మీర్‌పేట్ మాధవి హత్యకేసులో కీలక మలుపు.. విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-13 10:46:11  IST  )

ఈ ఏడాది జనవరి 16న మీర్ పేటలో మాధవి అనే వివాహితను ఆమె భర్త గురుమూర్తి అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.

మీర్‌పేట్ మాధవి హత్యకేసులో కీలక మలుపు.. విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది జనవరి 16న మీర్ పేటలో మాధవి అనే వివాహితను ఆమె భర్త గురుమూర్తి అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. తాజాగా ఈ కేసు విచారణలో కీలక మలుపు చోటుచేసుకుంది. మాధవి హత్యకేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తులో సేకరించిన సైంటిఫిక్ ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ చేపట్టిన రెండు నెలల్లోనే తీర్పు వస్తుందని పేర్కొన్నారు. ఈనెల 17వ తేదీ నుంచి మాధవి హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు రోజువారీ ట్రయల్స్ జరపనుంది.

కాగా.. మాధవి హత్య ఎలా జరిగిందని పోలీసులు గురుమూర్తితో కలిసి సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసినపుడు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. భార్యను ఎలా చంపాడో అతను చెప్పిన విషయాలు విన్న పోలీసులే షాకయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీలో జవానుగా పనిచేసి రిటైర్ అయిన గుర్తుమూర్తి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్యను చంపాలని ముందే ప్లా్న్ చేసుకున్న అతను.. పిల్లల్ని పండగ పేరుతో బంధువుల ఇంటికి పంపించాడు. 16వ తేదీ ఉదయం లేవగానే ఉద్దేశపూర్వకంగానే గొడవ పెట్టుకున్నాడు. కోపంతో చెంపపై కొట్టడంతో.. కుప్పకూలిపోయింది. స్పృహకోల్పోయిన మాధవిని గొంతునులిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆ తర్వాత ఆమెను వివస్త్రను చేసి.. బాత్రూమ్ లోకి లాక్కెళ్లి.. తల మొండెం వేరు చేశాడు. కాళ్లు చేతులు నరికి, వాటిని ముక్కలు చేసి ఉడకబెట్టి, కాల్చి, ఎముకలను పొడి చేసి.. ఆ పొడిని ఒక చెరువులో కలిపేశాడు. భార్యను చంపినా పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఇదంతా చేసినట్లు పోలీసులు నిర్థారించారు.

Next Story