తెలంగాణలో ప్రాణం తీసిన SIR భయం..జైలుకు పంపిస్తారేమోనని వ్యక్తి ఆత్మహత్య!

by Prasad Jukanti |

కేంద్ర ఎన్నికల సంఘం SIR జాబితాలో పేరు లేదనే భయంతో హైదరాబాద్‍లో ఓ కార్ డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

తెలంగాణలో ప్రాణం తీసిన SIR భయం..జైలుకు పంపిస్తారేమోనని వ్యక్తి ఆత్మహత్య!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) జాబితాలో తన పేరు లేదని, దాంతో తనను జైలుకు పంపుతారనే భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బోరబండ ఏరియాలోని భరత్‍నగర్‍లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. షేక్ ముజీబుర్ రహ్మన్ (51) కార్ డ్రైవర్‍గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే తన పేరు పాస్ పోర్టుతో పాటు పలు డాక్యుమెంట్లలో తప్పుగా పడటంతో వాటిని సరి చేసుకోవడానికే ఇప్పటికే లక్షల్లో ఖర్చు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఎస్ఐఆర్ జాబితాలో తన పేరు లేదని తన వద్ద ఉన్న పత్రాలు ఎస్ఐఆర్‍కు సరిపోలవని మనస్తాపం చెందిన ముజీబుర్ భయపడిపోయాడు.

జైలుకు పంపుతారేనని:

ఎస్ఐఆర్‍లో పేరు లేకపోతే తనను జైలుకు పంపుతారని అప్పుడు తన ముగ్గురు పిల్లలను ఎవరు చూసుకుంటారని తన భార్య వద్ద పలు నిత్యం బాధపడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంలో భార్య ఎంత ధైర్యం చెప్పినా అతడిలోని భయం తొలిగిపోలేదని ఈ క్రమంలో చివరకు ఇంటి బయట ఉన్న షెడ్డు ఇరుమ రాడ్డుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు నిజంగానే ఎస్ఐఆర్‍లో ముజీబుర్ పేరు లేదా? ఆ కారణం వల్లే అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడా? అతడి మరణానికి దారి తీసిన పరిస్థితులేంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Next Story