50 ఏళ్ల తర్వాత ఇంటికొచ్చిన కొడుకు! వెంటనే తల్లి ఏం చేసిందంటే?

by Ramesh Naini |

15 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ వ్యక్తి.. ఏకంగా అర్ధ శతాబ్దం తర్వాత సాధువు రూపంలో తిరిగి వచ్చి తన వృద్ధ తల్లిని చేరుకున్నాడు.

50 ఏళ్ల తర్వాత ఇంటికొచ్చిన కొడుకు! వెంటనే తల్లి ఏం చేసిందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: 15 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ వ్యక్తి.. ఏకంగా అర్ధ శతాబ్దం తర్వాత సాధువు రూపంలో తిరిగి వచ్చి తన వృద్ధ తల్లిని చేరుకున్నాడు. ఈ అరుదైన, భావోద్వేగ భరితమైన కలయికకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్ వీడియో ప్రకారం.. తన 15వ ఏట ఇంటిని వీడిన బుధిబల్లభ్‌ అనే వ్యక్తి తొలుత ట్రక్కుల రవాణా రంగంలో పనిచేశాడు. ఆ తర్వాత ఆధ్యాత్మిక మార్గం వైపు ఆకర్షితుడై రాజస్థాన్‌లోని ఓ ఆలయంలో సాధువుగా జీవనం సాగిస్తున్నాడు. అయితే, 2005లో తండ్రి మరణించినప్పటికీ.. కొడుకు తిరిగి వస్తాడన్న ఆశతో ఆ వృద్ధ తల్లి ఇన్నేళ్లుగా ఎదురుచూస్తూనే ఉంది.

తిరిగి ఎందుకు వచ్చాడంటే..

పూర్తిస్థాయిలో సన్యాస దీక్ష స్వీకరించే ముందు కన్నతల్లి చేతుల మీదుగా తొలి భిక్ష తీసుకోవాలని ఆధ్యాత్మిక గురువు ఆదేశించడంతో.. బుధిబల్లభ్‌ 50 ఏళ్ల తర్వాత తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత కొడుకును చూసిన ఆ మాతృమూర్తి ఆనందభాష్పాలతో అతడిని హత్తుకుంది. వెంటనే తల్లి ఇంట్లోకి వెళ్లి తన కొడుకు కోసం ఒక కుర్చీని బయటకు తీసుకుని రావడం వీడియోలో కన్పిస్తోంది. ఈ హృద్యమైన దృశ్యాలు చూసి గ్రామస్థులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఎన్ని దశాబ్దాలు గడిచినా తల్లి ప్రేమ ఎప్పటికీ చెరగనిది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, తల్లి నుంచి భిక్ష స్వీకరించిన అనంతరం తాను తిరిగి రాజస్థాన్‌కు వెళ్లిపోతానని ఆ సాధువు స్పష్టం చేశాడు.

Next Story