- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కౌలు రైతులకు అండగా రైతు కమిషన్.. 2011 చట్టం అమలుకు మరోసారి డిమాండ్
రాష్ట్రంలోని కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి రైతు కమిషన్ కట్టుబడి ఉందని ఛైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి రైతు కమిషన్ కట్టుబడి ఉందని ఛైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. 2011 కౌలు రైతు చట్టాన్ని అమలు చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రభుత్వానికి లేఖ రాశామని వెల్లడించారు. ప్రతి కౌలు రైతుకు వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు కార్డులు జారీ చేసి, వాటిని ప్రతి 11 నెలలకు ఒకసారి పునరుద్ధరించే విధానం తీసుకురావాలని సూచించామని తెలిపారు. సోమవారం తమ కార్యాలయంలో రాష్ట్రంలోని కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు కమిషన్ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు రాములు నాయక్, కెవిఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భవాని రెడ్డి, భూమి సునీల్, కమిషన్ మెంబర్ సెక్రటరీ గోపాల్, స్పెషల్ ఆఫీసర్ కేశవులు, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు కన్నెగంటి రవి, కొండల్, కిరణ్, కౌలు రైతుల సాధన కమిటీ సభ్యులు, డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ ప్రతినిధులు, కౌలు రైతులు, అధికారులు సంధ్యారాణి, హరి వెంకట ప్రసాద్, రజిత తదితరులు పాల్గొన్నారు.
కౌలు రైతుల ప్రధాన సమస్యలైన గుర్తింపు కార్డుల జారీ, పంట రుణాల లభ్యత, యూరియా సరఫరా, పంట విక్రయాల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అనంతరం ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ కౌలు రైతుల సమస్య సామాజిక, ఆర్థిక కోణాలతో ముడిపడి ఉందన్నారు. భూమి ఇచ్చినా యాజమాన్య హక్కులకు ఎలాంటి భంగం కలగదనే నమ్మకాన్ని భూ యజమానుల్లో కల్పించేలా చట్టపరమైన రక్షణ అవసరమని చెప్పారు. కౌలు రైతులు బలహీన వర్గమని, ప్రభుత్వం వారికి అండగా నిలవాలని సూచించారు. అదే విధంగా ప్రొఫెసర్ నర్సింహారెడ్డి వివరిస్తూ తెలంగాణలో కౌలు రైతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ కౌలు రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదన్నారు. కేరళ తరహాలో బలమైన కౌలు చట్టాలు తెలంగాణలోనూ అవసరమని అభిప్రాయపడ్డారు. కౌలు రైతుల సమస్యలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని, భూ యజమానుల అంగీకారం లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారిందని రైతు కమిషన్సభ్యులు భూమి సునీల్పేర్కొన్నారు. 2011 చట్టం అమలుకు సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. యూరియా పంపిణీ, పంట విక్రయాల్లో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించవచ్చని తెలిపారు. వీరితో పాటు రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి కన్నెగంటి రవి, కౌలు రైతుల సాధన కమిటీకి చెందిన కిరణ్, మహిళా రైతు చుక్కమ్మ తమ అభిప్రాయాలను వెల్లడించారు.






