- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు డ్రోన్ల వినియోగం, టెక్నాలజీ అందించాలి.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
రైతులు మార్కెటింగ్ అవకాశాలు ఉన్న పంటలనే సాగు చేసి పంట మార్పిడి విధానాలని అనుసరించాలని, వ్యవసాయ రంగంలో కూలీల సమస్య అధిగమించేందుకు డ్రోన్ల వినియోగం రైతులకు వివరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రైతులు మార్కెటింగ్ అవకాశాలు ఉన్న పంటలనే సాగు చేసి పంట మార్పిడి విధానాలని అనుసరించాలని, వ్యవసాయ రంగంలో కూలీల సమస్య అధిగమించేందుకు డ్రోన్ల వినియోగం రైతులకు వివరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. శనివారం 99 రోజుల ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తలపెట్టిన విత్తన వారోత్సవాలు కార్యక్రమం ప్రారంభించి 10 మంది రైతులకు వివిధ పంటలకు చెందిన నాణ్యమైన మూల విత్తనాలని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన డ్రోన్ ఆధారిత వివిధ వ్యవసాయ విధానాల్ని అభినందించారు. ఇటీవల ఎస్బీఐ, సీఎస్ఆర్ నిధుల సాయంతో అభివృద్ధి చేసిన రోబోటిక్స్, సెన్సర్ బేస్డ్ ప్రయోగశాలని సందర్శించి రోబోలను వ్యవసాయ రంగంలో ఉపయోగించే విధంగా అభివృద్ధి చేసినందుకు శాస్త్రవేత్తల సేవలు ఆమోఘమన్నారు. వర్సిటీలో ఏర్పాటు చేసిన ల్యాబ్ ను సందర్శించి రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన ఉపగ్రహ ఆధారిత గణాంకాల గురించి తెలుసుకున్నారు. రాష్ట్రం లోని రైతాంగం యాజమాన్యం పరిధిలో ఉన్న మొత్తం భూమిలో సుమారు 9.3 శాతం భూమి సాగు లో లేదని వర్సిటీ అధికారులు తెలిపినట్లు చెప్పారు. విత్తన వారోత్సవాల్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం చాలా అభినందనీయమని, కొన్ని విత్తన కంపెనీల మాయ మాటలకి మోసపోకుండా రైతులు ఈ నాణ్యమైన విత్తనాలు వినియోగించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.
60 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సహా అనేక మంది మహానుభావుల తోడ్పాటుతో దేశంలో ప్రముఖ స్థానంలో నిలిచిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తోడ్పాటుతో విశ్వవిద్యాలయం ఇంకా పురోగతి సాధిస్తుందని, శాస్త్రవేత్తలు నిరంతరం రైతులతో మమేకమై వారికి కావలసిన పరిష్కారాలు అందించాలన్నారు. అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న అనేక అధునాతన టెక్నాలజీని విశ్వవిద్యాలయం రైతాంగానికి అందుబాటులోకి తీసుకొని రావాలని సూచించారు. సాగుకు కీలకమైన నాణ్యమైన విత్తనాలను రైతాంగానికి అందించాలనే ఉద్దేశంతో గత ఏడాది నుంచి ఈ విత్తన పంపిణీ కార్యక్రమం చేపట్టామని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి అల్దాస్ జానయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశోధన సంచాలకులు డాక్టర్ మరాఠి బలరామ్, బాలాజీ నాయక్, నీలిమ, వెంకటేశ్వర్లు, జెల్లా సత్యనారాయణ, వై.చంద్రమోహన్ శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.






