- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దక్షిణ మధ్య రైల్వేలో సరికొత్త రికార్డుల హోరు!
దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డు నెలకొల్పింది.

దిశ, తెలంగాణ బ్యూరో: అటు ఉత్తరాదిని, ఇటు దక్షిణాదిని కలిపే అతిపెద్ద రైల్వే వారధిగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే రూపురేఖలు మారిపోతున్నాయి. నిన్నటి వరకు రద్దీతో నత్తనడకన సాగిన ప్రయాణాలు.. ఇకపై మెరుపు వేగాన్ని అందుకోబోతున్నాయి. ప్రయాణికుల కష్టాలకు ఫుల్‌స్టాప్ పెడుతూ, మౌలిక సదుపాయాల కల్పనలో ద.మ. రైల్వే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. 2025-26లో అసాధారణ ప్రగతిని సాధించిన ఈ జోన్... ప్రస్తుత ఏడాది (2026-27)కి భారీ నిధుల విడుదలతో పనులను మరింత వేగవంతం చేయనుంది.
ట్రాక్ నెట్‌వర్క్‌లో కొత్త శకం
గత ఏడాది జోన్ పరిధిలో మొత్తం 194.57 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్ పనులను పూర్తి చేసింది. ఇందులో నూతన మార్గాలు, డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కీలకమైన ట్రాక్ నెట్‌వర్క్‌లో పురోగతి సాధించడంతో సరుకు, ప్రయాణికుల రవాణాకు మార్గం మరింత సుగమమవుతోంది. మౌలిక సదుపాయాల కల్పనలో ఈ స్థాయి దూకుడు జోన్ చరిత్రలోనే మైలురాయిగా నిలవనుంది. మల్లవరం - కనిగిరి మధ్య 35.93 కి.మీ కొత్త మార్గం అందుబాటులోకి రావడంతో మారుమూల ప్రాంతాలకు రైలు కూత వినిపించింది.
అదనపు హంగులు.. బైపాస్ లైన్లు
ప్రధాన జంక్షన్లలో ఇంజిన్ మార్పులు, రైళ్ల నిలుపుదల వంటి సమస్యలను తొలగించేందుకు కాజీపేట, వాడి, పెద్దపల్లి వద్ద బైపాస్ లైన్లను నిర్మించారు. అలాగే తాండూరు వద్ద నిర్మించిన ‘వై’ అనుసంధానం వల్ల ముంబై మార్గంలో సరుకు రవాణా మరింత సులభతరం కానుంది. ఇక విద్యుదీకరణ విషయానికొస్తే.. ఏడాదిలోనే 325 కి.మీ ట్రాక్‌ను విద్యుదీకరించి పర్యావరణహిత రైల్వే దిశగా జోన్ అడుగులు వేసింది.
భారీగా నిధులు కేటాయింపు
మౌలిక సదుపాయాల వేగాన్ని కొనసాగించేందుకు కేంద్రం ఈసారి బడ్జెట్‌లో 18.3 శాతం అదనంగా నిధులు కేటాయించింది. రూ.13,026 కోట్ల కేటాయింపుతో పనులు వేగం పుంజుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఇందులో డబ్లింగ్ పనులకు రూ.5,083 కోట్లు, కొత్త లైన్ల నిర్మాణానికి రూ.1,315 కోట్లు, ట్రాక్ పునరుద్ధరణకు రూ.1,908 కోట్లు, ట్రాఫిక్ సౌకర్యాలకు రూ.403 కోట్లు, రైల్వే భద్రతా పనులకు రూ.683 కోట్లు కేటాయించారు.
క్లియర్ రూట్.. ఫాస్ట్ జర్నీ
గూడూరు నుంచి విజయవాడ, కాజీపేట మీదుగా బలార్షా వరకు ఉన్న అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ మార్గంలో మూడో లైన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం 700 కి.మీ మార్గానికి గాను, కేవలం 38 కి.మీ (పెదవడ్లపూడి-కృష్ణా కెనాల్, డోర్నకల్-మహబూబాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్-ఆసిఫాబాద్) మినహా మిగిలిన పనులన్నీ పూర్తయ్యాయి. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఉత్తర-దక్షిణ భారత దేశాల మధ్య రైళ్ల రాకపోకలు మెరుపు వేగంతో సాగనున్నాయి.
డబ్లింగ్ ధమాకా..
పాణ్యం- నంద్యాల (13.488 కి.మీ)
బాసర- నవీపేట (17 కి.మీ)
కాజీపేట వద్ద బైపాస్ లైన్ (21.46 కి.మీ)
వాడి వద్ద బైపాస్ లైన్ (22.70 కి.మీ)
తాండూరు వద్ద వై జంక్షన్ (1.95 కి.మీ)
పెద్దపల్లి వద్ద బైపాస్ లైన్ (2.17 కిమీ)
మొత్తం డబ్లింగ్- 78.768 కి.మీ.
మూడో లైన్ జోరు...
బలార్షా- మాణిక్‌ఘర్ (6.91 కి.మీ),
రెచ్ని రోడ్- బెల్లంపల్లి (9.636 కి.మీ),
బెల్లంపల్లి- మందమర్రి (7.52 కి.మీ)
మోటుమర్రి- మధిర (5.80 కి.మీ.)
మహబూబాబాద్- నెక్కొండ (30.416 కి.మీ)
ఖమ్మం- డోర్నకల్ (19.59 కి.మీ)
మొత్తం ట్రిప్లింగ్ - 79.872 కి.మీ
టీమ్ వర్క్‌కు దక్కిన గౌరవం
ఇంజినీరింగ్, సిగ్నలింగ్, ఎలక్ట్రికల్ వంటి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ అసాధారణ ఫలితాలు సాధ్యమయ్యాయి. పెరిగిన బడ్జెట్ కేటాయింపులతో సామాన్య ప్రయాణికుడికి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం.
- సంజయ్ కుమార్ శ్రీవాస్తవ,
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్






