భూ భారతిపై హరీశ్ చేసిన ఆరోపణలు నిరాధారం.. రైతు కమిషన్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

మాజీ మంత్రి హరీశ్ రావు భూభారతి చట్టం అమలు విషయంలో చేసిన ఆరోపణలు నిరాధారం అని రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి ఖండించారు.

భూ భారతిపై హరీశ్ చేసిన ఆరోపణలు నిరాధారం.. రైతు కమిషన్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి హరీశ్ రావు భూభారతి చట్టం అమలు విషయంలో చేసిన ఆరోపణలు నిరాధారం అని రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి ఖండించారు. హరీశ్ రావు లేవనెత్తిన అంశాలన్ని బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ తప్పిదాలను సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వంపై రుద్దడం తగదని కోదండరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చేసిన దాష్టికాల వల్ల భూసమస్యలతో రైతులు సతమతమయ్యారు.. సమస్యల పరిష్కారానికి మార్గం లేక కోర్టుల చుట్టూ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. గత ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన భూ రికార్డులు, ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా నంబర్లను ఓ అమెరికా కంపెనీకి (టెర్రాసిస్ టెక్నాలజీస్) అప్పగించారని తెలిపారు. ఆ నేపథ్యంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు. ధరణి స్థానంలో భూ భారతి చట్టం తెచ్చి రైతాంగం వద్దకే రెవెన్యూ అధికారులను పంపి దరఖాస్తులు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

సాదాబైనామా దరఖాస్తులను స్వీకరించి, అప్పటి ప్రభుత్వం పరిష్కారాన్ని గాలికి వదిలేస్తే.. ఈ ప్రభుత్వం భూ భారతిలో ఈ విషయాన్ని చేర్చడమే కాక, హైకోర్టు స్టే ఎత్తివేసేలా కృషి చేసి సాదా బైనామా క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించిందన్నారు. ప్రైవేట్ చేతుల్లో ఉన్న ధరణి పోర్టల్ ను ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఐసీకి అప్పగించిందన్నారు. భూ పరిపాలన వ్యవస్థను బలోపేతం చేయడానికి గ్రామ స్థాయిలో గ్రామ పరిపాలన అధికారులను, మండల స్థాయిలో లైసెన్స్ సర్వేయర్లను నియమించిందని, గత 6 నెలల్లో భూ భారతి అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. తమ కార్యాలయానికి ఇప్పటివరకు వచ్చిన 3వేల మంది రైతులకు పరిష్కార మార్గాలు సూచించి.. స్థానిక రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. లక్షల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారం జరగాలంటే, క్షేత్ర స్థాయి యంత్రాంగం పటిష్టంగా పనిచేయాలన్నారు.

ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అమలు, అనుభవాల ఆధారంగా తగిన మార్పు చేర్పులు చేయాలన్నారు. కానీ గత ప్రభుత్వం ఇవి ఏమి చేయకపోవడం వల్లనే ఈ ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన 9 లక్షల దరఖాస్తులు, గత ప్రభుత్వంలో దరఖాస్తులు తీసుకుని పెండింగ్ లో ఉన్న 9 లక్షల సాదాబైనామాల దరఖాస్తుల పరిశీలన కూడా మొదలైందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ కూడా భూమి ఉండి హక్కు లేకుండా ఏ రైతు కూడా ఇబ్బంది పడలేదన్నారు. రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, ఒక ఎమ్మార్వో హత్యకు, ఎంతో మంది రైతుల ఆత్మ హత్యలకు, గొడవలకు గత ప్రభుత్వం కారణమైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో భూమి ఉన్న ప్రతి రైతుకు హక్కు కల్పించేలా చట్టం తేవడం, దాన్ని పకడ్బందీగా అమలు చేయడం.. ఆయన ధృఢ సంకల్పానికి నిదర్శనమని కోదండ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story