పలాసలో హృదయ విదారక ఘటన.. భర్తకు తలకొరివి పెట్టిన భార్య

by Malleboina Mahesh |

శ్రీకాకుళం జిల్లా పలాసలో హృదయ విదారక ఘటన.. అనారోగ్యంతో మృతి చెందిన భర్త ఉమామహేశ్వరరావుకు తలకొరివి పెట్టి కన్నీటి వీడ్కోలు పలికిన భార్య!

పలాసలో హృదయ విదారక ఘటన.. భర్తకు తలకొరివి పెట్టిన భార్య
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలాసలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఏడడుగుల బంధంతో జీవితాంతం సుఖదుఃఖాలను పంచుకున్న ఆ ఇల్లాలు, కడచూపుకు కూడా నోచుకోకుండా అనంత లోకాలకు వెళ్లిన తన భర్తకు కన్నీటి వీడ్కోలు పలికిన తీరు ప్రతి ఒక్కరి కదిలించింది. శ్రీకాకుళం జిల్లా పలాసలోని జగనన్న కాలనీకి చెందిన నెయ్యిల ఉమామహేశ్వరరావు (56) అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆ కుటుంబంలో తీరని చీకట్లు అలుముకున్నాయి. సాధారణంగా పురుషులే అంతిమ సంస్కారాలు నిర్వహించే పద్ధతి సమాజంలో ఉన్నప్పటికీ, జీవితాంతం తనకు నీడగా నిలిచిన భర్త చివరి ప్రయాణంలో తానే తోడై నిలవాలని ఆమె నిర్ణయించుకున్నారు.

అంత్యక్రియల వేళ గుండె నిండా భారంతో, కళ్లల్లో సుడులు తిరుగుతున్న కన్నీటితో భార్య సరస్వతి హిందూ సంప్రదాయం ప్రకారం భర్త పార్థివ దేహానికి స్వయంగా తలకొరివి పెట్టారు. చితిపై కాలిపోతున్న భర్తను చూస్తూ ఆమె రోదించిన వైనం, ఆఖరి కర్తవ్యాన్ని ఓ మాతృమూర్తిలా నిర్వర్తించిన ఆ దృశ్యం స్మశానవాటికలో ఉన్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. సామాజిక కట్టుబాట్లను పక్కనబెట్టి, భర్తపై ఉన్న అనంతమైన ప్రేమతో ఆమె చేసిన ఈ సాహసోపేతమైన ముగింపు స్థానికంగా అందరినీ కదిలించివేసింది.

Next Story