GHMC హెడ్ ఆఫీసులో పూర్తిస్థాయి ప్రక్షాళన.. తుది దశకు సర్దుబాట్లు

by Gantepaka Srikanth |

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయంలో అధికారుల బదిలీలు, సర్దుబాట్లకు కమిషనర్ కర్ణన్ కసరత్తు చేస్తున్నారు.

GHMC హెడ్ ఆఫీసులో పూర్తిస్థాయి ప్రక్షాళన.. తుది దశకు సర్దుబాట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయంలో అధికారుల బదిలీలు, సర్దుబాట్లకు కమిషనర్ కర్ణన్ కసరత్తు చేస్తున్నారు. ప్రసాదరావు కమిటీ సిపార్సుల ప్రకారం జీహెచ్ఎంసీలో ఆరుగురు అడిషనల్ కమిషనర్లు మాత్రమే ఉండాలి. వీరిలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు, నలుగురు పురపాలకశాఖకు సంబంధించిన అడిషనల్ డైరెక్టర్లు ఉండాలని ఆ కమిటీ సూచించింది. దాని ప్రకారమే ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులకు విభాగాల కేటాయింపు, పనితీరు, పర్యవేక్షణ, బదిలీలకు ప్రత్యేక విధానంలేదని సమాచారం. ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే వ్యక్తులతో సంబంధంలేకుండా పనిచేసుకుంటూ పోతుందని, దీని కోసం తీవ్రమైన కసరత్తు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరు నాటికి జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో పూర్తి స్థాయి ప్రక్షాళన పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఆరుగురు వీరే..

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం 12 మంది అడిషనల్ కమిషనర్లు ఉన్నారు. వీరిని ఆరుగురికి తగ్గించనున్నారు. ఈ ఆరుగురిలో ఇప్పటికే అడిషనల్ కమిషనర్(ఐటీ, రెవెన్యూ)గా అనురాగ్ జయంతి ఉన్నారు. మరో ముగ్గురు జోనల్ కమిషనర్లుగా, ఐఏఎస్ అధికారుల్లో ఒకరిని అడిషనల్ కమిషనర్‌గా నియమించే అవకాశముంది. మిగిలిన నలుగురిలో పురపాలక శాఖ అడిషనల్ డైరెక్టర్ హోదాలో ఉన్న రఘుప్రసాద్ ప్రస్తుతం అడిషనల్ కమిషనర్(శానిటేషన్, ట్రాన్స్‌పోర్ట్)గా వ్యవహరిస్తున్నారు. మరో అడిషనల్ డైరెక్టర్ ఎన్.రవికిరణ్ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన ఇద్దరు అడిషనల్ డైరెక్టర్లలో శ్రీనివాస్‌రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎంఆర్డీసీఎల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మరో వ్యక్తి జె.శంకరయ్య టీజీ ఆయిల్ ఫెడ్ ఎండీగా పనిచేస్తున్నారు. వీరిద్దరిని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లుగా నియమించేందుకు కసరత్తు నడుస్తోంది.

మంజూరైన పోస్టులు 9 వేలు

జీహెచ్ఎంసీలో అటెండర్ నుంచి అడిషనల్ కమిషనర్ వరకు మంజూరైన పోస్టులు 9 వేలు.. కానీ ప్రస్తుతం 4,500 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలో 30 మంది సెలెక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లు ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు కమిషనర్ కర్ణన్ ఇప్పటికే సేకరించారు. ఏ కేటగిరికి ఏ పోస్టింగ్ ఇవ్వాలి? సీనియారిటీ ప్రకారం ఎక్కడ నియమించాలి? అనే విషయాలపై నివేదిక రూపొందించారు. ప్రస్తుతం ఉన్న అడిషనల్ కమిషనర్లలో సీనియారిటీ ఆధారంగా ఆ విభాగాలకు హెచ్‌వోడీలుగాను, జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లుగాను పోస్టింగ్ ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

హెచ్ఎండీఏ, ఎఫ్‌సీడీఏలోనూ..

హెచ్ఎండీఏ సైతం పరిపాలన జోన్లు ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నది. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అక్కడ ఐదు జోన్లు ఏర్పాటు చేసే అవకాశముంది. జోన్‌కు ఒక సెలెక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారిని జోనల్ కమిషనర్‌గా నియమించేందుకు మెట్రో పాలిటన్, పట్టణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీలోని ఐదుగురు అడిషనల్ కమిషనర్లకు అవకాశం రానుందని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు భారత్ ఫ్యూచర్ సిటీలోనూ నాన్ కేడర్ అడిషనల్ కమిషనర్ పోస్టు ఉన్నది. ఇక్కడ కూడా ఒకరికి అవకాశం రానున్నదని సమాచారం.

Next Story