- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధాన్యం తరుగు పేరుతో రైతన్నకు నిలువు దోపిడీ.. మిల్లర్ల ఇష్టారాజ్యంపై అధికారుల నిర్లక్ష్యం!
తెలంగాణ వ్యాప్తంగా యాసంగి ధాన్యం సేకరణలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా యాసంగి ధాన్యం సేకరణలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రైస్ మిల్లర్లు తేమ, తరుగు, నూక శాతం పేరుతో ధాన్యంలో భారీగా కోతలు విధిస్తుండటంతో రైతులు ఆర్థికంగా నష్టపోతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన..
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో ఈ తరహా దోపిడీ తాజాగా వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కొండ యాకమ్మ, హనుమండ్ల రమాదేవి, గుర్రం చిన్న వెంకన్న, కసిరెడ్డి గురుపాల్ రెడ్డి తదితర రైతులు పండించిన దొడ్డు రకం ధాన్యాన్ని నెల క్రితం కొనుగోలు కేంద్రంలో తూకం వేశారు. అనంతరం మే 16న 769 బస్తాల (307.60 క్వింటాలు) ధాన్యాన్ని మరిపెడలోని హేమధుర్గ రైస్ మిల్లుకు తరలించారు. దాదాపు నెల రోజుల నిరీక్షణ తర్వాత వచ్చిన ట్రక్ షీట్‌లో మిల్లర్లు ఏకంగా 8 బస్తాలకు కోత విధించి, 761 బస్తాలు (304.40 క్వింటాలు)గా మాత్రమే నమోదు చేసినట్లు స్థానిక ఐకేపీ నిర్వాహకులు గుర్తించారు. దీంతో అకారణంగా కోత విధించడం చట్టవిరుద్ధమని, తాము తీవ్రంగా నష్టపోయామని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
అక్రమాలకు దారితీస్తున్న ప్రధాన లోపాలు..
తూకం వేసిన వెంటనే కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు ట్రక్ షీట్ ఇవ్వాల్సి ఉన్నా, రైస్ మిల్లర్ల వద్ద నుంచి తీసుకోవాల్సి వస్తుండటంతో మిల్లర్లు ఆడిందే ఆటగా మారుతోంది. కోతలు పెడితే కఠిన చర్యలు ఉంటాయన్న ప్రభుత్వ హెచ్చరికలు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అధికారులు మిల్లర్ల తీరును చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
రైతుల డిమాండ్..
తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల చాలా మంది రైతులు మిల్లర్ల చేతిలో మోసపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సంబంధిత జిల్లా కలెక్టర్, పౌరసరఫరాల శాఖ, మండల వ్యవసాయాధికారులు తక్షణమే విచారణ చేపట్టి, నిబంధనలు అతిక్రమించిన రైస్ మిల్లు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.






