రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా రేవంత్ రెడ్డికి కనికరం లేదు: హరీశ్ రావు

by Prasad Jukanti |

ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హరీశ్ రావు విమర్శించారు. రైతుల పక్షాన కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా రేవంత్ రెడ్డికి కనికరం లేదు: హరీశ్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో దారుణంగా ఫెయిల్ అయ్యిందని రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ గ్రామానికి పోయినా కొనుగోలు కేంద్రాల్లో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి.. మీకు ఢిల్లీకి పోవడం, హైదరాబాద్‍కు రావడం తప్ప వేరే పనే లేదా? ఢిల్లీకి వెళ్లి కప్పం కట్టడం తప్ప.. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతుల కష్టాలు ముఖ్యమంత్రికి, మంత్రులకు పట్టవా? అని ప్రశ్నించారు. ఇంతవరకు వడ్ల కొనుగోళ్లపై ఒక్క రోజైనా కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టారా? మీ మంత్రులతో ఒక్క మీటింగ్ అయినా చేశారా అని నిలదీశారు. ఇవాళ మెదక్ జిల్లా చేగుంట మండలం కర్ణాల్పల్లి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హరీశ్ రావు ఈ సందర్భంగ మాట్లాడారు.

ఏసీ రూముల్లో కూర్చుని అబద్దాలు:

ఈ ప్రభుత్వానికి రైతులంటే లెక్క లేదని వారి పట్ల చిన్నచూపు ఉన్నందు వల్లే ఈ దుస్థితి దాపురించిందన్నారు. ఏసీ రూముల్లో కూర్చుని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని ఆయన ఒకసారి పోలీసులను పక్కనపెట్టి రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు తిరిగితే రైతుల కన్నీళ్లు, కష్టాలు ఏంటో అర్థమవుతాయన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ సర్పంచులే ఇవాళ వడ్లు కొనాలని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తున్నారంటే మీ ప్రభుత్వ పరిస్థితి ఎంత దయనీయంగా, దారుణంగా తయారైందో ఒకసారి అర్థం చేసుకోవాలన్నారు. ప్రతిపక్ష నాయకులు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్న ముఖ్యమంత్రికి.. రైతుల బాధల గురించి ఇంటెలిజెన్స్, పోలీసులు నివేదికలు ఇవ్వడం లేదా? అని నిలదీశారు. ప్రభుత్వం తక్షణమే మేల్కొని లారీలు పంపించి, కాంటాలు పెట్టి వడ్లు కొనాలని లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ (BRS Party) ఎమ్మెల్యేలు, నాయకులం అంతా కలెక్టరేట్లను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సివిల్ సప్లైస్ కార్పొరేషన్‍లో అవినీతి:

మక్కలు, శనగలు, సన్ ఫ్లవర్ అమ్మిన రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేయలేదన్నారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభమే కాలేదన్నారు. 35 రోజుల నుంచి సన్ ఫ్లవర్ కొనుగోళ్లు ఆగిపోయాయి. కుప్పల కింద ఆ పంటకు చెదలు పడుతున్నా ప్రభుత్వానికి కనికరం లేదని మండిపడ్డారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్‍లో జరిగిన అవినీతి వల్లే నేడు అది దివాలా తీసిందని ఆ సంస్థ NPA కావడంతో బ్యాంకులు అప్పులివ్వడం లేదన్నారు. దాంతో దొడ్డిదారిన కోఆపరేటివ్ బ్యాంకు నుంచి మార్క్ ఫెడ్ కు, అక్కడి నుంచి సివిల్ సప్లైస్ కు డబ్బులు మళ్లించారు. మీ అవినీతి, తప్పులకు రైతులను బలిచేస్తున్నారు.

Next Story