌మాదం జ‌రిగిన ఘ‌ట‌నా స్థ‌లిని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏ వీ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. మంట‌లు వ్యాపించ‌డానికి గ‌ల కార‌ణాల‌ను ఆరా తీశారు. క్ష‌ణాల్లో హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేయ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింద‌న్నారు. ఫైర్, పోలీసు విభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసి ఎవ‌రికీ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా కాపాడార‌న్నారు. వ‌రుస‌గా జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు అంద‌రికీ క‌నువిప్పు కావాల‌న్నారు. ఫైర్‌, జీహెచ్ఎంసీ, విద్యుత్‌, పోలీసు విభాగాల‌తో నెల క్రితం హైడ్రా త‌నిఖీలు చేసి కొన్ని షాపుల‌ను సీజ్ చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఫైర్ సేఫ్టీ చ‌ర్య‌లు తీసుకోడానికి గ‌డువు కావాలంటే నెల రోజులు స‌మ‌యం ఇచ్చామ‌న్నారు. వ‌రుస ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ఫైర్ చ‌ట్టాల‌లో చేర్పులు, మార్పులను చేయాల్సి ఉంది. ఈ మేర‌కు సంబంధిత శాఖ‌ల‌తో క‌లిసి ప్ర‌భుత్వానికి నివేదిస్తాం.. నెల త‌ర్వాత మ‌ళ్లీ సంబంధిత శాఖ‌ల‌న్నిటితో క‌లిసి త‌నిఖీలు చేసి చ‌ర్య‌లు తీసుకుంటాం. ఇదే స‌మ‌యంలో ప్ర‌జ‌లు కూడా ఎవ‌రికి వారు ఫైర్ సేఫ్టీ నిబంధ‌న‌లు పాటించేలా అప్ర‌మ‌త్తమ‌వ్వాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ కోరారు. ఒక వేళ అగ్ని ప్ర‌మాదం జ‌రిగితే సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్ర‌త్త ప‌డాల‌ని కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story