మహిళల హక్కులకు పోరాటమే ఆయుధం.. ఐద్వా జాతీయ మహాసభల్లో ప్రముఖుల కీలక ప్రసంగం

by Ramesh Naini |

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14 వ జాతీయ మహాసభలు ఆదివారం ఆర్టీసీ కళ్యాణ మండపంలోని మల్లు స్వరాజ్యం ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి.

మహిళల హక్కులకు పోరాటమే ఆయుధం.. ఐద్వా జాతీయ మహాసభల్లో ప్రముఖుల కీలక ప్రసంగం
X

దిశ, తెలంగాణ బ్యూరో / రాంనగర్ : మహిళలు పోరాటాల ద్వారానే సమానత్వాన్ని సాధించగలుగుతారని ప్రముఖ రచయిత, సినీనటి ఎం రోహిణి అన్నారు. దానికంటే ముందు మన ఇండ్ల నుంచే అభ్యుదయంతో కూడిన సమానత్వం ప్రారంభం కావాలని, ఆ మేరకు మార్పును ఆహ్వానించాలని సూచించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14 వ జాతీయ మహాసభలు ఆదివారం ఆర్టీసీ కళ్యాణ మండపంలోని మల్లు స్వరాజ్యం ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. కామ్రేడ్ సరోజినీ బాలానందన్ నగర్, కామ్రేడ్ చంద్రకళ పాండే హాల్లో జరిగిన ప్రారంభ సభలో రోహిణి ప్రారంభోపన్యాసం చేశారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14 వ జాతీయ మహాసభలు జనవరి 25 నుంచి 28, 2026 వరకు హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ కళ్యాణ మండపంలో, కామ్రేడ్ సరోజినీ బాలానందన్ నగర్, కామ్రేడ్ చంద్రకళ పాండే హాల్‌లో జరుగుతోంది. 26 రాష్ట్రాల నుండి సుమారు 850 మంది ప్రతినిధులు మరియు పరిశీలకులు ఈ మహాసభలో పాల్గొంటున్నారు. మహాసభ మొదటి రోజున ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పి.కె. శ్రీమతి జెండా ఆవిష్కరణతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మహాసభలకు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (ఎన్ఎఫ్ఐడబ్ల్యు), ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘటన్ (ఏఐఎంఎస్ఎస్) మరియు ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ (ఐఏపీఎస్ఓ) నాయకులు సదస్సుకు శుభాకాంక్షలు తెలిపారు.

కుటుంబాలను చైతన్యవంతం చేయాలి..

ఈ సందర్భంగా రోహిణి మాట్లాడుతూ, యువతరం సామ్రాజ్యవాద ప్రమాదాన్ని గమనించాలని, ఆ దిశగా కుటుంబాలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యతను మహిళలే తమ భుజస్కందాలపై వేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. దేశంలో మహిళా హక్కులు కేవలం కాగితాలకే పరిమిత మయ్యాయనీ, వారిపై ఆంక్షలు, వివక్ష ఇంటి నుంచే మొదలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు నిత్యం తమ కుటుంబంతో పాటు సమాజం కోసం పోరాటాలు చేయాల్సి వస్తుందన్నారు. ఎదురవుతున్న సవాళ్లు, వివక్షను అధిగమిస్తూ ఉన్నతమైన కుటుంబాన్ని సమాజానికి పరిచయం చేసేది మహిళేనని స్పష్టం చేశారు. 'ఐద్వా' ఇండ్లలో మౌన సాక్షులుగా గొంతు లేని వారి పక్షాన దేశం కోసం, మహిళా హక్కుల కోసం పోరాడుతుందని తెలిపారు. మహిళల హక్కుల్ని ఎవరో నిర్దేశించడం సరికాదనీ, మహిళలే వాటిని నిర్ధారించుకోవాలని సూచించారు. స్వాతంత్ర పోరాటంలో మహిళల పాత్ర చాలా గొప్పదని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ మహిళలు అగ్రభాగాన నిలిచారని వివరించారు. మహిళలు ఇంట్లో వండి పెడితేనే భవిష్యత్ తరం మనుగడ సాగిస్తున్నదనే వాస్తవాన్ని గమనించాలని చెప్పారు. యువతరం సామ్రాజ్యవాద ప్రమాదాన్ని గమనించాలని, సమానత్వం కోసం పోరాటం కొనసాగుతూనే ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఇండ్లలో మన పిల్లలకు మనమే హీరోలుగా గుర్తిండిపోవాలని కాంక్షించారు. మహిళల స్వాతంత్య్రం, సమానత్వంపై జరుగుతున్న అబద్ధ ప్రచారాలను అర్థం చేసుకోవాలని, అందరికీ సమన్యాయం లభించాలని చెప్పారు. ప్రస్తుతం దేశంలో రాజ్యాంగ పీఠిక సవాళ్లను ఎదుర్కొంటున్నదని, దానిలోని సమానత్వానికి విఘాతం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు లేవని, ఇప్పటికీ ఆర్ధికంగా కుటుంబాలపైనే ఆధారపడుతూ, మహిళలు తమ అవసరాలను అణచివేసుకుంటున్నారని వివరించారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని, ఇండ్ల నుంచే ఆ మార్పు కోసం చైతన్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. సమాజంలో మార్పు కోసం మహిళలు తాము చేస్తున్న పనుల్నే ఆయుధాలుగా మార్చుకోవాలని సూచించారు. కళలతో పాటు చదవడం, రాయడం, చేస్తున్న వృత్తులు, ఆలోచనల్ని ఆయుధాలుగా మలుచుకుంటే, పాలకులు తలవంచక తప్పదని, తద్వారా సమాన అవకాశాలు సాధించుకోవడం సులభమవుతుందని తెలిపారు. చేతులెత్తి ఆకాశం వైపు చూస్తూ ఈ పూటకు తిండి పెట్టమని ప్రార్థించడం వల్ల సమాజంలో మార్పు రాదని స్పష్టం చేశారు. పోరాడితేనే సామాజిక మార్పు సాధ్యమవుతుందని, దీనికి భాష, ప్రాంతం, జాతి, మతంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. మనిషి మానవత్వం అనేవే అజెండాగా ఉండాలని, దాని కోసం ప్రతి ఒక్కరూ మరొకరి కోసం ఆలోచించాలని చెప్పారు. అభ్యుదయ మనస్తత్వాలే మార్చును సాధించగలుగుతాయనీ, కట్నం తీసుకోం- ఇవ్వబోం అనే నినాదం మన ఇండ్ల నుంచే ప్రారంభం కావాలన్నారు. దానికోసం మహిళలే నడుం బిగించాలని, భవిష్యత్ తరాలు ఈ స్పూర్తిని అందిపుచ్చుకోవాలని దిశానిర్దేశం చేశారు.

