- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ 8 రకాల వంగడాలతోనే రైతులకు లాభాలు.. కేబినెట్ సబ్ కమిటీకి నిపుణుల సూచన
ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో విదేశీ డిమాండ్ ఉన్న 8 రకాల వరి సాగును ప్రోత్సహించాలని నిపుణులు సూచించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ అద్భుతమైన డిమాండ్ ఉన్న 8 రకాల మేలురకం వరి సాగుపై రైతులకు పెద్ద ఎత్తున విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి సూచించారు. ఇవాళ ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో వ్యవసాయ నిపుణులు కీలక సూచన చేశారు. మంత్రులు డి.శ్రీధర్ బాబు, ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు హాజరైన ఈ సమావేశాంలో రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి, ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు, నిల్వ సదుపాయాలు, వానకాలం సాగుపై కేబినెట్ సబ్ కమిటి చాలా లోతుగా సమీక్ష చేసింది. ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు, శాస్ర్తవేత్తలు పాల్గొని పలు కీలక ప్రతిపాదనలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.
8 రకాల వంగడాలు ఇవే:
రైతులకు లాభాదాయకం, ఎగుమతులకు అనుకూలమైన BPT 5204, తెలంగాణ సోనా (RNR 15048), KNM-1638, జై శ్రీరామ్, హెచ్ఎంటీ, WGL 962, WGL 44, JGL 1798 ఈ 8 రకాల వంగడాలను రైతులు పెద్ద ఎత్తున సాగు చేసుకునేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కేబినెట్ సబ్ కమిటీకి స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక 8 రకాల వంగడాలను సాగు చేయడం వల్ల రైతులకు మార్కెట్లో తిరుగులేని డిమాండ్ లభిస్తుందని వివరించారు. మార్కెట్లో ఈ బియ్యానికి ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా, ప్రభుత్వ మద్దతు ధర కంటే చాలా ఎక్కువ ధర పలికే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ నుంచి విదేశాలకు ఎగుమతి చేయడానికి ఇవి అత్యంత అనుకూలమైనవని, ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలలో ఈ బియ్యానికి విపరీతమైన ఆదరణ ఉందని పేర్కొన్నారు. దీనివల్ల ఇది రైతులకు అత్యంత లాభదాయకమైన పంటగా మారనుందని ఈ మేలు రకం పంటలను సాగు చేయడానికి మార్కెట్లో విత్తనాల కొరత లేదని, కాబట్టి సాగును విస్తృతం చేయడం సులువని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
రైతుల ఆదాయానికి ఇదొక్కటే మార్గం:
రైతుల ఆదాయం గణనీయంగా పెరగాలన్నా, అంతర్జాతీయ మార్కెట్ ధరల్లో వచ్చే ఒడిదొడుకుల (రిస్క్) నుండి రైతులకు పూర్తి రక్షణ లభించాలన్నా ఈ 8 రకాల వంగడాల సాగు ఒక్కటే మార్గం అని నిపుణులు కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ఈ వంగడాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, క్షేత్రస్థాయిలో రైతులను చైతన్యపరచడానికి ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. రాబోయే సీజన్లలో ఈ రకాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా అటు రైతులకు అదనపు ఆదాయం, ఇటు మార్కెట్ రంగానికి పూర్తి ప్రయోజనం చేకూరుతుందని, వరి సాగులో తెలంగాణ రాష్ట్రం మరింత లాభదాయకమైన దిశగా అడుగులు వేస్తుందని వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు సైతం కేబినెట్ సబ్ కమిటీకి నివేదించారు.
కేంద్రం విధానాలకు అనుగుణంగా:
కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను కొనసాగించాలని కేబినెట్ సబ్ కమిటికి అధికారులు నివేదించారు. భవిష్యత్తులో రైతులకు నష్టాలు రాకుండా ఉండేందుకు పూర్తిగా మార్కెట్ డిమాండ్ ఆధారిత పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులు మంత్రులకు వివరించారు. రాష్ట్రంలో సాగు చేస్తున్న అన్ని రకాల సన్న బియ్యానికి మార్కెట్లో ఆదరణ లభించడం లేదని సివిల్ సప్లై అధికారులు ఈ సందర్భంగా మంత్రులకు వివరించారు. కొన్ని రకాల వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తున్నప్పుడు బియ్యం ఎక్కువగా విరిగిపోతుండటం (బ్రోకెన్ రైస్), అలాగే వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా అవి లేకపోవడంతో మిల్లర్లు, వ్యాపారులు వాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడటం లేదని తెలిపారు.






