ఇటుకలతో ఆర్థిక భరోసా.. స్వయం శక్తితో రాణిస్తున్న మహిళలు

by Malleboina Mahesh |

తెలంగాణలో మహిళా సంఘాల ఇటుక యూనిట్ల బలోపేతం! 35% సబ్సిడీతో రుణాలు, ఇందిరమ్మ ఇండ్లకు ఇటుకల కొనుగోలు. మహిళల ఆర్థిక ప్రగతికి సర్కార్ మద్దతు.

ఇటుకలతో ఆర్థిక భరోసా.. స్వయం శక్తితో రాణిస్తున్న మహిళలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు నిర్వహిస్తున్న ఇటుక తయారీ యూనిట్లను బలోపేతం చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టింది. జీవనోపాధి అవకాశాలను పెంచడంతోపాటు ప్రభుత్వ గృహ నిర్మాణ కార్యక్రమాలకు అవసరమైన నిర్మాణ సామాగ్రిని స్థానికంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలు అవుతుంది. కొత్త యూనిట్ల స్థాపనకు ముందు, ప్రస్తుతం మహిళా సంఘాలు నిర్వహిస్తున్న యూనిట్ల స్థితిగతులను తెలుసుకునేందుకు సెర్ప్ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించి మొత్తం 736 యూనిట్లు నడుస్తున్నట్టు గుర్తించారు. వీటిల్లో రోజుకు 2500 ఇటుకలు తయారు చేసే సామర్థ్యం ఉన్నా.. పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవడంతో రోజుకు 300 నుంచి 1000 ఇటుకల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. దీంతో ఒక్కో యూనిట్‌కు సుమారు రూ.18 లక్షల పెట్టుబడి అవసరమని అధికారులు అంచనా వేశారు.

35 శాతం సబ్సిడీ

ఈ నేపథ్యంలోనే పీఎంఈజీపీ పథకం ద్వారా మహిళా సంఘాలకు రుణాలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ పథకం కింద 35 శాతం సబ్సిడీ లభిస్తుంది. జిల్లా పరిశ్రమల అధికారులతో చర్చలు పూర్తి చేసి, డీపీఆర్‌లు సిద్ధం చేసి పంపించారు. త్వరలోనే రుణాల మంజూరు ప్రక్రియ పూర్తి అవుతుంద‌ని సెర్ప్ అధికారులు చెబుతున్నారు. అదే స‌మ‌యంలో అవ‌స‌ర‌మైన వారికి బ్యాంకుల ద్వారా, స్త్రీ నిధి ద్వారా రుణాలు మంజూరు చేస్తూ ఇటుక తయారీ యూనిట్లను అప్ గ్రేడ్ చేస్తున్నారు. నిర్వహాకుల నైపుణ్యాన్ని మెరుగు ప‌రిచే విధంగా 15 రోజుల పాటు శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రభుత్వ ప్రొత్సాహంతో ఇప్పటికే ప‌దుల సంఖ్యలో ఇటుక త‌యారీ యునిట్లు పూర్తి స్థాయిలో ప‌నిచేస్తున్నాయి.

మ‌హిళా సంఘాలు నిర్వహిస్తున్న ఇటుక‌ల తయారీకి త‌గిన డిమాండ్‌ను క‌ల్పించే విధంగా ప్రభుత్వం చ‌ర్యలు చేప‌ట్టింది. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లకు అవసరమైన ఇటుకలను మహిళా సంఘాల యూనిట్ల నుంచే కొనుగోలు చేసేలా హౌసింగ్ శాఖతో సమన్వయం చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో మ‌హిళా సంఘాల‌చే నిర్వహిస్తున్న ఇటుక‌ల త‌యారి ప‌రిశ్రమ‌కు ఏలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్రభుత్వ మద్దతు..

‘మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడడానికి స్థిరమైన ఆదాయ వనరులు అవసరం. ఇటుక యూనిట్లు మహిళలకు ఉపాధి కల్పించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తుంది’ - మంత్రి సీతక్క

ఆదర్శంగా నిలిచేలా..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనిట్లను బలోపేతం చేయడానికి శిక్షణ, రుణాలు, సబ్సిడీలు, మార్కెట్ లింకేజీ వంటి అన్ని అంశాల్లో సహకారం అందిస్తున్నాం. మహిళా సంఘాలు నిర్వహిస్తున్న యూనిట్లు ఆదర్శంగా నిలిచేలా చర్యలు తీసుకుంటున్నాం. - సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్

నా జీవితం మారింది

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన కుంట మల్లవాణి మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచారు. 2011లో చైతన్య మహిళా సంఘంలో సభ్యురాలిగా చేరిన ఆమె, 15 ఏళ్లుగా సంఘ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. సిద్దిపేటలో 15 రోజుల శిక్షణ పొందిన తర్వాత, పీఎంఈజీపీ పథకం ద్వారా రూ.10 లక్షల ప్రాజెక్ట్‌తో పోతారం-ఎస్ గ్రామంలో ఇటుక తయారీ యూనిట్‌ను స్థాపించారు. రూ.9.5 లక్షలు బ్యాంకు రుణంగా, రూ.50 వేలు సొంత నిధులు వినియోగించగా ప్రభుత్వం నుంచి 35 శాతం సబ్సిడీ లభించింది. నెలకు రూ.3.02 లక్షలు వస్తుండగా ఖర్చులు పోను రూ.57 వేల నికర లాభం పొందుతున్నారు. ఈ యూనిట్ ద్వారా 6 మంది కార్మికులకు ఉపాధి లభించింది. ‘మహిళా సంఘంలో చేరడం నా జీవితాన్ని మార్చింది. సరైన శిక్షణ, ఆర్థిక సహాయం ఉంటే మహిళలు కూడా పెద్ద స్థాయిలో వ్యాపారాలు నిర్వహించగలరు’ అని మల్లవాణి తెలిపారు..

Next Story