ప్రతి ప్రతిఘటనలోనూ 'ఐద్వా' జెండా

భారతదేశంలో అన్యాయాన్ని ప్రతిఘటించిన ప్రతి ప్రాంతంలోనూ బలహీనులకు అండగా ఐద్వా జెండా నిలిచిందని మాజీ ఎంపీ, ఐద్వా జాతీయ ప్యాట్రన్ బృందాకరత్ స్పష్టంచేశారు. ఇండ్లలో, బహిరంగ ప్రదేశాల్లో, పని ప్రదేశాల్లో ఎక్కడైనా ప్రజలకు తోడుగా నిలిచి, భరోసా కల్పించి, విశ్వాసాన్ని పెంచడంలో ఐద్వా చేసిన కృషి ఎనలేనిదని చెప్పారు. మహిళా రెజ్లర్ల పోరాటం, ఆర్జీకార్ చారిత్రాత్మక పోరాటం, హత్రాస్ కేసు, కుల్దీప్ సెంగర్ బాధితురాలు, అంకితా భండారి కేసు సహా మహిళలు హింసను ఎదుర్కొన్న ప్రతి చోట వారికి తోడుగానే ఉన్నామని తెలిపారు. బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వానికీ, త్రిపురలో బీజేపీ ప్రభుత్వానికి, రాజకీయ అణచివేతలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం జరిగిన పోరాటంలో ఐద్వా ముందు వరుసలో ఉందని గుర్తుచేశారు. దోపిడీదారులైన మైక్రో ఫైనాన్స్ కంపెనీలు మహిళలను అప్పుల ఊబిలోకి నెడితే, బాధితుల పక్షాన నిలిచామన్నారు. నరేగా చట్టాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జీ రాంజీ పేరుతో నిర్వీర్యం చేస్తున్నదని, దానికి వ్యతిరేకంగా మరింత బలోపేతమైన ఉద్యమాలు రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లో ఇండ్ల స్థలాల కోసం మహిళల ఆధ్వర్యంలోనే భూ పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. మహారాష్ట్రలోని పాల్హర్, ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ మహిళల భారీ సమీకరణలు, లక్నో, ఢిల్లీల్లోని పట్టణ మురికివాడల్లో మహిళలు బుల్డోజర్ను ఎదుర్కొన్న చోట, బిల్కిస్ బానోకు మద్దతుగా, ఛత్తీస్ గఢ్ సన్యాసినులకు మద్దతుగా నిలిచామన్నారు. ఆదివారం జరిగిన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభ ప్రారంభ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కేరళలో ప్రత్యామ్నాయ విధానాలను రక్షించడానికి, రాష్ట్రంలోని కొత్త వర్గాల మహిళలను చేరుకోవడానికి కొనసాగుతున్న పోరాటంలో ఐద్వా కృషి కొనసాగుతూనే ఉందన్నారు.

బాలికల ఉచిత విద్యపై పోరాడండి : ప్రొఫెసర్ శాంతాసిన్హా

ప్రముఖ విద్యావేత్త, స్వాగత కమిటీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ శాంతాసిన్హా మహాసభ ప్రతినిధులకు స్వాగతం పలికారు. ఆమె నేటి ప్రపంచంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను, ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలలో మహిళల పాత్ర, పని, ఆరోగ్యం, విద్య హక్కుల కోసం జరుగుతున్న పోరాటంపై దృష్టి సారిస్తూ వివరించారు. బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య కోసం ఐద్వా పోరాటం చేయాలని సూచించారు.

సత్కారం…

ప్రతిఘటనకు ప్రతీకలుగా నిలిచిన నలుగురు మహిళలను ఐద్వా మహాసభల్లో సత్కరించారు. తమిళనాడుకు చెందిన రాణి, బీహార్‌కు చెందిన బీబీ రుక్సార్, పుదుచ్చేరికి చెందిన యువ పర్వతారోహకురాలు దివ్య అరుణ్, రాజస్థాన్‌కు చెందిన రజియా బాను తమ వ్యక్తిగత అనుభవాలను, తాము ఎదుర్కొన్న సవాళ్లను, న్యాయం కోసం తాము చేసిన నిరంతర పోరాటాన్ని వివరించారు. వారి పోరాటాలలో ఐద్వా పాత్ర గురించి, అది వారిని విస్తృత మహిళా ఉద్యమంతో ఎలా అనుసంధానించిందో వారు మాట్లాడారు. తెలంగాణ నుండి తొలి మహిళా జాతీయ బాస్కెట్‌ బాల్ క్రీడాకారిణి అయిన మిహాను కూడా సత్కరించారు.

Next Story