- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎరువుల కొనుగోలు కేంద్రాలు నిత్యం తెరిచి ఉంచాలి : మంత్రి తుమ్మల
రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతులకు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను, సహకార సంఘాల అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతులకు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను, సహకార సంఘాల అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మార్కెఫెడ్ , జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను ఎరువుల లభ్యతపై సమీక్ష జరుపుకుంటూ రైతులకు కావలిసిన యూరియాను ఇకముందు కూడా ముందస్తుగా తెప్పించి అందుబాటులో ఉంచాలని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. గురువారం సచివాలయంలో వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్ రావు, రాష్ట్ర వ్యవసాయశాఖ సంచాలకులు గోపి , అడిషనల్ డైరెక్టర్, ఎరువుల విభాగాన్ని పర్యవేక్షించే అధికారులు, ఏజెన్సి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పంపిణీపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించారు.
ఈసందర్భంగా మంత్రి తుమ్మల వారికి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొంటూ, పంటకాలము కంటే ముందే మార్క్ ఫెడ్ దగ్గర ప్రారంభ నిల్వలు ఉంచుకొని, రోజు వారీ నివేదికల ఆధారంగా కట్టుదిట్టంగా అన్ని జిల్లాలకు రానున్న పదిరోజులకు సరిపడా యూరియాను ముందుగానే సరఫరా చేయాలన్నారు. పంపిణీలో నిరంతరం పర్యవేక్షించినప్పటికీ, కొంతమంది స్వప్రయోజనాల కోసం కొన్ని వేదికలను ఆధారంగా చేసుకొని రైతాంగాన్ని ఆందోళన పరిచే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అటువంటి వారికి చిన్న అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని, ఈ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే మొట్టమొదటి ప్రాధాన్యమని తెలిపారు. ఇకముందు ఇటువంటి కట్టు కథలను ప్రారంభంలోనే కొట్టివేసే విధంగా సమాచారం ప్రతి ఒక్కరి దగ్గర అందుబాటులో ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని అధికారుల నుంచి నివేదిక కోరారు.
అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు వివరిస్తూ యాసంగి సీజన్ ఇప్పటి వరకు 10.36 ఎల్ఎంటీల యూరియా రైతులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రైతులు 9.21 ఎల్ఎంటీల యూరియా ఎరువులను పంట అవసరాలకు రైతులు కొనుగోలు చేశారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు 1.08 ఎల్ఎంటీల యూరియా నిలువలు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ఎరువుల కొరత ఉందనే ప్రచారంపై ఆరా తీసి లోపాలను సరిదిద్దేందుకు రంగంలోకి దిగునున్నారు. రాష్ట్రానికి కావలసిన ఎరువులను ఎప్పటికప్పుడు రైతులకు సరఫరా చేసేటందుకు కేంద్ర ప్రభుత్వం తో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నట్టు తెలిపారు. వివిధ కంపెనీలకు చెందిన సుమారు 41వేల ఎంటీల యూరియా రాష్ట్రానికి రానుందన్నారు. ఇదే కాకుండా త్వరితగతిన మరో 30 వేల ఎంటీల యూరియా సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్ల చెప్పారు.






