- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగరేణికి చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం: రూ.21 వేల కోట్ల బకాయిలు వసూలయ్యేనా?
సింగరేణి సంస్థకు వివిధ రాష్ట్రాల జెన్కోల నుంచి రావాల్సిన బకాయిలు రూ. 21,303 కోట్లకు చేరాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: వేల కుటుంబాలకు జీవనాధారం.. రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం కురిపించే సింగరేణి.. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నదా? అనే ఆందోళన కార్మికుల నుంచి వ్యక్తమవుతున్నది. ఇందుకు కారణం జెన్కోల నుంచి రూ. వేల కోట్ల బకాయిలు వసూలు చేయలేకపోవడమే అని తెలుస్తున్నది. లక్షలాది టన్నుల బొగ్గును తీసుకెళ్తున్న ప్రభుత్వ విద్యుత్ సంస్థలు సకాలంలో బిల్లులు చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం వివిధ రాష్ట్రాల జెన్కోలు సింగరేణికి రూ. 21 వేల కోట్లకు పైగా బకాయి పడ్డాయి. ఇందులో అధికంగా తెలంగాణ జెన్ కో దే కావడం గమనార్హం. కొండలా పేరుకుపోతున్న ఈ బకాయిలతో నల్లబంగారు గని మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పేరుకుపోతున్న బకాయిలు, ప్రభుత్వాల తీరుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ జెన్కో నుంచి రావాల్సిందే అధికం..
సింగరేణికి పెద్ద కస్టమర్ అయిన తెలంగాణ జెన్ కో బిల్లుల చెల్లింపుల్లో చేతులెత్తేస్తున్నది. 2014-15లో రూ. 1,958 కోట్లుగా ఉన్న బాకీ.. 2024-25 వచ్చే నాటికి రూ. 14,532 కోట్లకు చేరింది. 2025 డిసెంబర్ వరకు ఇది రూ. 18,827.27 కోట్లకు పెరిగింది. పదేళ్ల కాలంలో బకాయిలు దాదాపు 9 రెట్లు పెరగడం గమనార్హం. 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో చెల్లింపులు జరిగినట్లు తెలుస్తున్నా... ఆ తర్వాత నుంచి బకాయిలు పేరుకుపోతూ వచ్చాయి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో సుమారు 11 నుంచి 14 మెట్రిక్ టన్నుల బొగ్గును టీజీజెన్కో కొనుగోలు చేసింది. అయితే బిల్లులు చెల్లించడంలో మాత్రం వెనకబడిపోయింది. 2022-23లో బీఆర్ఎస్ సర్కారు హయాంలో రూ.7,758.65 కోట్ల బకాయిలను చెల్లించింది. దీంతో ఆ ఏడాది బకాయిలు తగ్గి రూ. 3,126.24కు చేరుకున్నాయి. అయితే ఆ తర్వాత 2023-24లో 15.58 మెట్రిక్ టన్నుల బొగ్గును కొనుగోలు చేశారు. ఇందుకు రూ. 7,266.45 చెల్లించాల్సి ఉండగా.. కేవలం రూ.2,336.69 కోట్లు మాత్రమే చెల్లించడంతో బకాయిలు మరింత పెరిగిపోయాయి. ఈ బకాయిలను సింగరేణి వసూలు చేసుకోలేకపోతున్నది.
ఇతర రాష్ట్రాల జెన్కోల నుంచి సైతం..
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు జెన్కోలు కూడా సింగరేణికి భారీగా బకాయి పడ్డాయి. ఏపీ జెన్‌కో సింగరేణికి రూ. 1,532.26 కోట్లు చెల్లించాల్సిఉన్నది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు జెన్‌కోలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. మరోవైపు ఎన్టీపీసీ సైతం గతంలో బకాయి పడ్డప్పటికీ.. 2024-25 నాటికి తన ఖాతాను చక్కదిద్దుకుంది. తాజా నివేదికల ప్రకారం ఎన్టీపీసీకి ఇంకా రూ. 312.91 కోట్ల క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే బిల్లుల కంటే ముందే చెల్లింపులు చేసినట్లు కనిపిస్తున్నది.
మనుగడకు ముప్పు
బకాయిలు రాకపోవడంతో సింగరేణిలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నట్టు చర్చ జరుగుతున్నది. కార్మికులకు జీతభత్యాలు, వెల్ఫేర్ ఫండ్స్, గనుల నిర్వహణ, కొత్త ప్రాజెక్టుల విస్తరణకు నిధుల కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తున్నది. బొగ్గు ఉత్పత్తి ఖర్చు పెరిగిపోయి.. వచ్చే ఆదాయం తగ్గిపోతుండడం, రావాల్సిన బకాయిలు పెరిగిపోతుండడంతో సంస్థ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తున్నది. సరిపడా ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. మరోవైపు ప్రభుత్వాలు సంస్థ నిధులను ఇతర అవసరాలకు వాడుకుంటుండడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం సింగరేణి నిధుల నుండి సుమారు రూ. 10 కోట్లు ఖర్చు చేసినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కార్మికుల సంక్షేమం, సింగరేణి అభివృద్ధికి వాడాల్సిన వేలాది కోట్ల నిధులు వేరే పనులకు మళ్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వాలు స్పందించి జెన్కోల నుంచి రావాల్సిన బకాయిలను క్లియర్ చేయకపోతే, నల్లబంగారు గని భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టీజీ జెన్కోకు సింగరేణి బొగ్గు అమ్మకాలు, రావాల్సిన బకాయిల వివరాలు
సింగరేణికి రావాల్సిన బకాయిలు (2025 డిసెంబర్ నాటికి)






