- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KBR Park: కేబీఆర్ పార్క్ వద్ద అగ్నిప్రమాదం.. సుప్రీంకోర్టు స్టే వేళ కలకలం
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని కేబీఆర్ (KBR) పార్క్ వాక్ వే వద్ద శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని కేబీఆర్ (KBR) పార్క్ వాక్ వే వద్ద శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ (GHMC) పారిశుధ్య కార్మికులు ఊడ్చి ఒకచోట చేర్చిన ఎండుటాకుల కుప్పకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నట్లు సమాచారం. రాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో అటుగా వెళ్తున్న ప్రజలు, వాకర్స్ తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. అయితే, అక్కడే ఉన్న ఓ తోటమాలి (గార్డెనర్) వెంటనే అప్రమత్తమై సకాలంలో స్పందించినట్లు తెలిసింది. మంటలు పార్క్ లోపలికి మరింత వ్యాపించకముందే వాటిని పూర్తిగా అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే..
ఇదిలా ఉండగా, కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై ఇటీవల సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం విదితమే. తెలంగాణ ప్రభుత్వం ఎకో సెన్సిటివ్ జోన్ (ESZ) విస్తీర్ణాన్ని తగ్గిస్తోందని, హైకోర్టుకు సెలవులు ఉన్న సమయాన్ని అదునుగా తీసుకుని అక్రమంగా చెట్లను నరికివేస్తోందని సీనియర్ న్యాయవాది కె. వివేక్ రెడ్డి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. తదుపరి విచారణ జరిగే వరకు పార్క్ చుట్టూ 25 నుంచి 30 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఎలాంటి చెట్లను నరకరాదని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ స్టే విధించింది. ఈ కేసు తదుపరి విచారణను ధర్మాసనం జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ ‘గ్రేడ్ సెపరేటర్ కారిడార్ ప్రాజెక్టు’ నిర్మాణం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేబీఆర్ పార్కులో అగ్ని ప్రమాద ఘటన కలకలం సృష్టిస్తోంది.






