ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి.. లేదంటే పోరాటమే: కవిత హెచ్చరిక

by Prasad Jukanti |   (  Updated:2026-05-06 09:16:37  IST  )

స్కూల్ ఫీజుల నియంత్రణపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫీజుల దోపిడీని అడ్డుకోకుంటే రాష్ట్రవ్యాప్త పోరాటం చేస్తామని హెచ్చరించారు

ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి.. లేదంటే పోరాటమే: కవిత హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: విద్యను వ్యాపారంగా మార్చి కోట్లు దండుకుంటున్నారని, ఫీజులు నియంత్రించకపోతే కార్పొరేట్ స్కూళ్ల దందాపై రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ఇవాళ పేరంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‍లో నాణ్యమైన విద్య - ఫీజుల నియంత్రణపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రి కావడం మన ఖర్మ అని, 50 శాతం నుంచి 120 శాతం స్కూల్ ఫీజులు పెంచినా పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి:

మే నెలలోనే ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని కవిత డిమాండ్ చేశారు. సమానత్వం, స్వేచ్ఛ, మాన విలువలు వర్థిలాలంటే విద్య ద్వారానే సాధ్యమని ప్రపంచం గుర్తించిందని పిల్లల చదువు బాధ్యత తల్లిదండ్రులది మాత్రమేనా? ప్రభుత్వ బాధ్యత కూడా అన్నారు. ఉచిత విద్య, వైద్యం ప్రభుత్వాల భాద్యతేనని నమ్మిన ప్రభుత్వాలు ఉండాలి. కానీ ప్రజలు ఏమైతే మాకేంటీ, ఫీజులు ఎంత పెంచిన నిమ్మకు నీరెత్తినట్లు ఉంటామంటే కుదరదన్నారు. ఫీజులు కట్టలేక పంజాబ్‍లో విద్యార్థులు పార్ట్ టైమ్ మద్యం అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు. రాజకీయ నాయకులకే విద్యాసంస్థలు ఉండటమనేది కరెక్టా అనేది మనం ఆలోచించాలన్నారు. ఫీజుల దోపిడీకి మనకు ఇప్పుడే పరిష్కారం కావలని, చాలా మంది తల్లితండ్రులు ఇప్పటికే ఫీజుల విషయంలో భయంతో ఉన్నారన్నారు. తమిళనాడు తరహాలో మన వద్ద కూడా ఫీజు నియంత్రణ కోసం పర్మినెంట్ అథారిటీ ఉండాలని లేదంటే గుజరాత్ లో మాదిరిగా ప్రాథమిక విద్యకు 15 వేలు, ఉన్నత విద్యకు 25 వేలకు మించి ఫీజు ఉండొద్దున్నారు.ఇందులో ఏ మోడల్ ను అయిన స్టడీ చేసి ప్రభుత్వం వాటిని అమలు చేయాలన్నారు.

ఒక్క రూపాయి పెంచొద్దు:

తెలంగాణ వచ్చాక ఫీజుల నియంత్రణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తిరుపతి రావు కమిషన్ వేసిందని ఆ కమిషన్ అధ్యయనం చేసి రిపోర్ట్ కూడా ఇచ్చిందన్నారు. కానీ ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో బీఆర్ఎస్ సర్కార్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. గురుకులాలు ఏర్పాటు చేశామని... ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని పట్టించుకోమంటే కుదరదన్నారు. రాష్ట్రంలో 64 లక్షల మంది విద్యార్థులు ఉంటే 65 నుంచి 75 శాతం వరకు ప్రైవేట్ స్కూళ్లలోనే చదువుతున్నారని పిల్లలు బాగా చదువుకోవాలన్న తల్లితండ్రుల బలహీనతను వ్యాపార ధోరణిగా మార్చేశారన్నారు. ఈ ప్రభుత్వం కచ్చితంగా కార్పొరేట్ స్కూళ్ల దోపిడీని నియంత్రించాలిని ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన జీవో ను తక్షణమే ఇవ్వాలన్నారు. ఇప్పుడు జీవో ఇస్తేనే లక్షలాది మంత్రి తల్లితండ్రులకు ఉపశమనం లభిస్తుందని గతేడాదితో పోలిస్తే ఒక్క రూపాయి కూడా ఫీజు పెంచకుండా తక్షణమే జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో భూములపై కుట్ర:

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనేది ప్రభుత్వ స్థలంలో ఉన్న స్కూల్ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 120 శాతం ఫీజు పెంచేశారని ప్రభుత్వానికి చెందిన స్కూల్లోనే 120 శాతం ఫీజు పెంచటమంటే ఏంటీ దౌర్భాగ్యం అని మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రి ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్ లకు వెళ్తూ ఏం సందేశం ఇస్తున్నట్లు? అని ప్రశ్నించారు. ప్రైవేట్ విద్యాసంస్థలను దోపిడీని ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తున్నట్లా? అని నిలదీశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 30 ఎకరాల భూమిని కొట్టేసే కుట్ర చేస్తున్నారని అక్కడి కమిటీలో ముఖ్యమంత్రి బంధువులు, ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఆరోపించారు. అదే స్కూల్లో 14 ఏళ్లుగా ఒక పోస్ట్ లో మహిళ ఉన్నారు. ఆమె బోర్డులోకి వచ్చిన వారికి అవినీతి ఎలా చేయాలో నేర్పిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ స్కూల్‍లో చదివి గొప్ప వాళ్లు అయిన వాళ్లు డొనేషన్లు ఇస్తున్నారని ఇటీవలే ఆ స్కూల్ పూర్వ విద్యార్థి సత్య నాదెళ్ల పెద్ద ఎత్తున విరాళం ఇచ్చారు. వాటన్నింటికీ అసలు ఎలాంటి లెక్క లేదని ఆరోపించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వ్యవహారంలో కచ్చితంగా ముఖ్యమంత్రి రివ్యూ చేయాలి. ఈ విషయంలో ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకోవాలన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 120 శాతం ఫీజు పెరిగితే...నారాయణ, చైతన్య లాంటి స్కూళ్లలో ఎంత పెంచుతారన్నారు. ఫీజుల దోపిడీకి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటి కావాలి.

ఫీజు రీయింబర్స్ మెంట్‍ను బొంద పెట్టే విధంగా

ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోందని దాదాపు 11 వేల కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయి. దీంతో కాలేజ్ లు మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్‍ను బొంద పెట్టే విధంగా ఎంఎస్ -7 అనే జీవోను తెచ్చారని పిల్లల తల్లిదండ్రుల అకౌంట్ కు డబ్బులు వేస్తామంటున్నారు. ఒకవేళ ఫీజులు చెల్లించకుంటే తల్లితండ్రులు పోరాటం చేసే పరిస్థితి ఉండదన్నారు. రైతు భరోసా విషయంలో కూడా ఇదే జరుగుతోందని రైతు భరోసా వేయకపోతే రైతులు బయటకు వచ్చి పోరాటం చేసే పరిస్థితి లేదన్నారు. ఈ జీవో కొట్టివేసే వరకు అన్ని పార్టీలు పోరాటం చేయాల్సి ఉందన్నారు. ఉచిత విద్య, వైద్యం విషయంలో నేను మాట తప్పను. నేను ఆడపిల్లను. అబ్దమాడను. ఇన్నాళ్లు అయ్యల పాలనలో మోసం జరిగింది. కానీ నేను అమ్మలా ఆలోచించే వ్యక్తిని. కచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానన్నారు ఫ్రీ వైద్యం, విద్య ఇవ్వకపోతే అమరుల స్థూపం స్తంభానికి కట్టేసి కొట్టాలన్నారు.

Next Story