- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జైలు భోజనం.. ఖైదీల డ్రెస్: ఒక్క రోజు ఖైదీగా ఉండాలనుందా?
చంచల్‌గూడ సెంట్రల్ జైలులో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సామాన్య పౌరులు సైతం కారాగార జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందేలా జైళ్ల శాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఫీల్ ది జైల్' కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: చంచల్‌గూడ సెంట్రల్ జైలులో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సామాన్య పౌరులు సైతం కారాగార జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందేలా జైళ్ల శాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఫీల్ ది జైల్' కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. దీనితో పాటే జైలు చరిత్రను కళ్లకు కట్టే సరికొత్త 'జైల్ మ్యూజియం'ను రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి మ్యూజియంలోని వస్తువులను, ఫీల్ ది జైల్ కోసం ఏర్పాటు చేసిన బ్యారక్‌లను వారు పరిశీలించారు. క్షణికావేశంలో నేరాలు చేస్తే జీవితం ఎలా తలకిందులవుతుందో, నాలుగు గోడల మధ్య స్వేచ్ఛను కోల్పోయి బతకడం ఎంత కష్టమో ప్రజలకు.. ముఖ్యంగా యువతకు కళ్లకు గట్టినట్లు చూపించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని జైళ్ల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ 'ఫీల్ ది జైల్' కాన్సెప్ట్ కింద.. ఎవరైనా సామాన్యులు నిర్ణీత ఫీజు చెల్లించి జైలులో ఒక రోజు పాటు ఖైదీలా గడపవచ్చు. అచ్చం ఖైదీలు ధరించే దుస్తులే వేసుకుని, వాళ్లు ఉండే బ్యారక్‌లోనే ఉంటూ, జైలు నిబంధనల ప్రకారం అధికారులు పెట్టే భోజనం చేస్తూ కారాగార జీవితాన్ని అనుభవించవచ్చు.
నిజాం కాలం నాటి జైలు..
ఇదే ప్రాంగణంలో ప్రారంభమైన 'జైల్ మ్యూజియం' సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నిజాం కాలం నాటి నుంచి ఉన్న చంచల్‌గూడ జైలు చరిత్ర, ఆ కాలంలో ఖైదీలకు వేసిన సంకెళ్లు, ఆయుధాలు, ఉరి తీసే తాడు, పాత రికార్డులు వంటి అనేక చారిత్రక విశేషాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. నేర రహిత సమాజ నిర్మాణంలో భాగంగా, ప్రజల్లో పరివర్తన తీసుకురావడానికే ఈ రెండు కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






