సిరిసిల్ల మెడికల్ కాలేజీ హాస్టల్ అగ్ని ప్రమాదంపై అసోసియేషన్ ఆగ్రహం

by Naga Rani Yarlagadda |

రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాల తాత్కాలిక గర్ల్స్ హాస్టల్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (టీ-జూడా) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

సిరిసిల్ల మెడికల్ కాలేజీ హాస్టల్ అగ్ని ప్రమాదంపై అసోసియేషన్ ఆగ్రహం
X
  • అద్దె భవనంలో వసతులు దారుణమన్న జూడాలు
  • ఒక్కో గదిలో 15 మంది విద్యార్థినులను ఉంచారని ఆవేదన

దిశ, తెలంగాణ బ్యూరో : రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాల తాత్కాలిక గర్ల్స్ హాస్టల్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (టీ-జూడా) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో, విద్యార్థినుల ప్రాణాలను పణంగా పెడుతున్న అధికార యంత్రాంగం వైఖరిని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ గంగనొల్ల విక్రమ్, డాక్టర్ నరహరి చంద్రకాంత్ రెడ్డిలు తప్పుబట్టారు. అద్దె భవనంలో నిర్వహిస్తున్న ఈ హాస్టల్‌లో వసతులు అత్యంత దారుణంగా ఉన్నాయని, ఒక్కో గదిలో 10 నుండి 15 మంది విద్యార్థినులను ఉంచుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి మొదటి సంవత్సరం విద్యార్థులకు కనీసం గదులు కూడా లేక, మెస్ హాల్‌లోనే పార్టిషన్లు వేసి వసతి కల్పించడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు.

నిజం దాచే ప్రయత్నం.. విద్యార్థులపై బెదిరింపులు..

ప్రమాదానికి అసలు కారణం ఎలక్ట్రిక్ సాకెట్ల వద్ద జరిగిన షార్ట్ సర్క్యూట్ అని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, కాలేజీ యాజమాన్యం దీనిని విద్యార్థులపైకి నెట్టే ప్రయత్నం చేస్తోందని జూడాలు ఆరోపించారు. వెలిగించిన దీపం వల్లే ప్రమాదం జరిగిందని విద్యార్థుల ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతపు స్టేట్‌మెంట్లు తీసుకుంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఆ దీపం బాగానే ఉందని, దేనికీ అంటుకోలేని దూరంలోనే ఉందని విద్యార్థులు చెబుతున్నారు. యాజమాన్యం చెప్పినట్లుగా తమ తప్పేనని ఒప్పుకోకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని విద్యార్థులను బెదిరించడం అమానుషమని టీ-జూడా పేర్కొంది. రాబోయే కొత్త బ్యాచ్ విద్యార్థులకు కనీసం తలదాచుకోవడానికి కూడా చోటు లేని పరిస్థితి నెలకొందని, శాశ్వత భవనం పూర్తయ్యే వరకు మెరుగైన వసతులున్న మరో భవనాన్ని అద్దెకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ హాని కలగలేదని, దీనిని ఒక హెచ్చరికగా భావించి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త మెడికల్ కాలేజీల హాస్టళ్లలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని, విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అసోసియేషన్ స్పష్టం చేసింది.

ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు

-డీఎంఈ నరేంద్ర కుమార్

సిరిసిల్ల మెడికల్‌ కాలేజీ‌ గర్ల్స్ హాస్టల్‌లోని ఓ గదిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని డీఎంఈ నరేంద్ర కుమార్ తెలిపారు. ప్రమాదం జరిగిన గదిలో ఇద్దరు విద్యార్థిణులు ఉంటున్నారని.. ఇద్దరిలో ఒకరు ఉదయం పూజ చేసుకుని దీపం అలాగే పెట్టేసి... అలాగే చార్జర్ ప్లగ్‌కి కనెక్ట్ చేసి వెళ్లిందని ఫలితంగా అగ్ని ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. గదిలో‌ నుంచి పొగకు రావడంతో అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది, మంటలను ఆర్పేశారని.. ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో వారు కూడా వచ్చి పరిశీలించారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆ గదిలో ఉంటున్న ఇద్దరు విద్యార్థిణుల దుస్తులు, వస్తువులు దెబ్బతిన్నాయని డీఎంఈ వెల్లడించారు.

Next Story