పెంట్లవెల్లి కేజీబీవీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

by Jakkula.Mamatha |

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని(కేజీబీవీ) జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు.

పెంట్లవెల్లి కేజీబీవీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
X

దిశ, పెంట్లవెల్లి/కొల్లాపూర్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని(కేజీబీవీ) జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు విద్యార్థినిలు ఘన స్వాగతం పలికారు. విద్యార్థినులకు ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా, వసతి, పాఠ్యపుస్తకాలు, ఆహార సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పాఠశాల నిర్వహణ తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థినులతో నేరుగా మాట్లాడి బోధన, పాఠ్యాంశాల అవగాహన, ఉపాధ్యాయుల బోధన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్ గదులు, వంటశాల, భోజనశాల, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, పరిశుభ్రత, విద్యుత్, భద్రత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థినికి కార్పొరేట్ స్థాయి విద్యతో పాటు అన్ని మౌలిక వసతులు అందించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విద్యార్థినుల ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థినులకు ప్రతిరోజూ నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, మెనూ ప్రకారం భోజనం అందుతుందో లేదో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. కేజీబీవీ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య సౌకర్యాలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి విద్యార్థిని పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారి విద్యా పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన విద్యా సహాయాన్ని అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థినులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు స్పందించాలని, పాఠశాల నిర్వహణలో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులపై సంబంధిత అధికారులతో చర్చించిన కలెక్టర్, లోపాలను వెంటనే గుర్తించి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం పెండింగ్ లో ఉందని ప్రత్యేక అధికారి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.

Next Story