- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి మరో ఇద్దరు బలి.. మాన్సూన్ ముందస్తు చర్యలేవి?
మహానగరంలో కురుస్తున్న గాలివానలు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టడంలో ఘోరంగా విఫలం కావడంతో వరుస ప్రమాదాలు అమాయకులను బలితీసుకుంటున్నాయి.

- నాలుగు రోజుల వ్యవధిలోనే నలుగురు మృతి
- పనిచేయని 1912 కాల్ సెంటర్.. పలకని అధికారుల ఫోన్లు
- మృతులపైనే నెపం నెడుతున్న టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ
దిశ, తెలంగాణ బ్యూరో: మహా నగరంలో కురుస్తున్న గాలివానలు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టడంలో ఘోరంగా విఫలం కావడంతో వరుస ప్రమాదాలు అమాయకులను బలితీసుకుంటున్నాయి. తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని లాల్ బజార్‌లో శనివారం తెల్లవారుజామున విద్యుతాఘాతంతో తండ్రీకూతురు మృతి చెందిన ఘటన నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నెల 9వ తేదీన చాంద్రాయణ్ గుట్టలో ఇదే తీరుగా ఇద్దరు యువకులు విద్యుత్ షాక్‌తో మరణించగా.. ఆ ఘటన జరిగిన నాలుగు రోజులకే మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం విద్యుత్ శాఖ అలసత్వానికి అద్దం పడుతోంది. ఇంతటి ఘోర ప్రమాదాలు జరుగుతున్నా కనీసం ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విద్యుత్ శాఖ తీరుపై తీవ్ర ఆగ్రహం..
వాస్తవానికి వర్షాకాలానికి ముందే విద్యుత్ స్తంభాలు, వైర్లను సరిచేయడంతో పాటు స్తంభాల పక్కన ఉన్న చెట్ల కొమ్మలను నరికివేయాలి. ప్రమాదవశాత్తూ వైర్లు తెగి నేలపై పడినప్పుడు ఎర్తింగ్ వల్ల సర్క్యూట్ బ్రేకై పవర్ ఆటోమేటిక్‌గా ట్రిప్ అయ్యేలా ఆధునిక సాంకేతిక రక్షణ చర్యలు తీసుకోవాలి. కానీ, విద్యుత్ శాఖ ఇదేమీ తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. లాల్‌బజార్ సెక్షన్ పరిధిలోని టెలికాం కాలనీలో శనివారం తెల్లవారుజామున భారీ వృక్షం కూలి వీధి దీపాల కేబుల్‌పై పడి, వైరు తెగిపోయినా అధికారులు సకాలంలో స్పందించలేదు. చివరకు కారును పక్కకు జరిపే క్రమంలో వైరు తగిలి సందీప్, ఆయన కుమార్తె రితిక అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సందీప్ భార్య ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.
స్పందన లేని కాల్ సెంటర్.. స్థానిక సిబ్బంది గైర్హాజరు!
నగరంలో విద్యుత్ సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నం. 1912 కేవలం అలంకారప్రాయంగానే మారిందనే విమర్శలు వస్తున్నాయి. నగరంలో విద్యుత్ నిలిచిపోవడంపై ఫిర్యాదు చేద్దామని శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కాల్ చేస్తే క్యూలో ఉన్నారనే వస్తోంది తప్ప ఒక్కసారి కూడా కనెక్ట్ కాలేదు. స్థానిక విద్యుత్ సిబ్బంది సైతం ఫోన్ కాల్స్ అటెండ్ చేయడం లేదు" అని తిమ్మారెడ్డి అనే వినియోగదారుడు వాపోయారు. సాధారణ విద్యుత్ సరఫరా లేదనే సమాచారం ఇచ్చేందుకే కాల్ సెంటర్, స్థానిక సిబ్బంది స్పందించనప్పుడు.. అత్యవసర విద్యుత్ ప్రమాదాల సమయంలో ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కావడం లేదని ఆయన తెలిపారు.
బాధ్యతారాహిత్యం.. మృతులదే తప్పన్న విధంగా సీఎండీ ప్రకటన!
లాల్ బజార్ ఘటనపై టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ స్పందించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శాఖాపరమైన లోపాలను కప్పిపుచ్చుకుంటూ.. మృతులే వచ్చి విద్యుత్ వైర్లను తాకడం వల్లే ప్రమాదం జరిగిందనే కోణంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎండీ ప్రకటన ప్రకారం.. కారుపై చెట్టు విరిగిపడటంతో పాటు కరెంట్ వైరు కూడా తెగిపడింది. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు కారును పక్కకు జరపడానికి ప్రయత్నిస్తూ, విద్యుత్ వైరును గమనించారు. కారు యజమాని సందీప్ భార్య ఆ వైరును పక్కకు తొలగించేందుకు ప్రయత్నించగా ఆమెకు విద్యుత్ షాక్ తగిలిందని, ఆమెను రక్షించే క్రమంలో సందీప్, కుమార్తె రితిక మృతి చెందారని తెలిపారు. భారీ గాలివాన వల్ల అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది మరమ్మత్తుల్లో ఉన్నారని, సమాచారం అందిన వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ సరఫరా నిలిపివేశామని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తెగిపడిన వైర్లు కనిపిస్తే కాల్ సెంటర్ 1912కు లేదా సమీప అధికారులకు సమాచారం ఇవ్వాలని, స్వయంగా వైర్లను తాకే ప్రయత్నం చేయవద్దని సీఎండీ సూచించారు. అయితే, గ్రౌండ్ లెవెల్‌లో కాల్ సెంటర్ పనిచేయనప్పుడు ప్రజలు సమాచారం ఎలా ఇవ్వాలో మాత్రం సీఎండీ తన ప్రకటనలో చెప్పకపోవడం గమనార్హం.






