రెరా లేదు.. హెచ్‌ఎండీఏ పర్మిషన్ లేదు.. 'సాయి వనం' విల్లాల కొనుగోలుదారులకు పొంచివున్న ముప్పు!

by Gantepaka Srikanth |

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని మైలారం గ్రామ పరిధిలో ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ (SRR Developers) చేపట్టిన "సాయి వనం" (Sai Vanam) ప్రాజెక్ట్ చట్ట విరుద్ధంగా సాగుతోంది.

రెరా లేదు.. హెచ్‌ఎండీఏ పర్మిషన్ లేదు.. సాయి వనం విల్లాల కొనుగోలుదారులకు పొంచివున్న ముప్పు!
X

దిశ, నల్లగొండ బ్యూరో/యాదాద్రి కలెక్టరేట్: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని మైలారం గ్రామ పరిధిలో ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ (SRR Developers) చేపట్టిన "సాయి వనం" (Sai Vanam) ప్రాజెక్ట్ చట్ట విరుద్ధంగా సాగుతోంది. ఫామ్ ల్యాండ్ విల్లాలు అంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో నిబంధనలను తుంగలో తొక్కారు. అందమైన బ్రోచర్లు సోషల్ మీడియాలో వెబ్ పేజీలను క్రియేట్ చేసి అమాయక కస్టమర్లకు ఎర వేస్తున్నారు. విల్లా నిర్మించి మేమే ప్రతి నెల అద్దె చెల్లిస్తామని నమ్మబలుకుతూ ప్రజలను నట్టేట ముంచే ప్రయత్నం జరుగుతుంది. సాయి వనం ప్రాజెక్టు పేరుతో ఇష్టారాజ్యంగా అమాయక ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైలారం గ్రామంలో సర్వే నెంబర్ 238/లూ, 243/ఉ, 246/ఈ 1/1/1, 247/రూ /1/1, 248/ఉ, 265/ఊ2ఓ లలో ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ సంస్థ 13.27 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది. సాయి వనం ప్రాజెక్టు పేరుతో ఫార్మ్ ల్యాండ్ వెంచర్ నిర్మాణానికి తెర లేపారు. 121, 242,363 గజాల స్థలంలో సింగిల్ బెడ్ రూమ్, డబల్ బెడ్ రూమ్ విల్లా కాటేజీలను నిర్మిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న గ్రామంలో ఫామ్ ల్యాండ్ నిర్మాణం చేయడం హెచ్ఎండీఏ నిబంధనలకు విరుద్ధం. అయిన ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ సంస్థ హెచ్ఎండీఏ నిబంధనలను తుంగలో తొక్కి రోడ్లు వేసి ఫామ్ ల్యాండ్ ప్లాట్లను అమాయక ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అనుమతులు లేకుండానే విల్లాల నిర్మాణం..

హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న స్థలాలలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా అనుమతి తప్పనిసరి. వ్యవసాయ భూమిని వ్యవసాయతర భూమిగా భూమార్పిడి చేసి హెచ్ఎండీఏ అనుమతులు పొందాల్సి ఉంటుంది. కానీ హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం ఫార్మ్ ల్యాండ్ వెంచర్లలో నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధం. సంబంధిత గ్రామపంచాయతీ లేదా హెచ్ఎండీఏ అనుమతులు లేకుండా నిర్మించిన నిర్మాణాలు ఎప్పుడైనా హెచ్ఎండీఏ, స్థానిక సంస్థలు కూల్చివేసే అవకాశం ఉంది. ఈ నిబంధనలను పట్టించుకోని ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ అక్రమంగా విల్లా కాటేజీలను నిర్మించి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు.

121 గజాల విల్లాకు 18 లక్షలా..?

సాయి వనం ప్రాజెక్టులో నిర్మించే 121 గజాల కాటేజీలకు 18 లక్షల ధర నిర్ణయించారు. 242 గజాలలో నిర్మించే డబల్ బెడ్ రూమ్ కాటేజీ ధర 28 లక్షలు నిర్ణయించి విక్రయిస్తున్నారు. 121 గజాల స్థలంలో నిర్మించే సింగిల్ బెడ్ రూమ్ కాటేజీకి గజానికి సుమారు 15 వేల రూపాయలు పడుతుంది. 242 గజాల స్థలంలో నిర్మించే డబల్ బెడ్ రూమ్ కాటేజీకి సుమారు 11,500 రూపాయలు పడుతుంది. డీటీసీపీ, రెరా, హెచ్ఎండీఏ వంటి సంస్థల అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ వెంచర్ యాజమాన్యం కోట్ల రూపాయలు ప్రజల నుండి కొల్లగొడుతోంది.

అందమైన బ్రోచర్లతో గాలం..

ఈ రియల్ ఎస్టేట్ సంస్థ అందమైన బ్రోచర్లను ముద్రించి ఎంతో కొంత పొదుపు చేసుకుని భూమి కొనాలనుకున్న వారికి గాలం వేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈ బ్రోచర్లను సర్కులేట్ చేస్తూ క్యాబ్, భోజనాలు వంటి వసతులు కల్పించి అమాయక ప్రజల ఆశలను వారికి అవకాశంగా మలుచుకుంటున్నారు. రెరా అనుమతి లేని మార్కెటింగ్ ఏజెంట్ల ద్వారా ప్రచారం చేస్తూ ఫామ్ ల్యాండ్ ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఈ బ్రోచర్లు, భోజన వసతులకు తలొగ్గి వచ్చిన కస్టమర్లకు ప్లాట్ కొనుగోలు చేసిన తర్వాత తిరిగి ఈ ఏజెంట్లు కనిపించే అవకాశమే లేదు. అక్కడ ఏదైనా సమస్య తలెత్తితే పట్టించుకునే నాధుడే లేకుండా పోతారు.

బై బ్యాక్, అద్దె ఆశ చూపి..

సాయి వనం ప్రాజెక్టులో విల్లా ఫామ్ లాండ్‌ను కొనుగోలు చేస్తే ప్రతి నెల అద్దె వస్తుందని ఆశ చూపుతున్నారు. ఈ వ్యాపార సంస్థ నిర్మించిన వెంచర్లు ప్లాట్‌ను కొనుగోలు చేస్తే కొద్దికాలం తర్వాత తిరిగి మేమే కొనుగోలు చేస్తామని బై బ్యాక్ ఆప్షన్‌ను కస్టమర్ల ముందు పెడుతున్నారు. ప్రతినెల విల్లా కాటేజీలకు సింగిల్ బెడ్ రూమ్‌కు 7000 రూపాయలు, డబుల్ బెడ్ రూమ్ కు 10000 రూపాయలు అద్దె వస్తుందని చెప్పడంతో అమాయక ప్రజలు నమ్మి మోసపోతున్నారు. కస్టమర్లు ఎంచుకున్న స్థలంలో విల్లా కాటేజీ నిర్మించి కొన్ని ఎర్రచందనం మామిడి వంటి చెట్లను పెంచి వాటి మెయింటెనెన్స్ కూడా ఈ రియల్ ఎస్టేట్ సంస్థని చూసుకుంటుందని నమ్మబలుకుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఇలాంటి వెంచర్లలో పెట్టుబడులు పెట్టి మోసపోకూడదని రియల్ ఎస్టేట్ నిపుణులు తెలుపుతున్నారు.

Next Story