అక్రమార్కులకు అడ్డగా మారిన గుడి మల్కాపూర్ పూల మార్కెట్​

by Ajay Maddhiboyina |

గ్రేటర్​ నగర ప్రజలకు అందుబాటులో ఉన్న గుడి మల్కాపూర్​పూల మార్కెట్ లో కనీస వసతులు, నిర్వహణ సక్రమంగా లేదని రైతు కమిషన్​ చైర్మన్​ కోదండరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

అక్రమార్కులకు అడ్డగా మారిన గుడి మల్కాపూర్ పూల మార్కెట్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్​ నగర ప్రజలకు అందుబాటులో ఉన్న గుడి మల్కాపూర్​పూల మార్కెట్ లో కనీస వసతులు, నిర్వహణ సక్రమంగా లేదని రైతు కమిషన్ ​చైర్మన్​ కోదండరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్కెట్ సెక్రెటరీ, అధికారులు, సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడం, మార్కెట్ నిర్వహణ రికార్డులు బీరువాలో పెట్టుకొని తాళం వేసుకొని వెళ్లడంపై మండిపడ్డారు. ఆదివారం ఉదయం మార్కెట్​ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నగరంలో ఉన్న మార్కెట్ లన్ని దళారులకు అడ్డాలుగా మారాయని గతంలో బోయిన్ పల్లి మార్కెట్ లో కూడా ఇదే పరిస్థితి కనిపించిందన్నారు. మార్కెట్ కు వచ్చే రైతు పరిస్థితి బాగాలేదని, కమిషన్ ఏజెంట్, వ్యాపారి, అధికారులు సంపాదించుకోవడానికి అడ్డగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నగరంలోని మార్కెట్లలో చాలా లోపాలున్నాయి. మార్కెట్ అధికారులు అక్రమ లైసెన్స్ లు ఇచ్చారని, మార్కెట్లో ఖాళీ స్థలం ఉంటే అమ్ముకోడానికి అనుమతులు ఇచ్చారని, పార్కింగ్ స్థలం కూడా లేకుండా అక్రమ వ్యాపారులు దోచుకునే విధంగా మారిందన్నారు. బయో ప్లాంట్ పాడైపోయింది, మార్కెట్ చుట్టూ ఉండే ప్రహరీ గోడ కూలిపోయింది, మార్కెట్ అంత మురుగు నీటితో నిండిపోయింది. వచ్చే వారికీ పోయేవారికి సరైన మార్గం కూడా ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖలు పట్టించుకునే నాథుడే లేడని, రైతు ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన మార్కెట్లు లోపభూయిష్టంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ కు వచ్చే రైతుకు ఎలాంటి లాభం జరిగేలా కనిపించడం లేదన్నారు.

Next Story